చార్జింగ్‌ వసతులకు రూ.16,000 కోట్లు | Rs 16,000 crore capex required to meet public EV charging demand by 2030 | Sakshi
Sakshi News home page

చార్జింగ్‌ వసతులకు రూ.16,000 కోట్లు

Published Wed, Dec 18 2024 6:25 AM | Last Updated on Wed, Dec 18 2024 6:25 AM

Rs 16,000 crore capex required to meet public EV charging demand by 2030

చార్జింగ్‌ సేవలకు జీఎస్టీ తగ్గింపు 

టాప్‌–20 నగరాలకు ప్రాధాన్యత  

ఫిక్కీ తాజా నివేదికలో సూచనలు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ (ఈవీ) కోసం దేశంలో పెరుగుతున్న పబ్లిక్‌ చార్జింగ్‌ డిమాండ్‌ను తీర్చడానికి.. అలాగే 2030 నాటికి 30 శాతానికి పైగా ఈవీలు ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడానికి భారత్‌కు రూ.16,000 కోట్ల మూలధన వ్యయం అవసరమని ఫిక్కీ సోమవారం విడుదల చేసిన నివేదిక తెలిపింది. ‘ప్రస్తుతం ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల వినియోగం 2 శాతం లోపే ఉంది. 

దీంతో ఇవి లాభసాటిగా లేవు. ఇవి లాభాల్లోకి రావడానికి, మరింత విస్తరణ చెందేందుకు 2030 నాటికి వీటి వినియోగాన్ని 8–10 శాతానికి చేర్చే లక్ష్యంతో పనిచేయాలి. ఇంధన వినియోగంతో సంబంధం లేకుండా స్థిర ఛార్జీలతో విద్యుత్‌ టారిఫ్‌ ఉండడం, అలాగే పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లలో తక్కువ వినియోగం కారణంగా బ్రేక్‌ ఈవె న్‌ సాధించడం సవాలుగా మారింది. యూపీ, ఢిల్లీ, గుజరాత్‌ వంటి రాష్ట్రాలు సున్నా లేదా తక్కు వ స్థిర సుంకాలను కలిగి ఉన్నాయి. అయితే స్థిర సుంకాలు ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో మనుగడ సవాలుగా మారింది’ అని నివేదిక తెలిపింది.  

అనుమతి అవసరం లేని.. 
స్వచ్ఛ ఇంధనం, సుస్థిరత వైపు భారత పరివర్తనను ప్రారంభించడానికి విధాన రూపకర్తలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలతో సహా కీలక వాటాదారులు రంగంలోకి దిగాలి. పబ్లిక్‌ చార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పెంచడానికి పరిమిత ఆర్థిక సాధ్యత, డిస్కమ్‌ లేదా విద్యుత్‌ సంబంధిత సమస్యలు, భూమి సమస్యలు, కార్యాచరణ సవాళ్లు, ప్రామాణీకరణ మరియు ఇంటర్‌–ఆపరేబిలిటీ వంటి కీలక సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

 ఈవీ వ్యవస్థ అంతటా పన్నుకు అనుగుణంగా చార్జింగ్‌ సేవలకు జీఎస్టీ రేట్లను 18 నుండి 5 శాతానికి ప్రామాణీకరించాలి. అన్ని రాష్ట్రాలలో స్థిర ధరలతో రెండు–భాగాల టారిఫ్‌ నుండి సింగిల్‌–పార్ట్‌ టారిఫ్‌కు మార్చాలి. ఎలక్ట్రిక్‌ త్రీవీలర్‌ కొనుగోలు కోసం ఎటువంటి అనుమతి అవసరం లేని విధానాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి. అలాగే సీఎన్‌జీ త్రీ–వీలర్‌ నుండి ఎలక్ట్రిక్‌కు మారడానికి అదే అనుమతిని ఉపయోగించేలా వెసులుబాటు ఇవ్వాలి’ అని నివేదిక పేర్కొంది.  

టాప్‌–40 నగరాల్లో..
చార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రోడ్‌మ్యాప్‌ అమలును ప్రారంభించడానికి, పర్యవేక్షించడానికి పరిశ్రమల వాటాదారులు, రాష్ట్ర, కేంద్ర అధికారుల ప్రాతినిధ్యంతో రాష్ట్ర–స్థాయి సెల్‌ను ఏర్పాటు చేయాలి. పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లను సకాలంలో స్థాపించేందుకు రాష్ట్ర డిస్కమ్‌ల కోసం ఈవీ ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాల యొక్క సంస్థాపన, నిర్వహణకై విద్యుత్‌ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు ఉండాలి. 

2015 నుండి 2023–24 వరకు ఈవీ విక్రయాల ఆధారంగా విశ్లేషించిన 700లకుపైగా నగరాలు, పట్టణాల్లోని టాప్‌–40, అలాగే 20 హైవేల్లో చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుత ఈవీ స్వీకరణ రేటు, అనుకూల రాష్ట్ర విధానాలను బట్టి ఈ ప్రధాన 40 నగరాలు, పట్టణాలు రాబోయే 3–5 సంవత్సరాలలో అధిక ఎలక్ట్రిక్‌ వాహనాల వ్యాప్తిని కలిగి ఉంటాయని అంచనా. ఈ 20 హైవేలు 40 ప్రాధాన్యత నగరాలను కలుపుతున్నాయి. మొత్తం వాహనాల్లో ఈ నగరాల వాటా 50 శాతం’ అని నివేదిక వివరించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement