మంత్రి పేషీలోని ఉన్నతాధికారి కుమార్తె పెళ్లికి వసూళ్ల పర్వం
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఎంకిపెళ్లి సుబ్చి చావుకొచ్చిందన్నట్లు.. ఒక అధికారి ఇంట్లో పెళ్లి కిందిస్థాయి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. వేలాది రూపాయలు ఇండెంట్ పెట్టి మరీ వసూలు చేస్తుండటంతో దిక్కుతోచకపోయినా.. ఇవ్వకపోతే ఏం ఇబ్బంది వస్తుందోనని వారు ముడుపులు చెల్లిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో ఈ వ్యవహారం సాగుతోంది. రాష్ట్ర పురపాలక శాఖామంత్రి ఎం. మహీధరరెడ్డి పేషీలో ఒక ఉన్నతాధికారి కుమార్తె వివాహం ఈ నెల 14న హైదరాబాద్‌లో జరగనుంది. దీంతో ఒక ఉన్నతాధికారి రంగంలోకి దిగి రాష్ట్రంలోని నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల్లో అధికారులకు ఇండెంట్లు ఇచ్చినట్లు తెలిసింది.
గుంటూరు కార్పొరేషన్‌లోని ఉన్నతాధికారికే ఈ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ‘ఇది చాలా కాన్ఫెడెన్షియల్ మ్యాటర్.. బయటకు వచ్చిందంటే చర్యలు తప్పవు..’ అంటూ ముందే హెచ్చరికలు జారీచేశారు. విభాగాల వారీగా అధికారుల క్యాడర్‌ను బట్టి ఇండెంట్‌ను నిర్ణయించారు. ఇంజినీరింగ్ విభాగంలో ఇద్దరు అధికారులకు ఈ బాధ్యతలను అప్పగించారు. అసిస్టెంట్ ఇంజినీరు క్యాడర్ అయితే రూ.6 వేలు, డీఈ క్యాడర్ అయితే రూ.8 వేలు, ఈఈ క్యాడర్‌కు రూ.10 వేలు చొప్పున, పట్టణ ప్రణాళికా విభాగం ఉన్నతాధికారి ద్వారా బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ నుంచి టీపీఎస్ క్యాడర్ వరకు రూ.6 వేలు, అసిస్టెంట్ సిటీప్లానర్, ఆ పైస్థాయి వారి నుంచి రూ.8 వేల నుంచి పదివేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతి విభాగంలో అధికారులు, సిబ్బంది నుంచి సొమ్ము వసూళ్లు సాగుతున్నాయి. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున సొమ్ము వసూలు చేస్తున్నారు.
చందా...దందా: ఓ ఉన్నతాధికారి కుమార్తె పెళ్లికి వసూళ్ల పర్వం
Published Fri, Nov 8 2013 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
Advertisement