నోటికి రుచిగా...ఒంటికి ఆరోగ్యంగా... | launch box special dishes | Sakshi
Sakshi News home page

నోటికి రుచిగా...ఒంటికి ఆరోగ్యంగా...

Published Fri, Jun 20 2014 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM

నోటికి రుచిగా...ఒంటికి ఆరోగ్యంగా...

నోటికి రుచిగా...ఒంటికి ఆరోగ్యంగా...

స్కూల్స్ రీ ఓపెన్ అయ్యాయి. ఉదయాన్నే ఇల్లంతా హడావిడి... తినడానికి ఏం పెట్టినా సరే, పిల్లలు రెండు ముద్దలు గబగబా మింగేసి... టైమ్ లేదంటూ స్కూల్‌కి పరుగులు తీసేస్తారు. తీరా, మధ్యాహ్నమయ్యేసరికి కడుపులో ఎలకల కలకలం... ఆవురావురుమంటూ లంచ్ బాక్స్ తెరుస్తారు. అందుకే, ఆకలితో ఉన్న చిన్నారులు ‘అబ్బా! ఎంత బావుందో...’ అనేలా, నోటికి రుచిగా, ఒంటికి ఆరోగ్యంగా ఉండే... ఈ చిట్టి చిట్టి వంటలు తయారుచేయండి. అర నిమిషంలో లంచ్‌బాక్స్ ఖాళీ చేయించేయండి. రోజూ లంచ్‌బాక్స్ కోసం ఎదురుచూసేలా చేయండి.
 
 సేమ్యాపులిహోర
 
 కావలసినవి:
 సేమ్యా - 200 గ్రా; పచ్చి బఠాణీ - అర కప్పు; జీడిపప్పు పలుకులు - 15; పచ్చి మిర్చి - 1; నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు - 4 టేబుల్ స్పూన్లు; పసుపు - పావు టీ స్పూను; కరివేపాకు - నాలుగు రెమ్మలు; సెనగపప్పు - టేబుల్ స్పూను; మినప్పప్పు - 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు - అర టీ స్పూను; నూనె - 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత
 
 తయారీ:
 బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక సేమ్యా వేసి, గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించాలి. (మరీ ఎక్కువసేపు వేయించకూడదు)  
 పెద్ద గిన్నెలో నీళ్లు పోసి మరిగాక, ఉప్పు, కొద్దిగా నూనె, సేమ్యా వేసి ఉడికించి, నీళ్లు మిగిలి ఉంటే ఒంపేసి, వెంటనే చన్నీళ్లలో ఒకసారి ఉంచి తీసి పూర్తిగా చల్లారనియ్యాలి   
 
పచ్చి బఠాణీలు కొద్దిసేపు నీళ్లలో నానిన తర్వాత తీసేయాలి   
 
 బాణలిలో కొద్దిగా నూనె వేసి, కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి   
 
 సెనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి   

 పచ్చి బఠాణీ, పచ్చి మిర్చి తరుగు జత చేసి నాలుగైదు నిమిషాలు వేయించాలి   
 
 కరివేపాకు, పసుపు, తగినంత ఉప్పు వేసి కలిపి దించేసి ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి  
 
 వేయించి ఉంచుకున్న పోపులో, ఉడికించి ఉంచుకున్న సేమ్యా వేసి బాగా కలపాలి   నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి మరోమారు కలపాలి  
 
 లంచ్ బాక్స్‌లో ఈ రంగురంగుల సేమ్యాను చాలా ఇష్టంగా తింటారు పిల్లలు.
 
 వెనీలా ఎగ్‌లెస్ స్పాంజ్ కేక్
 
 కావలసినవి:
 మైదా పిండి - ఒకటిన్నర కప్పులు; పంచదార - ముప్పావు కప్పు; చిలికిన పెరుగు - కప్పు; టూటీ ఫ్రూటీ - పావుకప్పు; నూనె - అర కప్పు; బేకింగ్ పౌడర్ - టేబుల్ స్పూను; బేకింగ్ సోడా - అర టీ స్పూను; ఉప్పు - చిటికెడు; వెనీలా ఎసెన్స్ - 2 టీ స్పూన్లు; టూటీ ఫ్రూటీ కోటింగ్ కోసం - 2 టీ స్పూన్ల మైదా పిండి.
 
 తయారీ:  
 కేక్ ట్రే కి ముందుగా నూనె పూయాలి   
 
 టీ స్పూను మైదా పిండి పైన చ ల్లాలి   
 
 అవెన్‌ను 200 డిగ్రీల దగ్గర సుమారు పది నిమిషాలు ప్రీ హీట్ చేయాలి   మైదాపిండిని రెండు సార్లు జల్లించి, ఉండలు లేకుండా జాగ్రత్త పడాలి  
 పంచదారను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి   
 
 ఒక పాత్రలో పెరుగు, పంచదార పొడి వేసి మరోమారు గిలక్కొట్టాలి   
 
 బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా జత చేసి బాగా కలిపి పెరుగు మిశ్రమం మెత్తగా అయ్యేలా చూడాలి   
 
 వెనీలా ఎసెన్స్, నూనె వేసి మరోమారు కలపాలి   
 
 మైదాపిండి కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి   
 
 చిన్న పాత్రలో టూటీ ఫ్రూటీ, టీ స్పూను మైదాపిండి వేసి కలిపి, పైన తయారుచేసి ఉంచుకున్న మైదాపిండి మిశ్రమానికి జత చేయాలి  
 
 ఈ మొత్తం మిశ్రమాన్ని ప్రీ హీట్ చేసి ఉంచుకున్న ట్రేలో వేసి 40 నిమిషాలు బేక్ చేయాలి (30 నిమిషాలు అవగానే ఒకసారి కేక్ ఎంతవరకు తయారైందో గమనించాలి)  
 
 బయటకు తీసి ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి  
 
 చాకుతో కట్ చేయాలి  
 
 మీ పిల్లల బాక్సులో ఈ కేక్ ఉంచండి, కొద్దిగా కూడా మిగల్చకుండా చక్కగా తినేస్తారు.
 
 ఓట్స్ ఖారాబాత్
 
 కావలసినవి:
 ఓట్లు - కప్పు; ఉల్లిపాయ - 1 (సన్నగా తురమాలి); టొమాటోలు - 2 (సన్నగా తరగాలి); క్యారట్ తురుము - అర కప్పు; క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను; అల్లం - వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూను; కారం - అర స్పూను; గరం మసాలా - పావు స్పూను; పసుపు - పావు స్పూను; కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు; నిమ్మరసం - టేబుల్ స్పూను; జీడిపప్పు పలుకులు - 10; ఉప్పు - తగినంత; నెయ్యి - టేబుల్ స్పూను; సెనగపప్పు - టేబుల్ స్పూను; మినప్పప్పు - టేబుల్ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; నూనె - 2 టీ స్పూన్లు; నెయ్యి - 2 టీ స్పూన్లు
 
 తయారీ:  
 బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక (నూనె వేయకూడదు) ఓట్లు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి  
 
 బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి  
 
 సెనగపప్పు, మినప్పప్పు జతచేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి   
 
 పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి   
 
 ఉల్లితరుగు వేసి వేయించాక, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి   
 
 క్యారట్ తురుము, టొమాటో తరుగు జత చేసి అన్నీ బాగా మెత్తగా అయ్యేవరకు కలపాలి   
 
 క్యాప్సికమ్ తరుగు, పసుపు, కారం, గరం మసాలా వేసి అన్నీ కలిసేవరకు వేయించాలి  
 
 వేరొక పాత్రలో రెండున్నర కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగాక ఉప్పు వేయాలి (ఓట్లు, నీళ్లు రెండున్నర: 3 నిష్పత్తిలో)   
 
 వేయించి ఉంచుకున్న ఓట్లు, టొమాటో మిశ్రమం వేసి ఆపకుండా కలపాలి  
 
 వేరొక బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు పలుకులు వేయించాలి   
 
 కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి కలపాలి   
 
 జీడిపప్పులు, నెయ్యి వేసి కలిపి దించి మూత పెట్టాలి   
 
 సుమారు ఐదు నిమిషాలయ్యాక లంచ్ బాక్స్‌లో పెట్టాలి   
 
 ఆలూ చిప్స్‌తో తింటే బాగుంటాయి.
 
 కొబ్బరి అటుకులు
 
 కావలసినవి:
 అటుకులు - 2 కప్పులు; కొబ్బరి తురుము - కప్పు; పచ్చిమిర్చి తరుగు - 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు పలుకులు - 2 టేబుల్ స్పూన్లు; పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు; సెనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - 2 టీ స్పూన్లు; ఆవాలు - అర టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; నిమ్మరసం - టేబుల్ స్పూను; కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత
 
 తయారీ:  
 అటుకులను శుభ్రంగా కడిగి నీళ్లు తీసేయాలి  
 
 బాణలిలో నూనె కాగాక ఆవాలు వేయించాలి  
 
 పల్లీలు రంగు మారే వరకు వేయించాలి   
 
 జీడిపప్పు పలుకులు, సెనగపప్పు, మినప్పప్పు వేసి వేగాక కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, ఎండు మిర్చి వేయించాలి   
 
 కొబ్బరి తురుము (సగం) జత చేసి మరో మారు వేయించాలి  
 
 అటుకులు, మిగిలిన కొబ్బరి తురుము, ఉప్పు వేసి బాగా కలిపి మూత ఉంచాలి   రెండు నిమిషాలయ్యాక మూత తీసి నిమ్మ రసం, కొత్తిమీర తరుగు జత చేసి దించేయాలి.
 
 చిక్కుడు గింజల మిక్స్చర్
 
 కావలసినవి:
 చిక్కుడు గింజలు - 4 కప్పులు; స్పైసీ బాల్స్ - కప్పు; పల్లీలు - అర కప్పు; ఎండు కొబ్బరి ముక్కలు - అర కప్పు; జీడిపప్పు పలుకులు - అర కప్పు; కరివేపాకు - అర కప్పు; కారం - టేబుల్ స్పూను; జీలకర్ర - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - డీప్ ఫ్రైకి తగినంత; పోపు కోసం - పావు కప్పు నూనె
 
 తయారీ:
 చిక్కుడు గింజలను సుమారు 5 గంటలు నానబెట్టి, పైన తొక్క తీయాలి   
 
 తొక్క తీసిన చిక్కుడు గింజలను పల్చటి వస్త్రంపై ఆరబోయాలి   
 
 బాణలిలో నూనె కాగాక చిక్కుడు గింజలను అందులో వేసి కరకరలాడేలా వేయించాలి
 
 మరొక బాణలిలో పావు కప్పు నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి   
 
 పల్లీలు వే సి రంగు మారేవరకు వేయించాలి   
 
 జీడిపప్పు, ఎండుకొబ్బరి ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
 కరివేపాకు వేసి వేయించి దింపేయాలి   
 
 కారం, ఉప్పు వేసి కలపాలి
 
 వేయించి ఉంచుకున్న చిక్కుడు గింజలు, స్పైసీ బాల్స్ వేసి బాగా కలపాలి   
 
 బాగా చల్లారాక, గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకుంటే చాలా రోజులు పాడవకుండా ఉంటాయి  
 
 వీటిని బాక్స్‌లో పెడితే పిల్లలు ఆత్రంగా లంచ్ టైమ్ వరకైనా ఆగకుండా తినేస్తారు.
 
 స్పైసీ బాల్స్ తయారీ... కప్పుడు నీళ్లను మరిగించి, అందులో ఒకటిన్నర కప్పుల బియ్యప్పిండి, కొద్దిగా ఉప్పు, పావు టీ స్పూను ధనియాల పొడి, పావు టీ స్పూను జీలకర్ర పొడి వేసి కలిపి చల్లారనివ్వాలి   
 
 చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి   
 
 బాణలిలో నూనె మరిగాక ఈ ఉండలను అందులో వేసి వేయిస్తే, స్సైసీ బాల్స్ సిద్ధమయినట్లే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement