ఇక లంచ్ చల్లారదు!
పొద్దున్నే లేచి, లంచ్‌బాక్సులు కట్టుకుని ఆఫీసులకు పరుగు తీస్తాం. తీరా లంచ్ టైమ్‌లో బాక్స్ తెరిస్తే చల్లారి పోయిన ఆహారం మనల్ని వెక్కిరిస్తుంది. అయినా ఆకలి కేకలను ఆపడానికి ఆరగించక తప్పదు. ఈ బాధ తప్పించడానికే వచ్చింది... ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్. చల్లారిన భోజనం తినాల్సిన పని లేకుండా ఈ బాక్సు మనకు భలే ఉపయోగపడుతుంది. ఈ బాక్సుకి వైరును కనెక్ట్ చేసుకోవడానికి ఓ పిన్ ఉంటుంది. బాక్సుతో పాటు వచ్చే వైరును దీనికి అమర్చి, ప్లగ్‌ను కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే చాలు...
ఐదు పది నిమిషాల్లో ఆహారం వేడిగా అయిపోతుంది. దాంతో ఎక్కడున్నా, ఏ సమయంలో అయినా వేడి వేడి భోజనం చేయవచ్చు. దాదాపు అన్ని ప్రముఖ కంపెనీలూ వీటిని తయారు చేసి మార్కెట్లో దింపాయి. సైజు, డిజైన్‌ని బట్టి రేటు. ఆన్‌లైన్లో ఐదారు వందలకే లభిస్తున్నాయి.