హర్దోయ్/ఉత్తరప్రదేశ్ : సామాజిక సమ్మేళనం పేరిట దేవాలయంలో మద్యం పంపిణీ జరిగింది. ఈ ఘటన హర్దోయ్‌లోని శ్రావణ దేవి ఆలయంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. బీజేపీ ఎమ్మెల్యే నితిన్ అగర్వాల్ ఆధ్వర్యంలో ‘పాసి సమ్మేళన్’ జరిగింది. మీటింగ్‌లో పాల్గొన్న వారికి లంచ్ బాక్సుల్లో పెట్టి మద్యం సీసాలను అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్న పిల్లలకు కూడా అవే బాక్సులు ఇచ్చారు. బాక్స్ తెరచి చూడగా అందులో ఆహారంతో పాటు మద్యం సీసా కూడా ఉండడంతో పిల్లలు షాక్ అయ్యారు. ఈ వార్త బయటకు తెలియడంతో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి.
కావాలనే చేశారు..
దేవాలయంలో మద్యం పంపిణీ ‘ఒక దురదృష్టకర సంఘటన’ అని హర్దోయ్ ఎంపీ అన్షుల్ వర్మ వ్యాఖ్యానించారు. విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఇటీవలే సమాజ్‌వాది పార్టీ నుంచి బీజేపీలో చేరిన నితిన్ తండ్రి నరేష్ అగర్వాల్ ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. బీజేపీపై దుష్ప్రచారంలో భాగంగానే ఈ ఘటన జరిగిందని మండిపడ్డారు. మీటింగ్‌లో పాల్గొన్న చిన్న పిల్లలకు సైతం మద్యం బాటిళ్లు చేరడం దుశ్చర్య అని అన్నారు. ఇంత భారీ స్థాయిలో మద్యం పంపిణీ జరుగుతోంటే ఎక్సైజ్ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్‌ని బీజేపీలో చేర్చుకోవడంపై పార్టీ నాయకత్వం మరోసారి ఆలోచించాలని అభిప్రాయపడ్డారు.
కాగా, కార్యక్రమానికి హాజరైన పలు గ్రామాల పెద్దలు లంచ్ బాక్స్‌లు తీసుకొని, ఆయా గ్రామాల్లోని తమ వర్గంవారికి తప్పక పంపిణీ చేయాలని ఎమ్మెల్యే నితిన్ చెప్పున్న వీడియో ఒకటి బయటపడింది. అయితే, నితిన్ తండ్రి నరేష్ అగర్వాల్‌ని దోషిని చేయడం ద్వారా బీజేపీ ఈ వివాదం నుంచి బయటపడాలని చూస్తోందని విమర్శలు వస్తున్నాయి. నితిన్, నరేష్‌లు ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment