సాక్షి, హైదరాబాద్: ‘‘శ్రీనివాస్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. నెలాఖర్లో వాళ్ల అమ్మాయి మొదటి పుట్టిన రోజొచ్చింది. పార్టీ ఏర్పాట్లకు చేతిలో డబ్బు లేదు. తెలిసిన వాళ్లని అప్పు అడగటానికి మనసొప్పలేదు. పోనీ, బ్యాంక్ లోన్ కోసం వెళదామా అంటే... అదో పెద్ద ప్రక్రియ. సిబిల్ స్కోరు... వగైరాలు చూసి మంజూరు చేయటానికి బోలెడంత సమయం పట్టేస్తుంది. మరేం చేయాలి?’’
‘‘వెంకటేశ్ ఓ ప్రభుత్వ ఉద్యోగి. కొంత కాలం నుంచి పొదుపు చేసిన సొమ్ము రూ.3 లక్షల వరకు చేతిలో ఉంది. బ్యాంక్‌లో వేద్దామంటే వడ్డీ రేటు తక్కువ. పోనీ, తెలిసిన వాళ్లకెవరికైనా అప్పుగా ఇద్దామంటే తిరిగి వసూలు చేయడం కొంత రిస్కే’’.. పై రెండు సందర్భాలు వేర్వేరు. ఒకరికేమో డబ్బు అవసరం, మరొకరికేమో అదే డబ్బుపై రాబడి కావాలి. వీళ్లద్దరి అవసరాలను ఒకే వేదికగా తీరుస్తోంది లెన్‌డెన్‌క్లబ్! సింపుల్‌గా చెప్పాలంటే? రుణదాతలు, గ్రహీతలను కలిపే ‘పీర్ టు పీర్’ లెండింగ్ వేదికన్న మాట. ఇన్నాళ్లూ ఉద్యోగులకే రుణాలిచ్చిన లెన్‌డెన్‌క్లబ్.. త్వరలో దుకాణదారులకూ రుణాలిచ్చేందుకు సిద్ధమైంది. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్, సీఈఓ భవీన్ పాటిల్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు.
‘‘2015లో రూ.80 లక్షల పెట్టుబడితో గుర్గావ్ కేంద్రంగా లెన్‌డెన్‌క్లబ్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం లెన్‌డెన్‌క్లబ్‌లో 40,880 మంది రుణ గ్రహీతలు, 9,982 మంది రుణదాతలు నమోదయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు మాత్రమే రుణాలిస్తున్నాం. కేవైసీ పూర్తి చేసిన 3 గంటల్లో రుణాన్నిస్తాం. రూ.40 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. వార్షిక వడ్డీ రేటు 12.5 నుంచి 35 శాతం వరకుంటుంది. రుణ వాయిదాలను 18–36 నెలల్లో తిరిగి చెల్లించేయాలి. రూ.5 లక్షల కేటగిరీలో 5 శాతం కస్టమర్లుంటారు.
తెలంగాణలో నెలకు 150 మందికి..
ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో సేవలందిస్తున్నాం. ఇప్పటివరకు 60 వేల మందికి రూ.40 కోట్ల రుణాలిచ్చాం. ప్రస్తుతం నెలకు వెయ్యి మందికి రూ.4 కోట్ల వరకు రుణాలందిస్తున్నాం. తెలంగాణ నుంచి నెలకు 150 రుణ గ్రహీతలకు రూ.70 లక్షల వరకు రుణాలిస్తున్నాం. డిసెంబర్ నాటికి నెలకు వెయ్యి మందికి రుణాలను అందించాలనేది లక్ష్యం. 6 నెలల్లో మరో 3 నగరాలకు విస్తరించనున్నాం. త్వరలో ఏపీలో సేవలను ప్రారంభిస్తాం.
రూ.2.5 కోట్ల ఆదాయం లక్ష్యం..
రుణ గ్రహీతలు చెల్లించే నెలసరి వాయిదా నేరుగా రుణదాతల బ్యాంక్ ఖాతాలో జమవుతాయి. లెన్‌డెన్‌క్లబ్ రుణదాత నుంచి 1.5%, రుణగ్రహీత నుంచి 4% నిర్వహణ రుసుము కింద వసూలు చేస్తుంది. గతేడాది రూ.55 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది రూ.2.5 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం ఎన్‌పీఏ 3.92 శాతంగా ఉంది. త్వరలోనే దుకాణదారులకు అర్హతలను బట్టి రూ.20 వేల నుంచి లక్ష రూపా యల వరకు రుణాలను అందించనున్నాం. కాల వ్యవధి 6 నెలలు. వార్షిక వడ్డీ 15 నుంచి 22% ఉంటుంది.
రూ.10 కోట్ల నిధుల సమీకరణ..
ప్రస్తుతం కంపెనీలో 45 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే హోమ్ రెనోవేషన్, ఫ్యామిలీ ఫంక్షన్స్ వంటి వాటికి రుణాలిచ్చేందుకు ప్రణాళిక చేస్తున్నాం. ఇటీవలే వెంచర్ క్యాటలిస్ట్, అనిరుధ్ దమానీ, ఇండియన్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ నుంచి రూ.5 కోట్ల నిధులను సమీకరించాం. వచ్చే 3 నెలల్లో రూ.10 కోట్ల వరకు నిధులను సమీకరించనున్నాం. పాత ఇన్వెస్టర్లతో పాటూ ఒకటిరెండు వీసీ సంస్థలతో చర్చలు జరుపుతున్నాం’’ అని భవీన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment