
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వాహనాల(ఈ– వెహికల్స్) వాడకాన్ని పెంచేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ దిశగా అవసరమైన ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు సిద్దంగా ఉందన్నారు. కరెంటుతో నడిచే వాహనాల వినియోగం (ఈ–మొబిలిటీ), వాటికి అవసరమైన చార్జింగ్ స్టేషన్లపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘గో–ఎలక్ట్రిక్’ ప్రచార కార్యక్రమాన్ని మంత్రి గురువారం ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిదశలో 400 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీజిల్, పెట్రోల్ వాహనాల వల్ల ఏర్పడే కాలుష్యాన్ని అడ్డుకునేందుకు విద్యుత్ వాహనాలు ప్రత్యామ్నాయమని చెప్పారు.
ఈ–వెహికల్స్ నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉంటుందని, ప్రజల సౌకర్యార్థం జాతీయ రహదారులపై ప్రతి 25 కిలోమీటర్లకు ఒకటి చొప్పున చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మాట్లాడుతూ దేశంలో 2023 నాటికి కరెంటుతో నడిచే మూడు చక్రాల వాహనాలు, 2025 నాటికి కరెంటుతో నడిచే ద్విచక్ర వాహనాలను వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని చెప్పారు. నెడ్‌క్యాప్ ఎండీ ఎస్.రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 400 చార్జర్ల ఏర్పాటు కోసం ఎన్టీపీసీ, ఆర్‌ఐ ఈఎల్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
ఫేమ్–2 స్కీం కింద రాష్ట్రవ్యాప్తంగా 73 చోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వాహనాలను, విడిభాగాలను పరీక్షించేందుకు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సంస్థ సహకారంతో రూ.250 కోట్లతో వాహనాలను పరీక్షించేందుకు టెస్టింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment