పోలీసు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. చిత్రంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీ కుమార్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గోషామహల్ స్టేడియంలోని అమరవీరుల స్థూపం వద్ద గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఘననివాళులు అర్పించారు. గురువారం గోషామహల్‌లో నిర్వహించిన ప్లాగ్ డే కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డితోపాటు పలువురు రిటైర్డ్ డీజీపీలు, సీనియర్ పోలీసు అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, అమర పోలీసుల కుటుంబ సభ్యులు హాజరై విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ‘అమరులు వారు’పుస్తకాన్ని హోంమంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలవుతున్న పటిష్టమైన పోలీసింగ్ వల్లనే మెరుగైన శాంతి భద్రతలున్నాయని, భద్రతలో పోలీస్ శాఖ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందని, ఇతర రాష్ట్రాలతో పోల్చిచూస్తే మన రాష్ట్రంలో క్రైమ్ రేటు అతి తక్కువగా ఉందని వివరించారు. కరోనా కారణంగా విధినిర్వహణలో రాష్ట్రంలో మొత్తం 62 మంది పోలీసులు మరణించారని, వీరి కుటుంబాలకు అండగా ఉంటామని హోంమంత్రి హామీ ఇచ్చారు.
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న హోంమంత్రి మహమూద్
ప్రాణత్యాగానికి వెనుకాడం...
అమరవీరుల దినోత్సవం సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరన్న విషయాన్ని అమరులైన పోలీసులు సమాజానికి గుర్తుచేస్తున్నారని పేర్కొన్నారు. సాంకేతికత ద్వారా శాంతి భద్రతలను కాపాడుతున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8.25 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment