వైద్య నిపుణులూ ఇంటికొస్తారు | new startup company special story | Sakshi
Sakshi News home page

వైద్య నిపుణులూ ఇంటికొస్తారు

Published Sat, Oct 8 2016 1:43 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

వైద్య నిపుణులూ ఇంటికొస్తారు - Sakshi

వైద్య నిపుణులూ ఇంటికొస్తారు

విజయవాడ కేంద్రంగా ఫ్రిస్కా హోమ్‌హెల్త్‌కేర్ సేవలు
మూడు నెలల్లో వైజాగ్, కాకినాడ, ఏలూరు, తిరుపతికి
ఏడాదిన్నరలో తెలంగాణ వ్యాప్తంగా సేవలందిస్తాం
‘స్టార్టప్ డైరీ’తో ఫ్రిస్కా వ్యవస్థాపకుడు ఆసిఫ్ మొహమ్మద్

హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో : హోమ్ హెల్త్‌కేర్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. వైద్య పరీక్షల కోసం ఫోన్ చేస్తే ఇంటికొచ్చి శాంపిల్స్ తీసుకుంటున్నారు. నర్సులు, ఫిజీషియన్లు ఇంటికొస్తున్నారు. అయితే విజయవాడ కేంద్రంగా సేవలు ప్రారంభించిన ఫ్రిస్కా కేర్... మరో అడుగు ముందుకేసింది. ఫోన్ చేస్తే వైద్య నిపుణులనూ ఇంటికి పంపిస్తోంది. వైద్య పరీక్షల శాంపిల్స్, నర్సింగ్, ఫిజీషియన్ సేవలతో పాటు కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, డయాబెటిక్ స్పెషలిస్ట్... ఇలా వైద్య నిపుణుల సేవల్ని సైతం పేషెంట్ల ఇంటివద్దే అందించటం తమ ప్రత్యేకత అని ఫ్రిస్కా  వ్యవస్థాపకుడు, ఎన్నారై ఆసిఫ్ మొహమ్మద్ తెలియజేశారు. సంస్థ గురించిన వివరాలు ఆయన మాటల్లోనే...

పదిహేనేళ్లుగా అమెరికా, కెనడాల్లో ఉంటూ క్లౌడ్ కంప్యూ టింగ్ కంపెనీ ‘న్యూవోల్ టెక్ సొల్యూషన్స్’ను నడిపిస్తున్నా. మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి. తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం వైద్య నిపుణుల్ని సంప్రతించటం, వైద్యం సరిగా ఆందుతోందో లేదో చూసుకోవటం సమస్యగా ఉండేది. ఇదంతా చూశాక... నా లాంటి ఎన్నారైల కోసం ఇండో-అమెరికన్ వైద్యులతో కలిసి ఈ ఏడాది ఫిబ్రవరిలో అమరావతిలో ఫ్రిస్కాను ఆరంభించాం. స్థానికుల నుంచి అనూహ్యమైన స్పందన రావటంతో రెండు నెలల్లోనే సిబ్బందిని మూడు రెట్లు పెంచి... గుంటూరు, విజయవాడల్లో అందరికీ పూర్తిస్థాయి సేవలు ఆరంభించాం. 3 నెలల్లో విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, ఏలూరుల్లో సేవలు విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఏడాదిన్నరలో యావత్తు తెలంగాణ వ్యాప్తంగా, మూడేళ్లలో దేశంలోని పలు నగరాల్లో సేవలు అందిస్తాం.

నిపుణులైన వైద్యులే మా ప్రత్యేకత
హోమ్ హెల్త్‌కేర్‌లోకి చాలా కంపెనీలొస్తున్నాయి. కానీ కొందరు ఫిజియోథెరఫీపైనే దష్టి పెడుతుండగా... కొందరు నర్సింగ్ సేవలకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతి ఫ్యామిలీకి ఒక సొంత డాక్టర్‌ను అందించటమనేది మా ప్రత్యేకత. అంటే భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలున్న కుటుంబం ఏడాదికి కొంత ఫీజు చెల్లిస్తే చాలు. ఏడాదిలో నాలుగు సార్లు వారి అవసరం మేరకు డాక్టరే వాళ్లింటికి వెళతారు. నెలకోసారి నర్సింగ్ మేనేజరూ విజిట్ చేస్తారు. ల్యాబ్ పరీక్షల కోసం ఇంటికొచ్చి శాంపిల్స్ తీసుకోవటం, మందులు డెలివరీ చేయటం... ఇవన్నీ ఈ ప్యాకేజీలో భాగంగా ఉచితంగానే చేస్తాం. ఇంకో ప్రత్యేకతేంటంటే... మా సభ్యులు కాల్ చేసినపుడు వారి అవసరాన్ని బట్టి డయాబెటిక్ నిపుణులు, కార్డియాలజిస్టు, నెఫ్రాలజిస్టు వంటి స్పెషలిస్టులు కూడా వాళ్లింటికి వెళతారు. ఇప్పటిదాకా దేశంలో ఏ హోమ్ హెల్త్‌కేర్ సంస్థా దీన్ని ఆఫర్ చేయటం లేదు. పెపైచ్చు ఉన్న హోమ్ హెల్త్‌కేర్ సంస్థలన్నీ మెట్రోలు, పెద్ద నగరాల్లోనే ఉన్నాయి. ద్వితీయ శ్రేణి నగరాలకూ ఈ సేవలు అందాలన్నది మా ఉద్దేశం.

యాప్‌లోనే అన్ని సేవలూ...
వెబ్‌సైట్‌తో పాటు ఫ్రిస్కా ఆండ్రాయిడ్ యాప్ అందుబాటులో ఉంది. డౌన్‌లోడ్ చేసుకుని అన్నిసేవలూ పొందొచ్చు. పేషెంట్లయినా, వారి బంధువులైనా ఎక్కడి నుంచైనా వారి మెడికల్ రిపోర్టులను మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాదు!! ఆ రిపోర్టులు చూసి వారే నేరుగా ఇక్కడి వైద్యులతో మాట్లాడొచ్చు. త్వరలో ఐఓఎస్ యాప్‌ను కూడా తీసుకొస్తున్నాం. మా సేవలతో ఖర్చు తగ్గుతుంది. సమయం కలిసొస్తుంది. నర్సుల్ని కూడా పోలీసు వెరిఫికేషన్ వంటివన్నీ చేశాకే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎవరింటికైనా వారిని పంపితే తరవాత ఇబ్బందులు రాకుండా ఉండాలని.


అనుభవం ఉన్న వైద్యులు.. ప్యాకేజీలు
ఫ్రిస్కాలో ఇండో అమెరికన్ వైద్యులు డాక్టర్ సురేంద్ర ప్రసాద్ (డయాబెటిక్ కేర్), అమెరికన్ వైద్యుడు రత్నకాంత్ సిద్ధాబత్తుల, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ భార్గవ్, అనస్థీషియా నిపుణుడు డాక్టర్ మురళీకృష్ణ, మార్కెటింగ్ నిపుణుడు ఎం.ఆర్.రెహమాన్ సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ప్రత్యేకంగా మహిళా వైద్యులూ ఉన్నారు. నిమ్స్ కార్డియాలజిస్టు డాక్టర్ ఎంఎస్‌ఎన్ పవన్ మాకు మెడికల్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ప్యాకేజీల విషయానికొస్తే వృద్ధుల సంరక్షణ పేరిట ఎన్నారై పేరెంట్లకు, ఇతరులకు వయసుకు తగ్గ ఆరోగ్య సంరక్షణను అందిస్తున్నాం. ప్రత్యేక ల్యాబ్ టెస్టులు, నర్స్‌ల సాయం, ఆసుపత్రికి రెగ్యులర్‌గా తీసుకెళ్లటం దీన్లో భాగంగా ఉంటాయి. దీర్ఘకాలం, స్వల్పకాలం ప్రాతిపదికన నర్సింగ్ సేవలూ ఆఫర్ చేస్తున్నాం. సభ్యులకు రకరకాల ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement