Vijay Singh
-
అవసరమైతే అమిత్ షాతో మాట్లాడుతాం
కోల్‌కతా: బంగ్లాదేశ్ జలాల్లోకి అక్రమంగా వెళ్లినందుకు గురువారం అరెస్టయిన భారతీయ మత్స్యకారుడిని నిబంధనల ప్రకారం విడుదల చేస్తామని బంగ్లాదేశ్ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇటీవల ఒక బీఎస్ఎఫ్ జవాన్‌ను ఓ బంగ్లాదేశీ సరిహద్దు భద్రతా బలగాలు తుపాకీతో కాల్చిచంపడం ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. అవసరమైతే దీనిపై తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడుతానని వెల్లడించారు. ‘బలగాల మధ్య సమన్వయలోపం కారణంగానే సరిహద్దు భద్రతాదళం(బీఎస్ఎఫ్) కానిస్టేబుల్ విజయ్ సింగ్ మరణానికి దారి తీశాయి’ అని అసదుజ్జమాన్ చెప్పారు. -
కాజా.. పేట.. పల్లీపట్టీ.. రసగుల్లా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు, ఆగ్రా పేట, నాగ్‌పూర్ రసగుల్లా, లూనావాలా పల్లీపట్టీ... ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో ఫేమస్ స్వీట్స్! నిజం చెప్పాలంటే వీటివల్లే ఆయా ప్రాంతాలకు గుర్తింపు వచ్చింది కూడా. వీటిని టేస్ట్ చేయాలంటే? ఐతే ఆయా ప్రాంతాల్లో తెలిసిన వాళ్లెవరైనా ఉంటే పంపించమని చెప్పాలి లేకపోతే మనమో అటువైపు వెళ్లినప్పుడు కొనుక్కోవాలి. ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లోనూ అంత ఖర్మెందుకనుకున్నాడు అహ్మదాబాద్ కుర్రాడు విశ్వ విజయ్ సింగ్. అంతే!! చేస్తున్న ఉద్యోగానికీ గుడ్ బై చెప్పేసి.. సేల్భాయ్ని ప్రారంభించేశాడు. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ విక్రయాలతో జోరు మీదున్న సేల్‌భాయ్ విశేషాలను ‘స్టార్టప్ డైరీ’కి వివరించారాయన. గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తయ్యాక.. ఎయిర్టెల్, నెరోల్యాక్, ఐసీఐసీఐ వంటి సంస్థల్లో 15 ఏళ్ల పాటు పనిచేశా. 2012–13లో ఇంటర్నెట్ బూమ్‌తో ఈ–కామర్స్ హవా మొదలైంది. అప్పటివరకు మొబైల్స్, అపెరల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులనే ఆన్లైన్లో అమ్మారు. మనకంటూ ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో ఆయా ప్రాంతాల్లో పేరొందిన ఫుడ్, బేకరీ ఐటమ్స్, ఇతరత్రా ఉత్పత్తులను విక్రయించాలనుకుని ఇద్దరు స్నేహితులు పూర్భ, ప్రమోద్‌లతో కలిసి అహ్మదాబాద్ కేంద్రంగా 2015 సెప్టెంబర్‌లో కోటి రూపాయల పెట్టుబడితో సేల్‌భాయ్.కామ్‌ను ప్రారంభించాం. 400 మంది వర్తకులు; 8 వేల ఉత్పత్తులు.. ప్రస్తుతం 400 మంది వర్తకులతో ఒప్పందం చేసుకున్నాం. స్నాక్స్, బేకరీ ఐటమ్స్, స్వీట్స్‌తో పాటూ హస్త కళలు, పూజా సామగ్రి, డెకరేటివ్, హెర్బల్ కేటగిరీలో సుమారు 10 వేల రకాల ఉత్పత్తులుంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 20 మంది వర్తకులుంటారు. చార్మినార్ గాజులు, కొండపల్లి బొమ్మలు, గద్వాల్ చీరలు వంటివి వీటిల్లో కొన్ని. ఉత్పత్తులను విక్రయించడమే కాకుండా.. వర్తకులు ఎవరు? ఉత్పత్తి ప్రత్యేకత ఏంటి? ఎలా తయారు చేస్తారు? ఎందుకింత ప్రత్యేకత వంటి వివరాలను ఫొటోగ్రాఫులతో పాటూ పొందుపరుస్తాం. దీంతో కస్టమర్ కొనుగోలు చేయకముందే ఉత్పత్తి విశేషాలను తెలుసుకునే వీలుంటుంది. హైదరాబాద్, రాయలసీమ కీలకం.. కస్టమర్ ఆర్డర్ బుక్ చేయగానే సంబంధిత వర్తకుడికి మెసేజ్, ఈ–మెయిల్ రూపంలో సందేశం వెళుతుంది. దీన్ని ఓకే చేయగానే ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. వెంటనే ఆ సమాచారం దగ్గర్లోని లాజిస్టిక్ కేంద్రానికి వెళుతుంది. కొరియర్ బాయ్ వర్తకుడి షాపుకెళ్లేలోపు వర్తకుడు ఆయా ఉత్పత్తిని సేల్‌భాయ్ ప్యాకేజింగ్‌లో ప్యాక్ చేసి పెడతాడంతే! ఫెడెక్స్, బ్లూడార్ట్, డెలివర్హీ వంటి అన్ని కొరియర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం 1.6 లక్షల మంది కస్టమర్లు నమోదయ్యారు. నెలకు 15 వేల ఆర్డర్లు బుక్ అవుతున్నాయి. ప్రతి ఉత్పత్తిపై వర్తకుని దగ్గర్నుంచి 22–45 శాతం వరకు కమీషన్ తీసుకుంటాం. మా వ్యాపారంలో రాయలసీమ, హైదరాబాద్ కీలకం. ఆర్డర్లు, వర్తకుల వారీగా ఇక్కడి నుంచే ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది ఇతర ప్రాంతాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏడాదిలో కనీసం 50 మంది వర్తకులతో ఒప్పందం చేసుకుంటాం. వచ్చే ఏడాది కాలంలో నెలకు 50 వేల ఆర్డర్లకు చేర్చాలని లక్ష్యించాం. 3 నెలల్లో రూ.25 కోట్ల నిధుల సమీకరణ.. గతేడాది మా ఒప్పందం వర్తకులకు రూ.5 కోట్ల గ్రాస్ మర్తండైజ్ వ్యాల్యూ (జీఎంవీ) వ్యాపారం చేసిచ్చాం. ఇందులో రూ.1.7 కోట్లు లాభం వచ్చింది. ఈ ఏడాది రూ.10 కోట్లు జీఎంవీ, రూ.4 కోట్ల లాభం లక్ష్యించాం. మా లాభంలో 10 శాతం హైదరాబాద్ నుంచి ఉంటుంది. ప్రస్తుతం మా కంపెనీలో 38 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటి వరకు రూ.13 కోట్ల నిధులను సమీకరించాం. టైమ్స్ ఆఫ్ ఇండియా, బ్రాండ్ క్యాపిటల్, పలువురు హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్లున్నారు. త్వరలోనే రూ.25 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పాత ఇన్వెస్టర్లతో పాటూ వీసీ ఫండ్లతో చర్చిస్తున్నాం. 3 నెలల్లో డీల్‌ను క్లోజ్ చేస్తాం... అని సింగ్ వివరించారు. -
'ధోనీ'కి పన్ను మినహాయింపు
రాంఛీ: టీమిండియా క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన మూవీ 'ఎమ్ఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ'. అయితే ఈ చిత్రానికి ధోనీ సొంత రాష్ట్రం ఝార్ఖండ్ ప్రభుత్వం పన్ను మినహాయింపు అవకాశం ఇచ్చింది. ధోనీ గౌరవార్థం తమ రాష్ట్రంలో ధోనీ మూవీపై ఎలాంటి వినోద పన్ను, ఇతర పన్నులు వేయాలనుకోవడం లేదని ఓ అధికారి తెలిపారు. ధోనీ రాంఛీలోనే పుట్టారని, అక్కడి నుంచే ఆయన ప్రస్థానం మొదలైందని నిర్మాత, ఫాక్స్ స్టార్ స్టూడియో సీఈవో విజయ్ సింగ్ చెప్పారు. ధోనీ నిజ జీవితంపై వస్తున్న చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. నిరజ్‌పాండే దర్శకత్వం వహించిన ఈ మూవీలో ధోనీ పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కనిపించనున్నాడు. దిశా పటాని, అనుపమ్ ఖేర్, భూమిక చావ్లా, కియారా అద్వానీ కీలక పాత్రలలో నటించారు. ఈనెల 30న 'ఎమ్ఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ' విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు తెరపై దర్శకుడు తనను ఎలా ఆవిష్కరించాడో తెలుసుకోవాలని టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ధోనీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. -
సీసీఎస్ సీఐ విజయ్‌సింగ్ సస్పెన్షన్
సాక్షి, సిటీబ్యూరో: నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో యాంటీ నార్కొటిక్ విభాగం ఇన్స్పెక్టర్ విజయ్‌సింగ్‌ను సస్పెండ్ చేస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. లైంగికదాడి కేసులో నిందితుడైన ఆదాయపన్ను శాఖ మాజీ అదనపు కమిషనర్ రవీంద్రను అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు. వివరాలు... బాధితుడు రవీంద్ర ఆదాయపన్ను శాఖలో అదనపు కమిషనర్‌గా పని చేసేవాడు. ఆ సమయంలో భారతి అనే మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో నారాయణగూడ పోలీసులు ఆరు నెలల క్రితం రవీంద్రపై చీటింగ్ కేసు నమోదు చేశారు. అలాగే ట్రావెల్స్ వ్యాపారం నిర్వహిస్తున్న భారతి నుంచి రూ.కోటి అక్రమంగా దండుకున్నాడ నే ఆరోపణలపై సీసీఎస్ పోలీసులు అతడిపై మరో చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత భారతి చెల్లెలు ఫిర్యాదు మేరకు రవీంద్రపై బంజారాహిల్స్ ఠాణాలో లైంగికదాడి కేసు నమోదైంది. ఈ కేసుల్లో అరెస్టై బెయిల్‌పై వచ్చిన రవీంద్ర బాధితురాలి ఇంటికి వెళ్లి గొడవ చేయడంతో మరో కేసు కూడా నమోదైంది. ఇలా నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్న రవీంద్ర ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో... బంజారాహిల్స్‌లో నమోదైన లైంగిదాడి కేసు నెలన్నర క్రితం సీసీఎస్‌కు బదిలీ అయిందని, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్న ఇన్స్పెక్టర్ విజయ్‌సింగ్ తనను, తన స్నేహితుడిని సీసీఎస్‌లో నిర్భందించి, చిత్రహింసలకు గురి చేశాడని బాధితుడు రవీంద్ర నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. అన్ని కేసుల్లో బెయిల్ పొందిన తనను కేసులన్నీ సెటిల్ చేసుకోవాలని బెదిరించడంతో పాటు తన ఆస్తితో పాటు స్నేహితుడి ఆస్తిని కూడా బలవంతంగా సీఐ తన పేరుపై బదిలీ చేయించుకున్నాడని రవీంద్ర ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై కమిషనర్ విచారణ చేపట్టగా...ఆరోపణలన్నీ వాస్తవమేనని తేలడంతో విజయ్సింగ్పై సస్పెన్షన్ వేటు వేశారు. -
విజయ్ సింగ్ విజృంభణ
జింఖానా, న్యూస్‌లైన్: వీనస్ సైబర్‌టెక్ బౌలర్ విజయ్ సింగ్ (5/66), వంశీ రెడ్డి (3/13) తమ బౌలింగ్‌తో ఎంసీసీ జట్టు బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించారు. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో వీనస్ సైబర్‌టెక్ జట్టు 128 పరుగుల తేడాతో ఎంసీసీ జట్టుపై ఘనవిజయం సాధించింది. తొలి రోజు బ్యాటింగ్ చేసిన వీనస్ సైబర్‌టెక్ 226 పరుగులు చే సింది. రెండో రోజు బరిలోకి దిగిన ఎంసీసీ 98 పరుగులకే కుప్పకూలింది. హెచ్‌సీఏ బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 నాకౌట్ టోర్నీలో ఆల్ సెయింట్స్ జట్టు బ్యాట్స్‌మెన్ మధుకుమార్ (76), అదిష్ (61) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో ఆ జట్టు 40 పరుగుల తే డాతో గౌతమ్ మోడల్ హైస్కూల్‌పై గెలుపొందింది. మొదట ఆల్ సెయింట్స్ 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. గౌతమ్ మోడల్ హైస్కూల్ బౌలర్ జైదేవ్ 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత బరిలోకి దిగిన గౌతమ్ మోడల్ హైస్కూల్ 170 పరుగులకే ఆలౌటైంది. వరుణ్ గౌడ్ 34, రతన్ రాజ్ 32 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. ఆల్ సెయింట్ బౌలర్ శివకుమార్ 3 వికెట్లు తీసుకున్నాడు. -
అమెరికాలో ప్రొఫెసర్ విజయ్‌సింగ్‌కు అత్యున్నత పురస్కారం
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ విజయ్ సింగ్‌ను పర్యావరణం విభాగంలో అందించే అత్యున్నత పురస్కారం వరించింది. జలధర్మ శాస్త్రం(హైడ్రాలజీ)లో చేసిన విశేష కృషికిగాను అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆయనను ‘జీవితకాల సాఫల్య పురస్కారం-2013’కు ఎంపికచేసింది. విజయ్‌సింగ్ ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలో బయోలాజికల్ , అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. హైడ్రాలజీ విభాగంలోచేసిన పరిశోధనలకు సింగ్ పలు అంతర్జాతీయ అవార్డులను పొందారు. ఈయన రూపొందించిన ‘ఎంట్రొపీ థియరీ’ హైడ్రాలజీలో సరికొత్త విభాగానికి బాటలు వేసింది.