
హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డితో సమావేశమైన ఫోర్టమ్ కంపెనీ ప్రతినిధులు
సాక్షి,సిటీబ్యూరో: కాలుష్యం లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన నగర మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్ కార్లు, ఇతరవాహనాల చార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. పలు స్టేషన్ల వద్ద ఎలక్ట్రికల్ కార్లు, బైక్‌ల చార్జింగ్ పాయింట్లను ఫిన్‌ల్యాండ్ ప్రభుత్వానికి చెందిన ఫోర్టమ్ బహుళ జాతి కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు గురువారం ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిస్టో పెంటినిన్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ రోన్‌బ్లాడ్.. హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డితో సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్నారు. విశ్వవ్యాప్తంగాపలు అభివృద్ధి చెందిన దేశాలుకర్బన ఉద్గారాల ఆనవాళ్లు లేకుండా ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని పెంచుతున్నాయనిఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. ఇటీవలే తమ సంస్థ భారత్‌లో పలు నగరాల్లో ఎలక్ట్రికల్ కార్ల చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇప్పటికే తమ సంస్థ నగరంలోని బేగంపేట్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్, స్టేడియం, తార్నాక, మెట్టుగూడ, హబ్సిగూడ మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్ బైక్‌లు,ఆటోలు వాహనాల చార్జింగ్‌ను ఉచితంగా చేస్తుందన్నారు.
కిలోమీటరుకు రూ.2 మాత్రమే
ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ ధరలు అంతకంతకు పెరుగుతున్న తరుణంలో మెట్రో నగరాల సిటీజన్లు కాలుష్య అవస్థలు, ఇంధన భారం లేని ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రతి కిలోమీటర్‌కు ఎలక్ట్రిక్ కారులో ప్రయాణిస్తే రూ.2 మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఇక కారును చార్జింగ్ చేసుకునేందుకు 45 నుంచి ఒక గంట సమయం మాత్రమే పడుతుందన్నారు. కాగా, ప్రస్తుతం పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని మియాపూర్, బాలానగర్ మెట్రో స్టేషన్ల వద్ద మూడు ఎలక్ట్రికల్ వాహనాల చార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఈ కేంద్రాల్లో ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ బైక్‌లు, ఆటోలను మాత్రమే చార్జింగ్ చేస్తున్నామన్నారు. నగర మెట్రో ప్రాజెక్టులో ప్రవేశపెట్టిన వినూత్న సాంకేతిక విధానాల పట్ల ఆకర్షితులైన ఫోర్టమ్ కంపెనీ ప్రతినిధులు నగరంలో మరిన్ని మెట్రో స్టేషన్ల వద్ద ఎలక్ట్రికల్ వాహనాల చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో ఫోర్టమ్ ఇండియా ఎండీ సంజయ్ అగర్వాల్, అవధీష్ ఝా, హెచ్‌ఎంఆర్‌ఎల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్‌రాజు, ఎస్‌ఈ విష్ణువర్ధన్‌రెడ్డి, జీఎం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment