సాక్షి, అమరావతి: దేశంలో విద్యుత్ వాహనాలు దూసుకుపోతున్నాయి. ఏటేటా ఈ వాహణాల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలోనూ నాలుగేళ్లుగా వీటి సంఖ్య పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోల్చితే విద్యుత్ వాహనాల ధరలు, ఇంధన వ్యయం తక్కువగా ఉండటంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తుండటంతో గత నాలుగేళ్లలో దేశంలో ఏకంగా 16.85 లక్షలకు ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరిగింది. గత ఏడాది దేశశ్యాప్తంగా 10 లక్షలకు పైగా వాహనాలు అమ్ముడుపోయాయి.
కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫేమ్ ఇండియా–1, ఫేమ్ ఇండియా–2 అమలు చేస్తోంది. ఫేమ్–ఇండియా–2 కింద ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఇటీవల పార్లమెంట్‌లో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ప్రోత్సాహక రాయితీని రూ. 10,000 నుంచి రూ. 15,000కు పెంచినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫేమ్ తొలి దశ ఏప్రిల్ 2015 నుంచి 2019 మార్చి నెలాఖరు కొనసాగింది.
ఏప్రిల్ 2019 నుంచి ఫేమ్–2 ప్రారంభమైంది. ఇది 2024 వరకు కొనసాగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్‌ను సృష్టించడంతో పాటు చార్జింగ్ సౌకర్యాలు కల్పనకు, అన్ని రకాల వాహనాలను ప్రోత్సహించడానికి రూ.10 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్‌టీని 12 శాతం నుంచి 5 శాతానికి, అలాగే చార్జర్‌లు, చార్జింగ్‌పైన జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు పేర్కొంది.
రాష్ట్రంలో 2022లో భారీగా పెరిగిన ఎలక్ట్రికల్ వాహనాలు
రాష్ట్రంలోనూ వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2019లో రాష్ట్రంలో 1,474 ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు జరగ్గా.. 2022 సంవత్సరంలో ఏకంగా 25,721 వాహనాల కొనుగోళ్లు జరిగాయి. ఈ నెలలో 23వ తేదీ వరకు 1,675 వాహనాల కొనుగోళ్లు జరిగాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఎలక్ట్రికల్ వాహనా సంఖ్య 38,026కు చేరింది. రాష్ట్రంలో ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, ఆటోల సంఖ్య పెరుగుతోంది. ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
చార్జింగ్ స్టేషన్లు వస్తే మరింతగా పెరగనున్న వాహనాల సంఖ్య
పెట్రోల్, డీజిల్ బంక్‌లు తరహాలో విరివిగా బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఈ వాహనాల సంఖ్య మరింత పెరుగుతుందని రవాణా శాఖ అదనపు కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను లేకపోవడంతో ఇటీవలి కాలంలో వాటి వినియోగం పెరుగుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయని, దీంతో భవిష్యత్‌లో మరింతగా వీటి వినియోగం పెరుగుతుందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment