‘సేఫ్’గా ఉండండి
సేఫ్ కాలనీపై మార్గదర్శకాలుజారీ చేసిన పోలీసులు
{ఫెండ్లీ పోలీసింగ్‌కు మరింత పదును
సిటీబ్యూరో: ‘ప్రతీరోజు మీరంతా వివిధ పనులపై ఇంటి నుంచి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందా? తిరిగి ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి అవుతుందా? ఇలాంటి పరిస్థితుల్లో రాత్రిపూట మీ కుటుంబసభ్యులు ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకుంటున్నా రా...? బయట ఉన్న మీకు కుటుంబసభ్యులు సురక్షితంగా ఉన్నారో.. లేదో అనే బెంగ లేకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం దేనికి.. నగర పోలీసులు మీ కోసం రూపొందించిన మార్గదర్శకాలను చదివి ‘సేఫ్ కాలనీ’ కార్యక్రమంలో భాగస్తులు కండి’. మీ కాలనీని మీరే సురక్షితంగా మార్చుకోండి.
మొదట ఇలా చేయాలి...
మీ కాలనీకి చెందిన పోలీసు స్టేషన్‌కు వెళ్లండి. అక్కడి ఎస్‌హెచ్‌ఓ (ఇన్‌స్పెక్టర్) లేదా సెక్టార్ ఎస్‌ఐలు ఈ విషయంలో మీకు పూర్తిగా సహకరిస్తారు. మొదట కాలనీ సంక్షేమసంఘం సభ్యులంతా కలిసి కాలనీ మ్యాప్‌ను తయారు చేసుకోవాలి. మీ కాలనీకి రావడానికి, వెళ్లడానికి ఎన్నో దారులు ఉన్నాయో గుర్తించాలి. వాటిలో ఎన్నిదారులు పగటిపూట అవసరం, ఎన్ని దారులు రాత్రి పూట అవసరమో నిర్ధారించాలి. దారులు ఎంత తక్కువగా ఉంటే, కాలనీకి వచ్చి పోయేవారిపై నిఘా అంత సులభం. రాత్రిపూట కాలనీకి ఒకే ఎంట్రీ, ఒకే ఎగ్జిట్ ఏర్పాటు చేసుకుంటే అవాంఛనీయ వ్యక్తులు, వాహనాల రాకపోకలను నియంత్రించడం చాలా సులువవుతుంది. ఒకరు లేదా ఇద్దరు ప్రైవేటు సెక్యూరిటీగార్డులను లేదా వాచ్‌మన్‌ను నియమించుకుంటే రాత్రి పూట ఎంట్రీ, ఎగ్జిట్ దగ్గర కాపలాగా ఉంటారు.కాలనీకి వివిధ పనుల నిమిత్తం.. అంటే నౌకర్లు, డ్రైవర్లు, పాలవారు, పేపర్‌బాయ్‌లు, కేబుల్, టీవీ వర్కర్లు వంటి వాళ్లకు గుర్తింపుకార్డులు ఇవ్వడం ద్వారా వారిపై నియంత్రణ సాధ్యమవుతుంది. వ్యక్తులు, వాహనాల వివరాలన్నీ పూర్తిగా నమోదు చేయడం వల్ల నేరాలను నివారించవచ్చు.కాలనీవాసులంతా కలిసి పరిమితి సంఖ్యలో సీసీటీవీలు ఏర్పాటు చేసుకుంటే పూర్తిస్థాయి భద్రత సాధ్యపడుతుంది.
పోలీసు సహకారం ఇలా...
మీ కాలనీ మ్యాప్‌లు రూపొందించడం, ఎంట్రీ, ఎగ్జిట్‌ల నిర్వహణలో స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ, సెక్టార్ ఎస్‌ఐలు సహాయపడతారు.రాత్రిపూట కాలనీ గేట్లను మూసేయడానికి కావాల్సిన స్టాపర్లను, సూచికల బోర్డులను అందిస్తారు.మీరు నియమించుకున్న సెక్యూరిటీగార్డులు సమర్థంగా విధులు నిర్వర్తిన్నదీ లేనిదీ తనిఖీ చేస్తారు.సీసీటీవీలను పోలీసు స్టేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించడం వల్ల 24/7 భద్రత సాధ్యపడుతుంది.
ప్రయోజనాలు....
ఎప్పటికప్పుడు నేర నియంత్రణ చర్యల గురించి సమాచారం అందిస్తారు.
వేరే ప్రాంతాల్లో జరిగే నేరాలను ముందే తెలియజేయడం ద్వారా మిమ్నల్ని అప్రమత్తం చేస్తారు.
మీ కాలనీలో నేరాలు జరిగినా క్షణాల్లో మిస్టరీ విప్పుతారు.
అన్ని వర్గాలు కలిసి రావాలి..
సేఫ్ కాలనీ కార్యక్రమంలో అన్ని వర్గాల వారు కలిసి రావాలని పిలుపు ఇచ్చాం. ఇందుకోసం రూపొందించిన మార్గదర్శకాలను ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు పది లక్షల కరపత్రాలను ముద్రించాం. వీటిని ఇంటింటికీ స్థానిక పోలీసుల ద్వారా పంపిస్తున్నాం. ప్రజలను సేఫ్ కాలనీపై అవగాహన కల్పిస్తున్నాం. వారితో నిరంతర సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇలా చేయడం ద్వారా మత ఘర్షణలు, అల్లర్లు, దొంగతనాలు, స్నాచింగ్‌లు వంటివి తగ్గుతాయి. ప్రజలకు సుఖఃశాంతులతో జీవించే సదుపాయం కలుగుతుంది. అసాంఘిక శక్తులకు నిలువ నీడ దొరకదు.
-ఎం.మహేందర్‌రెడ్డి