సీసీఎస్ లో యాంటీ నార్కొటిక్ విభాగం ఇన్‌స్పెక్టర్ విజయ్‌సింగ్‌ను సస్పెండ్ చేస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు
సాక్షి, సిటీబ్యూరో: నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో యాంటీ నార్కొటిక్ విభాగం ఇన్‌స్పెక్టర్ విజయ్‌సింగ్‌ను సస్పెండ్ చేస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. లైంగికదాడి కేసులో నిందితుడైన ఆదాయపన్ను శాఖ మాజీ అదనపు కమిషనర్ రవీంద్రను అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు. వివరాలు... బాధితుడు రవీంద్ర ఆదాయపన్ను శాఖలో అదనపు కమిషనర్‌గా పని చేసేవాడు. ఆ సమయంలో భారతి అనే మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.
బాధితురాలి ఫిర్యాదుతో నారాయణగూడ పోలీసులు ఆరు నెలల క్రితం రవీంద్రపై చీటింగ్ కేసు నమోదు చేశారు. అలాగే ట్రావెల్స్ వ్యాపారం నిర్వహిస్తున్న భారతి నుంచి రూ.కోటి అక్రమంగా దండుకున్నాడ నే ఆరోపణలపై సీసీఎస్ పోలీసులు అతడిపై మరో చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత భారతి చెల్లెలు ఫిర్యాదు మేరకు రవీంద్రపై బంజారాహిల్స్ ఠాణాలో లైంగికదాడి కేసు నమోదైంది. ఈ కేసుల్లో అరెస్టై బెయిల్‌పై వచ్చిన రవీంద్ర బాధితురాలి ఇంటికి వెళ్లి గొడవ చేయడంతో మరో కేసు కూడా నమోదైంది. ఇలా నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్న రవీంద్ర ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
బాధితుడి ఫిర్యాదుతో...
బంజారాహిల్స్‌లో నమోదైన లైంగిదాడి కేసు నెలన్నర క్రితం సీసీఎస్‌కు బదిలీ అయిందని, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్న ఇన్‌స్పెక్టర్ విజయ్‌సింగ్ తనను, తన స్నేహితుడిని సీసీఎస్‌లో నిర్భందించి, చిత్రహింసలకు గురి చేశాడని బాధితుడు రవీంద్ర నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. అన్ని కేసుల్లో బెయిల్ పొందిన తనను కేసులన్నీ సెటిల్ చేసుకోవాలని బెదిరించడంతో పాటు తన ఆస్తితో పాటు స్నేహితుడి ఆస్తిని కూడా బలవంతంగా సీఐ తన పేరుపై బదిలీ చేయించుకున్నాడని రవీంద్ర ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై కమిషనర్ విచారణ చేపట్టగా...ఆరోపణలన్నీ వాస్తవమేనని తేలడంతో విజయ్‌సింగ్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.