కాజా.. పేట.. పల్లీపట్టీ.. రసగుల్లా! | New startup salebhai | Sakshi
Sakshi News home page

కాజా.. పేట.. పల్లీపట్టీ.. రసగుల్లా!

Published Sat, May 5 2018 12:24 AM | Last Updated on Sat, May 5 2018 8:19 AM

New startup salebhai  - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో :  కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు, ఆగ్రా పేట, నాగ్‌పూర్‌ రసగుల్లా, లూనావాలా పల్లీపట్టీ... ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో ఫేమస్‌ స్వీట్స్‌! నిజం చెప్పాలంటే వీటివల్లే ఆయా ప్రాంతాలకు గుర్తింపు వచ్చింది కూడా. వీటిని టేస్ట్‌ చేయాలంటే? ఐతే ఆయా ప్రాంతాల్లో తెలిసిన వాళ్లెవరైనా ఉంటే పంపించమని చెప్పాలి లేకపోతే మనమో అటువైపు వెళ్లినప్పుడు కొనుక్కోవాలి.

ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లోనూ అంత ఖర్మెందుకనుకున్నాడు అహ్మదాబాద్‌ కుర్రాడు విశ్వ విజయ్‌ సింగ్‌. అంతే!! చేస్తున్న ఉద్యోగానికీ గుడ్‌ బై చెప్పేసి.. సేల్‌భాయ్‌ని ప్రారంభించేశాడు. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ విక్రయాలతో జోరు మీదున్న సేల్‌భాయ్‌ విశేషాలను ‘స్టార్టప్‌ డైరీ’కి వివరించారాయన.

గుజరాత్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తయ్యాక.. ఎయిర్‌టెల్, నెరోల్యాక్, ఐసీఐసీఐ వంటి సంస్థల్లో 15 ఏళ్ల పాటు పనిచేశా. 2012–13లో ఇంటర్నెట్‌ బూమ్‌తో ఈ–కామర్స్‌ హవా మొదలైంది. అప్పటివరకు మొబైల్స్, అపెరల్స్, ఎలక్ట్రానిక్స్‌ వంటి ఉత్పత్తులనే ఆన్‌లైన్‌లో అమ్మారు.

మనకంటూ ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో ఆయా ప్రాంతాల్లో పేరొందిన ఫుడ్, బేకరీ ఐటమ్స్, ఇతరత్రా ఉత్పత్తులను విక్రయించాలనుకుని ఇద్దరు స్నేహితులు పూర్భ, ప్రమోద్‌లతో కలిసి అహ్మదాబాద్‌ కేంద్రంగా 2015 సెప్టెంబర్‌లో కోటి రూపాయల పెట్టుబడితో సేల్‌భాయ్‌.కామ్‌ను ప్రారంభించాం.

400 మంది వర్తకులు; 8 వేల ఉత్పత్తులు..
ప్రస్తుతం 400 మంది వర్తకులతో ఒప్పందం చేసుకున్నాం. స్నాక్స్, బేకరీ ఐటమ్స్, స్వీట్స్‌తో పాటూ హస్త కళలు, పూజా సామగ్రి, డెకరేటివ్, హెర్బల్‌ కేటగిరీలో సుమారు 10 వేల రకాల ఉత్పత్తులుంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 20 మంది వర్తకులుంటారు.

చార్మినార్‌ గాజులు, కొండపల్లి బొమ్మలు, గద్వాల్‌ చీరలు వంటివి వీటిల్లో కొన్ని. ఉత్పత్తులను విక్రయించడమే కాకుండా.. వర్తకులు ఎవరు? ఉత్పత్తి ప్రత్యేకత ఏంటి? ఎలా తయారు చేస్తారు? ఎందుకింత ప్రత్యేకత వంటి వివరాలను ఫొటోగ్రాఫులతో పాటూ పొందుపరుస్తాం. దీంతో కస్టమర్‌ కొనుగోలు చేయకముందే ఉత్పత్తి విశేషాలను తెలుసుకునే వీలుంటుంది.

హైదరాబాద్, రాయలసీమ కీలకం..
కస్టమర్‌ ఆర్డర్‌ బుక్‌ చేయగానే సంబంధిత వర్తకుడికి మెసేజ్, ఈ–మెయిల్‌ రూపంలో సందేశం వెళుతుంది. దీన్ని ఓకే చేయగానే ఇన్వాయిస్‌ జనరేట్‌ అవుతుంది. వెంటనే ఆ సమాచారం దగ్గర్లోని లాజిస్టిక్‌ కేంద్రానికి వెళుతుంది. కొరియర్‌ బాయ్‌ వర్తకుడి షాపుకెళ్లేలోపు వర్తకుడు ఆయా ఉత్పత్తిని సేల్‌భాయ్‌ ప్యాకేజింగ్‌లో ప్యాక్‌ చేసి పెడతాడంతే! ఫెడెక్స్, బ్లూడార్ట్, డెలివర్హీ వంటి అన్ని కొరియర్‌ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం 1.6 లక్షల మంది కస్టమర్లు నమోదయ్యారు.

నెలకు 15 వేల ఆర్డర్లు బుక్‌ అవుతున్నాయి. ప్రతి ఉత్పత్తిపై వర్తకుని దగ్గర్నుంచి 22–45 శాతం వరకు కమీషన్‌ తీసుకుంటాం. మా వ్యాపారంలో రాయలసీమ, హైదరాబాద్‌ కీలకం. ఆర్డర్లు, వర్తకుల వారీగా ఇక్కడి నుంచే ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది ఇతర ప్రాంతాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏడాదిలో కనీసం 50 మంది వర్తకులతో ఒప్పందం చేసుకుంటాం. వచ్చే ఏడాది కాలంలో నెలకు 50 వేల ఆర్డర్లకు చేర్చాలని లక్ష్యించాం.

3 నెలల్లో రూ.25 కోట్ల నిధుల సమీకరణ..
గతేడాది మా ఒప్పందం వర్తకులకు రూ.5 కోట్ల గ్రాస్‌ మర్తండైజ్‌ వ్యాల్యూ (జీఎంవీ) వ్యాపారం చేసిచ్చాం. ఇందులో రూ.1.7 కోట్లు లాభం వచ్చింది. ఈ ఏడాది రూ.10 కోట్లు జీఎంవీ, రూ.4 కోట్ల లాభం లక్ష్యించాం. మా లాభంలో 10 శాతం హైదరాబాద్‌ నుంచి ఉంటుంది. ప్రస్తుతం మా కంపెనీలో 38 మంది ఉద్యోగులున్నారు.

ఇప్పటి వరకు రూ.13 కోట్ల నిధులను సమీకరించాం. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, బ్రాండ్‌ క్యాపిటల్, పలువురు హెచ్‌ఎన్‌ఐ ఇన్వెస్టర్లున్నారు. త్వరలోనే రూ.25 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పాత ఇన్వెస్టర్లతో పాటూ వీసీ ఫండ్లతో చర్చిస్తున్నాం. 3 నెలల్లో డీల్‌ను క్లోజ్‌ చేస్తాం... అని సింగ్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement