
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవాలంటే 2030 నాటికి దేశీయంగా 46,000 చార్జింగ్ స్టేషన్లు అవసరమవుతాయని ప్రొఫెషనల్ సర్వీసుల సంస్థ అల్వారెజ్ అండ్ మార్సల్ ఒక నివేదికలో పేర్కొంది. ఈవీ చార్జర్ల నిష్పత్తి చైనా.. నెదర్లాండ్స్‌లో 6గాను, అమెరికాలో 19గాను, భారత్‌లో 135గాను ఉన్నట్లు తెలిపింది. అంటే చైనాలో ప్రతి 6 ఎలక్ట్రిక్ వాహనాలకు ఒక చార్జర్ ఉండగా.. భారత్‌లో మాత్రం ప్రతి 135 వాహనాలకు ఒకటి ఉందని వివరించింది.
ఎలక్ట్రిక్ వాహనాల సదస్సు ది ఈవీకాన్‌ఇండియా 2022 సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు. ఈవీల వినియోగానికి ఎదురవుతున్న సవాళ్ళను ఇందులో ప్రస్తావించారు. ప్రధానంగా ఖరీదు, రేంజి (మైలేజి)పరమైన ఆందోళన, సరఫరా వ్యవస్థ, ఉత్పత్తి భద్రత .. నాణ్యత, రుణ సదుపాయం అంతగా అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు వీటిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.
భారీ వాహన పరిశ్రమ, కాలుష్య సమస్యల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈవీల వినియోగం, నవకల్పనలు వేగవంతంగా పెరగడానికి భారత్‌లో ఇదే సరైన సమయమని వివరించింది. సరఫరా వ్యవస్థ, చార్జింగ్ మౌలిక సదుపాయాలు మెరుగుపడి ఫైనాన్సింగ్‌కు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతే వచ్చే అయిదేళ్లలో పరిశ్రమలోని అనుబంధ విభాగాలు సగటున 50–100 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని అల్వారెజ్ అండ్ మార్సల్ ఇండియా ఎండీ మనీష్ సైగల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment