న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) చార్జింగ్ సదుపాయాల కల్పనపై దృష్టి సారించాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ మూడు కలసి రానున్న 3–5 ఏళ్లలో 22,000 ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించి.. 2070 నాటికి నెట్ జీరో (కాలుష్యం విడుదల పరంగా తటస్థ స్థితికి)కు చేరుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చమురు కంపెనీలు ఈ ప్రణాళికలతో ఉన్నాయి.
ఇందులో ఒక్క ఐవోసీనే 10,000 పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ సదుపాయాలను వచ్చే మూడేళ్లలో ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 7,000 స్టేషన్లలో ఈవీ చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్టు బీపీసీఎల్ ప్రకటించింది. హెచ్‌పీసీఎల్ 5,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనుకుంటోంది.
ముఖ్యంగా వచ్చే ఏడాది కాలంలోనే ఐవోసీ 2,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుందని.. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ చెరో 1,000 స్టేషన్లను ప్రారంభిస్తాయని పెట్రోలియం మంత్రి హర్‌దీప్‌సింగ్ పురి మంగళవారం ప్రకటించారు. ఇటీవలే జరిగిన కాప్26 సదస్సులో భాగంగా నెట్‌జీరో లక్ష్యాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment