M. Mahender reddy
-
దేశంలోనే రాష్ట్ర పోలీస్ భేష్: హోంమంత్రి
సాక్షి, హైదరాబాద్: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గోషామహల్ స్టేడియంలోని అమరవీరుల స్థూపం వద్ద గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఘననివాళులు అర్పించారు. గురువారం గోషామహల్లో నిర్వహించిన ప్లాగ్ డే కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డితోపాటు పలువురు రిటైర్డ్ డీజీపీలు, సీనియర్ పోలీసు అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, అమర పోలీసుల కుటుంబ సభ్యులు హాజరై విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ‘అమరులు వారు’పుస్తకాన్ని హోంమంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలవుతున్న పటిష్టమైన పోలీసింగ్ వల్లనే మెరుగైన శాంతి భద్రతలున్నాయని, భద్రతలో పోలీస్ శాఖ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందని, ఇతర రాష్ట్రాలతో పోల్చిచూస్తే మన రాష్ట్రంలో క్రైమ్ రేటు అతి తక్కువగా ఉందని వివరించారు. కరోనా కారణంగా విధినిర్వహణలో రాష్ట్రంలో మొత్తం 62 మంది పోలీసులు మరణించారని, వీరి కుటుంబాలకు అండగా ఉంటామని హోంమంత్రి హామీ ఇచ్చారు. పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న హోంమంత్రి మహమూద్ ప్రాణత్యాగానికి వెనుకాడం... అమరవీరుల దినోత్సవం సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరన్న విషయాన్ని అమరులైన పోలీసులు సమాజానికి గుర్తుచేస్తున్నారని పేర్కొన్నారు. సాంకేతికత ద్వారా శాంతి భద్రతలను కాపాడుతున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8.25 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. -
పదహారు ‘రకాలుగా’ పోలీసు విధులు
మెరుగైన పనితీరు కోసం విభజించిన కమిషనర్ విభాగాల వారీగా ప్రతిభను గుర్తిస్తున్న అధికారులు కోర్టు విధులు సమర్థంగా నిర్వర్తించిన వారికి రివార్డ్స్ కమిషనరేట్‌లో సమీక్షించిన నగర పోలీసు కమిషనర్ సిటీబ్యూరో: నగర పోలీసుల పనితనం మెరుగుపర్చడంతో పాటు విధి నిర్వహణ సులభతరం చేయడానికి ఠాణాల్లోని విధుల్ని 16 రకాలుగా విభజిస్తూ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సిబ్బంది అర్హత, ఆసక్తి తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయా విధు ల్ని అప్పగించడంతో పాటు వారికి అవసరమైన అదనపు శిక్షణ సైతం ఇప్పించారు. ఈ 16 రకాలైన విధుల్లో ప్రతి అంశంలోనూ ఉత్తమ పనితనం కనబరిచిన సిబ్బందికి రివార్డులు అందిస్తున్నారు. తొలివిడతగా కోర్టు విధులు సమర్థంగా నిర్వర్తించి, న్యాయస్థానాల్లో నిందితులను దోషులుగా నిరూపించడంలో కీలకపాత్ర పోషించిన సిబ్బందికి బుధవా రం కమిషనర్ మహేందర్‌రెడ్డి రివార్డులు అందించారు. నగరంలో 63 పోలీసుస్టేషన్లకు సంబంధించి సిబ్బంది పనితీరును సబ్-డివిజన్ స్థాయిలో ఏసీపీలు, జోన్ స్థాయిలో డీసీపీలు సమీక్షిస్తుండగా...కమిషనరేట్ స్థాయి లో స్వయంగా కమిషనర్ సమీక్షిస్తున్నారు. నగరంలోని 13 ఠాణాలకు సంబంధించిన 18 కీలక కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చేసిన 14 మందికి కమిషనర్ రివార్డులందించారు. బంజారాహిల్స్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన కేబీఆర్ పార్క్ కాల్పులు, కిడ్నాప్ ఘట నలో నిందితుడిగా ఉన్న ఓబులేశ్ను దోషిగా నిరూపించడంలో కీలక పాత్ర పోషించిన హెడ్-కానిస్టేబుల్ గోవింద్ నాయుడు, కానిస్టేబుల్ బాలసైదయ్య సైతం రివార్డు అందుకున్న వారిలో ఉన్నారు. విధుల విభజన ఇలా రిసెప్షన్ సిబ్బంది, స్టేషన్ రైటర్లు, క్రైమ్ రైటర్లు, బ్లూకోల్ట్స్ గస్తీ, మొబైల్ పెట్రోలింగ్, కోర్టు విధులు, వారెంట్ ఎగ్జిక్యూషన్ విధులు, సమన్ల ఎగ్జిక్యూషన్ విధు లు, సాంకేతిక విధులు, దర్యాప్తు, నేర విభాగం, మెడికల్ సర్టిఫికెట్ స్టాఫ్, సెక్షన్ ఇన్‌చార్జ్‌లు, సాధారణ విధులు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ల విధులు, ఇన్స్పెక్టర్ల విధులు రివార్డులు పొందింది వీరే.. హెడ్-కానిస్టేబుల్ గోవింద్ నాయుడు, కానిస్టేబుల్ బాల సైదయ్య (బంజారాహిల్స్), ఏఎస్సై మహ్మద్ నజీమ్ అలీ (షాహినాయత్‌గంజ్), కానిస్టేబుల్ శ్రీని వాస్ (అబిడ్స్), కానిస్టేబుల్ కిరణ్‌యాదవ్ (చిక్కడపల్లి), హెడ్-కానిస్టేబుల్ వీఆర్ సుబ్బారావు (అఫ్జల్‌గంజ్), ఏఎస్సై ఇ.జగన్నాథ్‌రెడ్డి (సైదాబాద్), కానిస్టేబుల్ రాజేష్‌కుమార్ (డబీర్‌పుర), హెడ్-కానిస్టేబుల్ రంగస్వామి (అంబర్‌పేట), కానిస్టేబుల్ రాజు (మంగళ్‌హాట్), ఏఎస్సై నరేంద్ర (కుల్సంపుర), కానిస్టేబుళ్లు ఉమామహేశ్వరరావు, సత్యనారాయణ (చిలకలగూడ), కానిస్టేబుల్ రమేష్ (సంతోష్‌నగర్), హెడ్-కానిస్టేబుల్ మోహన్‌రావు (పంజగుట్ట). -
నిఘా నేత్రాలతోనే ‘సేఫ్ సిటీ’
సైదాబాద్: నిఘా నేత్రాలతోనే సేఫ్ సిటీ సాధ్యమని, ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శనివారం అన్నారు. సైదాబాద్ డివిజన్ తిరుమల హిల్స్‌లో సేఫ్ కాలనీలో భాగంగా ఏర్పాటు చేసిన 34 సీసీ కెమెరాలు, ప్రధాన గేట్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాలనీ సంక్షేమ సంఘాల సహకారంతో, సేఫ్ కాలనీల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పటిష్ట శాంతి భద్రతలకు అక్కడి పోలీస్ వ్యవస్థే కారణమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 24 అంతస్తులతో నిర్మించనున్న భవనంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, న గరంలోని మొత్తం సీసీ కెమెరాలను పర్యవేక్షించేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థను రూపొందిస్తామని పేర్కొన్నారు. మలక్‌పేట ఎమ్మెల్యే బలాల మాట్లాడుతూ..సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. -
‘సేఫ్’గా ఉండండి
సేఫ్ కాలనీపై మార్గదర్శకాలుజారీ చేసిన పోలీసులు {ఫెండ్లీ పోలీసింగ్‌కు మరింత పదును సిటీబ్యూరో: ‘ప్రతీరోజు మీరంతా వివిధ పనులపై ఇంటి నుంచి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందా? తిరిగి ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి అవుతుందా? ఇలాంటి పరిస్థితుల్లో రాత్రిపూట మీ కుటుంబసభ్యులు ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకుంటున్నా రా...? బయట ఉన్న మీకు కుటుంబసభ్యులు సురక్షితంగా ఉన్నారో.. లేదో అనే బెంగ లేకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం దేనికి.. నగర పోలీసులు మీ కోసం రూపొందించిన మార్గదర్శకాలను చదివి ‘సేఫ్ కాలనీ’ కార్యక్రమంలో భాగస్తులు కండి’. మీ కాలనీని మీరే సురక్షితంగా మార్చుకోండి. మొదట ఇలా చేయాలి... మీ కాలనీకి చెందిన పోలీసు స్టేషన్‌కు వెళ్లండి. అక్కడి ఎస్హెచ్ఓ (ఇన్స్పెక్టర్) లేదా సెక్టార్ ఎస్ఐలు ఈ విషయంలో మీకు పూర్తిగా సహకరిస్తారు. మొదట కాలనీ సంక్షేమసంఘం సభ్యులంతా కలిసి కాలనీ మ్యాప్‌ను తయారు చేసుకోవాలి. మీ కాలనీకి రావడానికి, వెళ్లడానికి ఎన్నో దారులు ఉన్నాయో గుర్తించాలి. వాటిలో ఎన్నిదారులు పగటిపూట అవసరం, ఎన్ని దారులు రాత్రి పూట అవసరమో నిర్ధారించాలి. దారులు ఎంత తక్కువగా ఉంటే, కాలనీకి వచ్చి పోయేవారిపై నిఘా అంత సులభం. రాత్రిపూట కాలనీకి ఒకే ఎంట్రీ, ఒకే ఎగ్జిట్ ఏర్పాటు చేసుకుంటే అవాంఛనీయ వ్యక్తులు, వాహనాల రాకపోకలను నియంత్రించడం చాలా సులువవుతుంది. ఒకరు లేదా ఇద్దరు ప్రైవేటు సెక్యూరిటీగార్డులను లేదా వాచ్‌మన్‌ను నియమించుకుంటే రాత్రి పూట ఎంట్రీ, ఎగ్జిట్ దగ్గర కాపలాగా ఉంటారు.కాలనీకి వివిధ పనుల నిమిత్తం.. అంటే నౌకర్లు, డ్రైవర్లు, పాలవారు, పేపర్‌బాయ్‌లు, కేబుల్, టీవీ వర్కర్లు వంటి వాళ్లకు గుర్తింపుకార్డులు ఇవ్వడం ద్వారా వారిపై నియంత్రణ సాధ్యమవుతుంది. వ్యక్తులు, వాహనాల వివరాలన్నీ పూర్తిగా నమోదు చేయడం వల్ల నేరాలను నివారించవచ్చు.కాలనీవాసులంతా కలిసి పరిమితి సంఖ్యలో సీసీటీవీలు ఏర్పాటు చేసుకుంటే పూర్తిస్థాయి భద్రత సాధ్యపడుతుంది. పోలీసు సహకారం ఇలా... మీ కాలనీ మ్యాప్‌లు రూపొందించడం, ఎంట్రీ, ఎగ్జిట్ల నిర్వహణలో స్టేషన్ ఎస్హెచ్ఓ, సెక్టార్ ఎస్ఐలు సహాయపడతారు.రాత్రిపూట కాలనీ గేట్లను మూసేయడానికి కావాల్సిన స్టాపర్లను, సూచికల బోర్డులను అందిస్తారు.మీరు నియమించుకున్న సెక్యూరిటీగార్డులు సమర్థంగా విధులు నిర్వర్తిన్నదీ లేనిదీ తనిఖీ చేస్తారు.సీసీటీవీలను పోలీసు స్టేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించడం వల్ల 24/7 భద్రత సాధ్యపడుతుంది. ప్రయోజనాలు.... ఎప్పటికప్పుడు నేర నియంత్రణ చర్యల గురించి సమాచారం అందిస్తారు. వేరే ప్రాంతాల్లో జరిగే నేరాలను ముందే తెలియజేయడం ద్వారా మిమ్నల్ని అప్రమత్తం చేస్తారు. మీ కాలనీలో నేరాలు జరిగినా క్షణాల్లో మిస్టరీ విప్పుతారు. అన్ని వర్గాలు కలిసి రావాలి.. సేఫ్ కాలనీ కార్యక్రమంలో అన్ని వర్గాల వారు కలిసి రావాలని పిలుపు ఇచ్చాం. ఇందుకోసం రూపొందించిన మార్గదర్శకాలను ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు పది లక్షల కరపత్రాలను ముద్రించాం. వీటిని ఇంటింటికీ స్థానిక పోలీసుల ద్వారా పంపిస్తున్నాం. ప్రజలను సేఫ్ కాలనీపై అవగాహన కల్పిస్తున్నాం. వారితో నిరంతర సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇలా చేయడం ద్వారా మత ఘర్షణలు, అల్లర్లు, దొంగతనాలు, స్నాచింగ్‌లు వంటివి తగ్గుతాయి. ప్రజలకు సుఖఃశాంతులతో జీవించే సదుపాయం కలుగుతుంది. అసాంఘిక శక్తులకు నిలువ నీడ దొరకదు. -ఎం.మహేందర్‌రెడ్డి -
సీసీఎస్ సీఐ విజయ్‌సింగ్ సస్పెన్షన్
సాక్షి, సిటీబ్యూరో: నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో యాంటీ నార్కొటిక్ విభాగం ఇన్స్పెక్టర్ విజయ్‌సింగ్‌ను సస్పెండ్ చేస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. లైంగికదాడి కేసులో నిందితుడైన ఆదాయపన్ను శాఖ మాజీ అదనపు కమిషనర్ రవీంద్రను అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు. వివరాలు... బాధితుడు రవీంద్ర ఆదాయపన్ను శాఖలో అదనపు కమిషనర్‌గా పని చేసేవాడు. ఆ సమయంలో భారతి అనే మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో నారాయణగూడ పోలీసులు ఆరు నెలల క్రితం రవీంద్రపై చీటింగ్ కేసు నమోదు చేశారు. అలాగే ట్రావెల్స్ వ్యాపారం నిర్వహిస్తున్న భారతి నుంచి రూ.కోటి అక్రమంగా దండుకున్నాడ నే ఆరోపణలపై సీసీఎస్ పోలీసులు అతడిపై మరో చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత భారతి చెల్లెలు ఫిర్యాదు మేరకు రవీంద్రపై బంజారాహిల్స్ ఠాణాలో లైంగికదాడి కేసు నమోదైంది. ఈ కేసుల్లో అరెస్టై బెయిల్‌పై వచ్చిన రవీంద్ర బాధితురాలి ఇంటికి వెళ్లి గొడవ చేయడంతో మరో కేసు కూడా నమోదైంది. ఇలా నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్న రవీంద్ర ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో... బంజారాహిల్స్‌లో నమోదైన లైంగిదాడి కేసు నెలన్నర క్రితం సీసీఎస్‌కు బదిలీ అయిందని, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్న ఇన్స్పెక్టర్ విజయ్‌సింగ్ తనను, తన స్నేహితుడిని సీసీఎస్‌లో నిర్భందించి, చిత్రహింసలకు గురి చేశాడని బాధితుడు రవీంద్ర నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. అన్ని కేసుల్లో బెయిల్ పొందిన తనను కేసులన్నీ సెటిల్ చేసుకోవాలని బెదిరించడంతో పాటు తన ఆస్తితో పాటు స్నేహితుడి ఆస్తిని కూడా బలవంతంగా సీఐ తన పేరుపై బదిలీ చేయించుకున్నాడని రవీంద్ర ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై కమిషనర్ విచారణ చేపట్టగా...ఆరోపణలన్నీ వాస్తవమేనని తేలడంతో విజయ్సింగ్పై సస్పెన్షన్ వేటు వేశారు. -
టెలిఫోన్ దుర్వినియోగం వాస్తవమే
గవర్నర్ ప్రెస్ సెక్రటరీ వివరణ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని గవర్నర్ అధికారిక కార్యాలయం టెలిఫోన్ దుర్వినియోగంపై రాజ్‌భవన్ వర్గాలు స్పందించాయి. ‘రాజ్‌భవన్ టెలిఫోన్ దుర్వినియోగం’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై గవర్నర్ ప్రెస్ సెక్రటరీ వివరణ ఇచ్చారు. ఈ విషయం వాస్తవమే అని పరోక్షంగా అంగీకరించిన ఆయన దీన్ని ఒక రోజులోనే బీఎస్ఎన్ఎల్ అధికారులు గుర్తించారని పేర్కొన్నారు. దీని వల్ల రూ. 38,233 అదనపు బిల్లు వచ్చినట్లు నిర్ధారించామని వివరించారు. ఈ నష్టాన్ని సంబంధిత వ్యక్తుల నుంచి రికవరీ చేస్తామని తెలిపారు. ఈ వ్యవహారంపై రాజ్‌భవన్ వర్గాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాయని, త్వరలోనే అధికారులు నివేదిక సమర్పిస్తారని వివరించారు. అదనపు ఈపీఏబీఎక్స్ వ్యవస్థ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న దానితో అనుసంధానం పనులను గేట్‌వే బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ చేపడుతోందని పేర్కొన్నారు. ఈ వ్యవస్థల్ని ఇంకా రాజ్‌భవన్ వర్గాలకు స్వాధీనం చేయలేదని, దుర్వినియోగాన్ని గుర్తించిన వెంటనే అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రెస్ సెక్రటరీ తెలిపారు. -
రాజ్‌భవన్ టెలిఫోన్ దుర్వినియోగం
-
రాజ్‌భవన్ టెలిఫోన్ దుర్వినియోగం
* సీ సిప్ పరిజ్ఞానంతో చొరబడిన దుండగులు * ఈ లైన్‌ను వినియోగించి విదేశాలకు ఫోన్ కాల్స్ * అధికంగా ఒమన్, శ్రీలంకలకు వెళ్లినట్లు గుర్తింపు * లోతుగా ఆరా తీస్తున్న పోలీసులు * ఉగ్రవాదం, అక్రమ రవాణా కోణాల్లో దర్యాప్తు శ్రీరంగం కామేష్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అధికారిక కార్యాలయం రాజ్‌భవన్ ఫోన్‌లైన్ దుర్వినియోగమైంది. అత్యంత కీలకంగా భావించే ఈ నెట్‌వర్క్‌లోకి అక్రమంగా చొరబడిన దుండగులు భారీగా విదేశాలకు ఫోన్లు చేశారు. వీటిలో అత్యధికం ఒమన్, శ్రీలంక దేశాలకు చెందినవి కావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. హైదరాబాద్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డిని ఇటీవల స్వయంగా కలిసిన నరసింహన్ ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. కీలకాంశం కావడంతో దీనిపై కేసు నమోదు చేసుకున్న తెలంగాణ సీఐడీ అధికారులు ఉగ్రవాదం, అక్రమ రవాణా కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తోపాటు ఆయన కార్యాలయానికి సంబంధించిన ఉన్నతాధికారులూ పని చేస్తుంటారు. వీరంతా ఫోన్లు చేసుకోవడానికి వీటిలో ప్రధాన కనెక్షన్లను విస్తరిస్తూ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ ఆటోమేటిక్ బ్రాంచ్ ఎక్స్ఛేంజ్ (ఈపీబీఎక్స్) బాక్సుల్ని ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర విభజన అనంతరం గవర్నర్ కార్యాలయంలో సలహాదారులు సహా ఇతర అధికారుల సంఖ్య పెరిగింది. దీంతో రాజ్‌భవన్‌తోపాటు దానికి సమీపంలోనే ఉన్న మరో భవనంలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో గవర్నర్ సలహాదారులతోపాటు కొందరు కీలక అధికారులూ నివసిస్తున్నారు. ఈ కార్యాలయం ఏర్పాటు కావడానికి ముందు రాజ్‌భవన్‌కు ఒకే ఈపీబీఎక్స్ బాక్సు ఉండేది. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌కు కొత్తగా కనెక్షన్లు ఇవ్వడం కోసం అందులో మరో బాక్సు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీన్ని ఏర్పాటు చేసిన రాజ్‌భవన్ సాంకేతిక సిబ్బంది ప్రధాన ఈపీబీఎక్స్ బాక్సు నుంచి దీనికి కనెక్షన్ ఇచ్చేందుకు గవర్నర్ కార్యాలయంలో తవ్వకాలు జరిపి వైరు వాడేందుకు సుముఖత చూపకుండా వైఫై పరిజ్ఞానంతో అనుసంధానించారు. ప్రధాన బాక్సుకు బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ ఉండగా అదనంగా ఏర్పాటు చేసిన దానికి బీమ్టెల్ కనెక్షన్ ఆధారంగా వైఫైతో అనుసంధానించారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో ఉండే అధికారులు తమ సెల్‌ఫోన్‌తోనూ ఈ లాండ్‌లైన్ ఆధారంగా కాల్స్ చేయడం కోసం ఇటీవల అందుబాటులోకి వచ్చిన సీ-సిప్ అనే యాప్‌ను వినియోగించారు. దీన్ని తమ సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునే అధికారులు యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తోపాటు ఈపీబీఎక్స్ ఐపీ అడ్రస్‌ను పొందుపరచడం ద్వారా సెల్‌ఫోన్‌తో కాల్ చేసినా ఆ బిల్లు మాత్రం కార్యాలయానికి సంబంధించిన ల్యాండ్‌లైన్‌కు వచ్చేలా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాక వినియోగదారులు డిఫాల్ట్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను మార్చి గోప్యంగా ఉండేలా వేరేవి ఫీడ్ చేసుకుంటారు. గవర్నర్ కార్యాలయం అధికారులు ఆ పని చేయకపోవడంతో డిఫాల్ట్ యూజర్ ఐడీ, పాస్వర్డ్స్ కొనసాగాయి. దీన్ని గుర్తించి తమకు అనుకూలంగా మార్చుకున్న దుండగులు రాజ్‌భవన్ ఈపీబీఎక్స్ బాక్స్ ఐపీ అడ్రస్‌ను సైతం సంగ్రహించారు. వీటి ఆధారంగా రూటింగ్ చేసి భారీగా విదేశాలకు కాల్స్ చేసుకోవడానికి దేశవ్యాప్తంగా అనేక మందికి అనుసంధానించారు. రూటింగ్ ద్వారా కాల్ చేసినప్పుడు దీన్ని కనెక్ట్ చేసిన కాల్ అందుకున్న వ్యక్తులకు.... చేసిన వారి నంబర్ కాకుండా వేరే నంబర్ వచ్చేలా చేస్తారు. దీన్ని వినియోగించుకున్న వ్యక్తుల నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేస్తారు. బిల్లు మాత్రం రూటింగ్‌కు వాడిన ఫోన్ (రాజ్‌భవన్) యజమానికి వస్తుంది. గవర్నర్ కార్యాలయం టెలిఫోన్ బిల్లు గత నెల్లో రూ.5 లక్షల వరకు రావడంతో బీఎస్ఎన్ఎల్ అధికారులు విషయాన్ని గవర్నర్ ద ృష్టికి తెచ్చారు. దీనిపై అంతర్గత విచారణ జరపగా ఈ విషయం వెలుగు చూసింది. ఆ కాల్స్ నేపథ్యంలో అప్రమత్తం... సాధారణంగా ఇలాంటి కాల్స్‌ను దుండగులు అసాంఘిక కార్యకలాపాల కోసం వినియోగిస్తుంటారు. విదేశాల నుంచి రూటింగ్ ద్వారా కాల్స్‌ను అందుకున్న భారత్‌కు చెందిన వారిలో అనేక మంది బంగారం వ్యాపారులు ఉన్నట్లు తేలింది. దీంతో బంగా రం అక్రమ రవాణా వ్యవహారాల కోసం ఈ కాల్స్‌ను వాడి ఉంటారని అనుమానిస్తున్నారు. మరోపక్క గవర్నర్ కార్యాల యం నంబర్ వినియోగించి రూటింగ్ ద్వారా మాట్లాడిన అంతర్జాతీయ కాల్స్‌లో శ్రీలంక, ఒమన్‌ల నుంచి కాల్స్ ఉండటంతో కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీలంకలో ఉన్న లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటీఈ) ఉగ్రవాదులకు ఒమన్ సహా మరికొన్ని దేశాలతో సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కార్యాలయం ఫోన్‌కు ట్యాపింగ్, నిఘా ఉండదనే కారణంగా దీన్ని వారు వినియోగించారా? అనే కోణంలోనూ దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. దుండగులు వినియోగించిన సీ-సిప్ యాప్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ డిఫాల్ట్ అయినప్పటికీ రాజ్‌భవన్‌కు చెందిన ఈపీబీఎక్స్ బాక్సు ఐపీ అడ్రస్ వారికి ఎలా చేరిందనేది కీలకంగా మారింది. ఈ కేసుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన తెలంగాణ పోలీసులు అనేక విభాగాల సహకారంతో దర్యాప్తు చేస్తున్నారు. -
‘కేసు’ తేలాల్సిందే..
దర్యాప్తు పక్కదారి పట్టకుండా చర్యలు శిక్షల శాతం పెంచడమే లక్ష్యం కోర్టు మానిటరింగ్ సిస్టం(సీఎంఎస్) ఏర్పాటు వీటి కోసం ప్రత్యేక సబ్ కంట్రోల్స్ సిటీబ్యూరో: తెలంగాణలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్‌లు చేపట్టిన విప్లవాత్మకమైన మార్పులు మంచి ఫలితాలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కేసుల్లో నిందితులకు శిక్షల శాతాన్ని పెంచే దిశగా వారు కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఫిర్యాదు దారులకు ఊరట కల్పించి, సత్వర న్యాయం, నిష్పక్షపాత దర్యాప్తు అందించేందుకు మరో అడుగు ముందుకేసిన జంట పోలీసు కమిషనర్లు త్వరలో ‘కోర్టు మానిటరింగ్ సిస్టం’ (సీఎంఎస్)ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం నగరంలో రెండ్ సీఎంఎస్ సబ్ కంట్రోల్స్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులతో తర్జనబర్జన చేశారు. నగర నేర పరిశోధక విభాగం (సీసీఎస్)లో ఒక సబ్ కంట్రోల్, నార్త్‌జోన్ కేంద్రంగా అక్కడి డీసీపీ కార్యాలయంలో మరో సబ్కంట్రోల్ను ఏర్పాటు చేయాలని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్‌లో కూడా ఎల్బీనగర్, మియాపూర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, కూకట్పల్లి కోర్టు సమీపంలో సబ్ కంట్రోల్‌లు ఏర్పాటు చేసేందుకు కమిషన్ సీవీ ఆనంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఇలా.. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న స్టేషన్ ఎస్ఐ లేక ఇన్స్పెక్టర్ దర్యాప్తు అధికారిగా ఉంటారు. నిందితుడిని అరెస్టు చేసి, సాక్ష్యాలను సేకరించి వారి వాగ్మూలం రికార్డు చేస్తారు. అనంతరం చార్జీషీట్ కోర్టుకు సమర్పించడం వరకు బాధ్యతంతా స్టేషన్ అధికారులదే. అయితే వీరిలో కొందరు ఇన్వెస్టిగేషన్ అధికారులు నిందితులతో కుమ్మక్కై ఇష్టం వచ్చినట్లు వారికి బెయిల్ మంజూరయ్యే విధంగా మసులుకోవడం, చార్జీషీట్లను సులభతరం చేసి శిక్ష పడకుండా కాపాడటం, దర్యాప్తు కావాలనే ఆలస్యం చేయడం, తప్పుడు సాక్ష్యాలను సమర్పించడం, దీంతో కోర్టులో కేసు వీగిపోవడం జరిగేవి. కొన్ని సందర్భాలలో ఏళ్లు గడిచినా చార్జీషీట్లు దాఖలు చేసేవారు కాదు. ఇటువంటి పెండింగ్ కేసుల దుమ్ము దులిపేందుకు ఐదు నెలలుగా జంట పోలీసు కమిషనరేట్లలో ‘యూఐ మేళా’ పేరుతో క్లియర్ చేశారు. గత ఏడాది సుమారు 10 వేల కేసులు కొలిక్కి తెచ్చి బాధితులకు న్యాయం చేయగలిగారు. అయితే మున్ముందు ఇలా కాకుండా కేసు ఎఫ్ఐఆర్ జరిగిన మరు క్షణం నుంచి నిందితులకు శిక్ష పడే వరకు జరిగే ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని జిల్లాల్లో కోర్టు మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని ఇటీవలే డీజీపీ అనురాగ్‌శర్మ ఆదేశాలు జారీ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జంట కమిషనరేట్లలో ఈ నెల చివరి నాటికి సీఎంఎస్‌ను ప్రవేశపట్టేందుకు పనులు వేగవంతం అయ్యాయి. సీఎంఎస్‌తో ఇలా.. బాధితుడు దరఖాస్తు చేయగానే సంబంధింత స్టేషన్ అధికారి ఎఫ్ఐఆర్ చేస్తారు. ఈ కాపీ సంబంధింత సీఎంఎస్ సబ్‌కంట్రోల్ అధికారులకు చేరుతుంది. స్టేషన్ అధికారి అరెస్టుల్లో ఆలస్యం చేస్తే సీఎంఎస్ అధికారులకు ప్రశ్నించే అధికారం ఉంది. అలాగే ఎఫ్ఐఆర్లో పేర్కొన్న మాదిరిగా సాక్షుల వాంగ్మూలం కూడా సరైన పద్దతుల్లో తీసుకోవాల్సి వస్తుంది. చార్జీషీటు కూడా శిక్ష పడే విధంగా తయారు చేయడంలో సీఎంఎస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఠాణా అధికారులు కేవలం ఎఫ్ఐఆర్ చేయడం, నిందితులను అరెస్టు చేయడం వరకే వారి విధి. ఆ తరువాత ఆ కేసు కోర్టులో వేగవంతం చేయడం, నిందితులకు శిక్షలు పడేలా వ్యవహరించడం సీఎంఎస్ విధి. కోర్టు నుంచి జారీ అయ్యే యన్బీడబ్ల్యూ అరెస్టు వారెంట్లు కూడా సీఎంఎస్ ద్వారానే సాక్షులు, నిందితులు, బాధితులకు అందిస్తారు. డీఐజీ పర్యవేక్షణలో... డీఐజీ పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ సిస్టం పనిచేస్తుంది. ఒక్కో సబ్కంట్రోల్కు ఇన్స్పెక్టర్, ఎస్ఐతో పాటు 10 మంది సాఫ్ట్వేర్ నిపుణులు, ప్రతి స్టేషన్ నుంచి ఏఎస్ఐ, కానిస్టేబుల్ ఉంటారు. నగరంలో 63, సైబరాబాద్‌లో 43 శాంతి భద్రతల పోలీసు స్టేషన్లతో పాటు సైబర్ క్రైమ్, సీసీఎస్‌లకు చెందిన కేసులు అన్ని కూడా సీఎంఎస్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతాయి. వెబ్సైట్లో వివరాలు.. ఒక కేసుకు సంబంధించి వాయిదాకు ఎవరు వచ్చారు, ఆ రోజు కోర్టులో ప్రక్రియ ఎలా సాగింది, తదుపరి కేసు విచారణ ఏ తేదీకి వాయిదా పడింది తదితర వివరాలు పోలీసు వెబ్సైట్ ద్వారా అందరు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో బాధితులు, నిందితులు సులభంగా వివరాలు తెలుసుకోవచ్చు. అంతా పారదర్శకం.. కోర్టు మానిటరింగ్ సిస్టం ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందుతుంది. నిందితుల శిక్షల శాతం కూడా పెరుగుతుంది. ఎఫ్ఐఆర్ నుంచి శిక్ష పడే వరకే జరిగే ప్రక్రియ అంతా నిస్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతుంది. నిందితులతో పోలీసులు కుమ్మక్కయే ప్రసక్తే ఉండదు. దీంతో బాధితులకు పోలీసులపై నమ్మకం పెరుగుతుంది. - జంట కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ -
ఓబులేసు అరెస్టు
జాకెట్లో పెట్టుకుని ఏకే-47 చోరీ ఓర్వకల్లు గుట్టల్లో ఆయుధం దాచివేత మీడియా సమావేశంలో సీపీ మహేందర్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీ ఆర్) పార్కు వద్ద అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కిడ్నాప్‌కు యత్నించి, కాల్పులకు పాల్పడిన కానిస్టేబుల్ ఓబులేసు(37)ను పోలీ సులు అరెస్టు చేశారు. ఓబులేసు నేరాలబాట.. ఏకే-47 చోరీ.. అరెస్టుపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శుక్రవారం తన కార్యాలయంలో మీడియాకు వివరించారు. ఏకే 47- దొంగిలించాడిలా... ఓబులేసు గ్రేహౌండ్స్‌లో ఉన్నప్పుడు అక్కడి ఏకే-47ను దొంగిలించేందుకు జాకెట్‌ను ఉపయోగించాడు. గత ఏడాది డిసెంబర్లో కూంబింగ్‌కు వెళ్లి వచ్చిన సిబ్బంది ఏకే-47 ఆయుధాలను బెల్ఫామ్ గదిలో భద్రపర్చారు. ఇలా కూంబిం గ్‌కు వెళ్లివచ్చిన వారికి మూడు రోజులు సెలవు ఇస్తారు. కానీ, సెలవులో ఉన్నా కూడా ఓబులేసు ఈ గదిలోకి వెళ్లి లోడెడ్ ఏకే-47ను తీసుకొని సంచిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సులో కర్నూల్ జిల్లా ఓర్వకల్లుకు చేరుకున్నాడు. అక్కడి రాళ్ల గుట్టల్లో సంచితో పాటు ఆయుధాన్ని దాచిపెట్టాడు. తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అయితే తాను పెట్టిన చోట ఆయుధం ఉందా లేదా అని చూసుకునేందుకు ఓబులేసు ప్రతి వారం ఓర్వకల్లుకు వెళ్లి వచ్చేవాడు. మొదటి కిడ్నాప్ సక్సెస్.. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో మొదటిసారిగా కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మనవడు కేబీఆర్ పార్కుకు వాకింగ్ వచ్చినప్పుడు ఏకే-47తో బెదిరించి కిడ్నాప్ చేసి కొత్తూరు శివార్లలోకి తీసుకెళ్లాడు. రూ.10 లక్షలు తీసుకుని వదిలిపెట్టాడు. ఇందులోంచి రూ.3 లక్షలను తన బ్యాంకు అకౌంట్లో మరుసటి రోజు జమచేశాడు. మిగిలిన ఏడు లక్షలతో వాహనం ఖరీదు చేసి జల్సా చేశాడు. ముందు రోజు రాత్రి కేబీఆర్ పార్కులోనే... కేబీఆర్ పార్కు వద్ద మొదటి కిడ్నాప్ విజయవంతమవడంతో మరోసారి అదేవిధంగా వీఐపీని కిడ్నాప్ చేసేందుకు ఓబులేసు పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న ఓర్వకల్లుకు వెళ్లి ఏకే-47 తీసుకొచ్చి నార్సింగిలోని తన గదిలో దాచిపెట్టాడు. 18వ తేదీ రాత్రి 10.30 గంటలకు ఆయుధాన్ని దాచిన సంచితో ఆర్టీసీ బస్సులో ఎస్ఆర్నగర్ వరకు వచ్చాడు. అక్కడి నుంచి ఆటోలో కృష్ణానగర్‌లో దిగిపోయాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ కేబీఆర్ పార్కుకు చేరుకుని అక్కడే ఓ చెట్టు పొదల్లో దాక్కున్నాడు. మరుసటి రోజు ఉదయం అందరిలాగే వాకింగ్ చేస్తున్నట్లు నటించి ఖరీదైన కారు గురించి చూ స్తుండగా అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కారు వచ్చి ఆగింది. అతడిని లక్ష్యంగా చేసుకొన్న ఓబులేసు.. 7.20 గంటలకు నిత్యానందరెడ్డి కారులోకి ఎక్కిన సమయంలో కిడ్నాప్‌కు యత్నించాడు. అయితే ఆయన ధైర్యంగా ప్రతిఘటించడం, అతని సోదరుడు ప్రసాద్‌రెడ్డి కూడా సహకరించడంతో ఓబులేసు వారి చేతు లు కొరికి కేబీఆర్ పార్కు నుంచి పారిపోయాడు. సీసీ కెమెరాలే పట్టించాయి... ఈ ఘటన తర్వాత ఓబులేసు అశోకాబిల్డర్, ఇందిరానగర్ నుంచి కృష్ణానగర్ వరకు నడుచుకుంటూ వెళ్లాడు. అక్కడ ఆటో ఎక్కి అమీర్‌పేటలో దిగి ఆర్టీసీ బస్సు ఎక్కి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో మరో బస్సు ఎక్కి కర్నూలు చేరుకున్నాడు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా ఓబులేసును పోలీసులు కేవలం ఆరు గంటల్లోనే గుర్తించారు. వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు, టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఎట్టకేలకు ఓబులేసును కర్నూలులో అరెస్టు చేశాయి. ఈ కేసును చేదించడంలో ప్రతిభ కనబర్చిన వెస్ట్‌జోన్ పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని ఈ సందర్భంగా కమిషనర్ అభినందించారు. వారికి రివార్డులు ప్రకటించారు. 19 బుల్లెట్లు ఎక్కడ? ఓబులేసు గ్రేహౌండ్స్ నుంచి ఏకే-47తో పాటు మ్యాగజైన్‌ను తస్కరించాడు. ఆ సమయంలో మ్యాగజైన్లో 36 బుల్లెట్లు ఉన్నాయి. అయితే కేబీఆర్ పార్కు కాల్పుల ఘటనలో పది రౌండ్లు ఉపయోగించగా, మరో ఏడు పేలని బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 17 బుల్లెట్లు గుర్తించారు. మిగతా 19 బుల్లెట్లు ఎక్కడ అనే విషయంపై ఆరా తీస్తున్నారు. మరేదైనా నేరం చేసిన సమయంలో కాల్పులకు ఉపయోగించాడా లేక ఎక్కడైనా దాచిపెట్టాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఓబులేసును తిరిగి పోలీసు కస్టడీ కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అతడి వెనకాల మరెవరైనా ఉన్నారా అనే విషయంపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. -
పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు ఎస్సెమ్మెస్ అలర్ట్
21 రోజుల్లో విచారణ పూర్తి : కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి హైదరాబాద్ : ఇకపై పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎప్పటికప్పుడు దాని వివరాలు ఎస్ఎమ్ఎస్ల రూపంలో అందనున్నాయి. పాస్‌పోర్టు ఏ స్థాయిలో ఉంది, ఎక్కడ ఆగింది, ఇంకా ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తుంది ఇలాంటి ప్రశ్నలకు చెక్‌పెట్టేందుకు ‘ఎస్ఎమ్ఎస్ అలర్ట్’ అనే పద్దతికి నగర పోలీసులు శ్రీకారం చుట్టారు. ఈ విధానాన్ని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో మాట్లాడుతూ పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ పద్ధతికి శ్రీకారం చుట్టినట్లు కమిషనర్ వెల్లడించారు. దరఖాస్తుదారులకు పాస్‌పోర్టు చేతికందిన తరువాత ఉన్నతాధికారులు స్వయంగా ఫోన్‌చేసి తమ సిబ్బంది పనితీరుపై ఆరా తీస్తారన్నారు. తద్వారా పాస్‌పోర్టు విచారణ పారదర్శకంగా జరుగుతుందన్నారు. పాస్‌పోర్టు విచారణను 21 రోజు ల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎస్ఎమ్ఎస్ అలర్ట్ ఇలా.... ►పాస్‌పోర్ట్ పొందాలకున్న వ్యక్తి ముందుగా పాస్‌పోర్టు సేవా కేంద్రం(పీఎస్కే)లో తమ దరఖాస్తులను అందజేస్తారు. ► నగర స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) ప్రధాన కార్యాలయానికి చేరిన దరఖాస్తులను విచారణ నిమిత్తం స్టేషన్ల వారిగా పంపిస్తారు. ► పంపేముందు దరఖాస్తుదారుడి సెల్ నంబర్‌కు అధికారులు ఒక ఎస్ఎమ్ఎస్ను పంపిస్తారు. ‘‘పాస్‌పోర్టు కోసం మీరు పెట్టుకున్న దరఖాస్తు ఎస్బీ కార్యాలయానికి పలానా తేదీన చేరింది. విచారణ కోసం మీ వద్దకు ఎస్బీ అధికారి ఎప్పు డు, ఏ సమయంలో ఇంటికి రావాలో తెలపండి’’ అని ఎస్ఎమ్ఎస్లో ఉంటుంది. దరఖాస్తుదారుడు తనకు వీలున్న సమయాన్ని తిరిగి ఎస్ఎమ్ఎస్ ద్వారా ఎస్బీ అధికారులకు తెలియజేస్తాడు. ► తమ సిబ్బంది వల్ల ఏమైనా సమస్యలు ఏర్పడితే పలానా ఉన్నతాధికారి సెల్‌కు ఫోన్‌చేసి ఫిర్యా దు చేయవచ్చని కూడా ఎస్ఎమ్ఎస్ పంపిస్తారు. ► విచారణ అనంతరం దరఖాస్తుదారుడిపై ఏమైనా క్రిమినల్ రికార్డు ఉంటే ఆ విషయాన్ని ఎస్ఎమ్ఎస్ ద్వారా తెలియజేస్తారు. ►పాస్‌పోర్టుకోసం అర్హత పొందితే క్లియరె న్స్ సర్టిఫికెట్‌ను పాస్‌పోర్టు కార్యాలయానికి పంపి, ఎస్సె మ్మెస్ ద్వారా తెలియజేస్తారు. ► చివరకు పాస్‌పోర్టు అందిన తరువాత కూడా ఎస్బీ కార్యాలయం నుంచి ఉన్నతాధికారి నేరుగా దరఖాస్తుదారుడికి ఫోన్‌చేసి తమ సిబ్బంది వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కున్నారా, మంచిగా సేవలు అందించారా, మా సేవలతో ఎంతమాత్రం సంతృప్తి వ్యక్తపరుస్తారు అనే విషయాలను అడిగి తెలుసుకుంటారు. -
ఇక చైన్ స్నాచర్లపై పీడీ యాక్ట్:సీపీ
హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు ఇకపై ఎస్సెమ్మెస్ అలర్ట్ ఇస్తామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో మహేందర్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... నగరంలో చైన్ స్నాచింగ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. గత ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 804 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 428 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. చైన్‌స్నాచింగ్ పాల్పడేవారిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తామన్నారు. ముస్తఫా కేసు దర్యాప్తులో సైనికాధికారులు సహకరిస్తున్నారని చెప్పారు. సాధ్యమైనంత త్వరలో ఈ కేసును చేధిస్తామని మహేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రారంభమైన లాల్‌దర్వాజా ఉత్సవాలు
చాంద్రాయణగుట్ట:చారిత్రాత్మతకమైన లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి ఆలయంలో 106వ వార్షిక బ్రహోత్మవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకు మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్ దంపతులు నిర్వహించిన దేవి అభిషేకంతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఉదయం 11 గంటలకు నగర్ పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి, అదనపు కమిషనర్ అంజనీ కుమార్, జాయింట్ కమిషనర్ మల్లారెడ్డి, దక్షిణ మండలం డీసీపీ ఎస్ఎస్ త్రిపాఠి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఆలయం పెకైక్కి శిఖర పూజ చేశారు. అనంతరం ధ్వజారోహణ చేశారు. సాయంత్రం 6.15 గంటలకు కలశ స్థాపన జరిగింది. దేవి ఉపాసకులు దైవజ్ఞశర్మ, లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ బి.బల్వంత్ యాదవ్, మాజీ చైర్మన్లు కె.విష్ణుగౌడ్, బంగ్లా రాజు యాదవ్, రంగ రమేశ్ గౌడ్, సలహా కమిటీ చైర్మన్ జి.మహేశ్‌గౌడ్, కోశాధికారి టి.నర్సింగ్ రావు, ప్రధాన కార్యదర్శి కె.వెంకటేశ్, గౌలిపురా కార్పొరేటర్ ఆలే జితేంద్రతోపాటు ఆలయ కమిటీ సభ్యులు బీఆర్ సదానంద్ ముదిరాజ్, పోసాని సదానంద్ ముదిరాజ్, మాణిక్ ప్రభుగౌడ్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఎం.బాలసుబ్రహ్మణ్యం రెడ్డి పాల్గొన్నారు. -
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతా
అరాచక శక్తులపై ఉక్కుపాదం నేరాల అదుపులో ప్రజల భాగస్వామ్యం నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా ఎం.మహేందర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు నగర సీపీగా పనిచేసిన, ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ తన చేతుల మీదుగా బషీర్‌బాగ్‌లోని కమిషనర్ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు మహేందర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అనంతరం మహేందర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేలా పనిచేస్తామన్నారు. నగరంలో శాంతిభద్రతల అమలు, నేరాల నివారణతో పాటు నిందితులకు శిక్షలు పడేలా చేయటంలోనూ ప్రజలను భాగస్వాములను చేస్తామన్నారు. బాధితుడు నిర్భయంగా ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేసే పరిస్థితిని కల్పిస్తామన్నారు. నిజాయితీగా పనిచేసే ప్రతి పోలీసు అధికారికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఇక నగరంలోని అన్ని కూడళ్లలో సర్వేలెన్స్ కెమెరాల ఏర్పాటు ద్వారా నిఘా వ్యవస్థను పటిష్టపరిచి, ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. అరాచక, అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సమాచార వ్యవస్థ బలోపేతం, ట్రాఫిక్ మేనేజ్మెంట్, సిబ్బంది కొరత వంటి విషయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేసుల విషయంలో ఎవరితో రాజీపడకుండా బాధితులకు సంపూర్ణ న్యాయం చేసేలా పనిచేస్తామన్నారు. దేశంలో ఉగ్రవాద దాడులు ఎక్కడ జరిగినా దాని మూలాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయనడం సరికాదన్నారు. సైబరాబాద్‌ను నగర కమిషనరేట్‌లో విలీనం చేసే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి లేదన్నారు. కాగా, ఇప్పటివరకు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన ఆయన దాదాపు ఐదేళ్ల తరువాత సోమవారం పోలీసు యూనిఫామ్‌లో కనిపించారు. నూతనంగా బాధ్యతలు చే పట్టిన ఆయనను నగర అదనపు పోలీసు కమిషనర్లు జితేందర్, సందీప్‌శాండిల్య, జాయింట్ పోలీసు కమిషనర్లు సంజయ్‌కుమార్‌జైన్, మల్లారెడ్డి, అబ్రహంలింకన్, శివప్రసాద్, డీసీపీలు కమలాసన్‌రెడ్డి, జయలక్ష్మి, సత్యనారాయణ, త్రిపాఠి, షానవాజ్ ఖాసిం, సుధీర్‌బాబు, శ్యాంసుందర్, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీలు కోటిరెడ్డి, లింబారెడ్డి కలిసి అభినందించారు. రెండు ప్రభుత్వాలకు భద్రత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండూ నగరంలోనే ఉండడం, దీనికి తోడు వాటి ప్రధాన కార్యాలయాలు సైతం ఇక్కడే ఉండడంతో అందరికీ భద్రత కల్పించేందుకు త్వరలో నియమ నిబంధనలు తయారు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. రెండు ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. తమ ముందు చాలా సవాళ్లున్నా.. అధిగమిస్తామన్న ధీమాను ఆయన వ్యక్తపరిచారు. -
చందా...దందా: ఓ ఉన్నతాధికారి కుమార్తె పెళ్లికి వసూళ్ల పర్వం
మంత్రి పేషీలోని ఉన్నతాధికారి కుమార్తె పెళ్లికి వసూళ్ల పర్వం సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఎంకిపెళ్లి సుబ్చి చావుకొచ్చిందన్నట్లు.. ఒక అధికారి ఇంట్లో పెళ్లి కిందిస్థాయి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. వేలాది రూపాయలు ఇండెంట్ పెట్టి మరీ వసూలు చేస్తుండటంతో దిక్కుతోచకపోయినా.. ఇవ్వకపోతే ఏం ఇబ్బంది వస్తుందోనని వారు ముడుపులు చెల్లిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో ఈ వ్యవహారం సాగుతోంది. రాష్ట్ర పురపాలక శాఖామంత్రి ఎం. మహీధరరెడ్డి పేషీలో ఒక ఉన్నతాధికారి కుమార్తె వివాహం ఈ నెల 14న హైదరాబాద్‌లో జరగనుంది. దీంతో ఒక ఉన్నతాధికారి రంగంలోకి దిగి రాష్ట్రంలోని నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల్లో అధికారులకు ఇండెంట్లు ఇచ్చినట్లు తెలిసింది. గుంటూరు కార్పొరేషన్‌లోని ఉన్నతాధికారికే ఈ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ‘ఇది చాలా కాన్ఫెడెన్షియల్ మ్యాటర్.. బయటకు వచ్చిందంటే చర్యలు తప్పవు..’ అంటూ ముందే హెచ్చరికలు జారీచేశారు. విభాగాల వారీగా అధికారుల క్యాడర్‌ను బట్టి ఇండెంట్‌ను నిర్ణయించారు. ఇంజినీరింగ్ విభాగంలో ఇద్దరు అధికారులకు ఈ బాధ్యతలను అప్పగించారు. అసిస్టెంట్ ఇంజినీరు క్యాడర్ అయితే రూ.6 వేలు, డీఈ క్యాడర్ అయితే రూ.8 వేలు, ఈఈ క్యాడర్‌కు రూ.10 వేలు చొప్పున, పట్టణ ప్రణాళికా విభాగం ఉన్నతాధికారి ద్వారా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ నుంచి టీపీఎస్ క్యాడర్ వరకు రూ.6 వేలు, అసిస్టెంట్ సిటీప్లానర్, ఆ పైస్థాయి వారి నుంచి రూ.8 వేల నుంచి పదివేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతి విభాగంలో అధికారులు, సిబ్బంది నుంచి సొమ్ము వసూళ్లు సాగుతున్నాయి. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున సొమ్ము వసూలు చేస్తున్నారు.