నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాల కోసం దేశంలోనే అతిపెద్ద 100 పాయింట్ల ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) ఛార్జింగ్ స్టేషన్‌లను గురుగ్రామ్‌లో ఎన్హెచ్ఈవీ అనే సంస్థ ప్రారంభించింది. రానున్న కాలంలో వాహన వినియోగదారులను ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి ఈ స్టేషన్ సహకరిస్తుందని తెలిపారు. సెక్టార్ 52లోని ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఫాస్ట్, స్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నట్లు తెలిపారు. ఒక రోజులో 576 పెద్ద వాహనాలను ఛార్జ్ చేయవచ్చు అని ఆ సంస్థ అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టులను చేపట్టడంలో నైపుణ్యం ఉన్న నేషనల్ హైవే ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్(ఎన్హెచ్ఈవీ) అనే ప్రైవేట్ సంస్థతో కలిసి నీతి అయోగ్ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది.
ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి, యమునా ఎక్స్ ప్రెస్ వేపై ఇలాంటి మరిన్ని స్టేషన్ల ఏర్పాటు చేయడానికి ఈ ఛార్జింగ్ స్టేషన్ ఒక ప్రోటోటైప్గా పనిచేస్తుందని ఎన్హెచ్ఈవీ అధికారులు తెలిపారు. ఒక స్లో ఛార్జర్ వాహనాన్ని ఛార్జ్ చేయడానికి ఆరు గంటల వరకు పడుతుందని, ఒక రోజులో నాలుగు వాహనాలను చార్జ్ చేయగలదు అని, అటువంటి 72 ఛార్జర్లు ప్రతిరోజూ 288 వాహనాలను ఛార్జ్ చేయగలవని తెలిపారు. "వేగవంతమైన డీసీ ఛార్జర్లు రెండు గంటల కంటే తక్కువ సమయంలో వాహనాన్ని ఛార్జ్ చేయగలవు. ఈ స్టేషన్ వద్ద ప్రతిరోజూ 12 వాహనాలను చార్జ్ చేయవచ్చు. రోజు మొత్తంలో 288 వాహనాలను ఛార్జ్ చేయడానికి మాకు 24 డిసి ౫కెడబ్ల్యు ఛార్జర్లు ఉన్నాయి" అని అధికారులు తెలిపారు.
ఎన్ హెచ్ఈవీ ప్రాజెక్ట్ డైరెక్టర్ అభిజీత్ సిన్హా మాట్లాడుతూ.. రాబోయే అన్ని ఛార్జింగ్ స్టేషన్లకు ఇది ఒక నమూనాగా నిలుస్తుందని తెలిపారు. 100 ఛార్జింగ్ యూనిట్లతో దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వేహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఇదే అవుతుందని ఆయన అన్నారు. దీనికి ముందు, అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ ముంబైలో ఉంది సిన్హా పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా జైపూర్-ఢిల్లీ హైవే వెంబడి ౧౦ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, హైవేకు ఇరువైపులా నాలుగు & రెండు నగరాల్లో ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తామని సిన్హా తెలిపారు. ఢిల్లీ - జైపూర్ మధ్య భారతదేశంలోని తొలి విద్యుత్ రహదారిని నిర్మించడానికి మంత్రిత్వ శాఖ విదేశీ కంపెనీలతో చర్చిస్తుందని గత సంవత్సరం కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.
(చదవండి: ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!)
Comments
Please login to add a commentAdd a comment