
ఎంత గంభీరంగా ఉండే తండ్రి అయినా సరే, పెళ్లి తరువాత కూతురు అత్తారింటికి వెళుతుంటే భావోద్వేగానికి గురై ఏడుస్తాడు. ‘నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను. నాకు ఎలాంటి భావోద్వేగాలు లేవు’ అని చెప్పేవాళ్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు. దీనికి తాజా ఉదాహరణ అనురాగ్ కశ్యప్.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాటలు విన్నవారికి... ‘ఇతడు చాలా ప్రాక్టికల్ సుమీ. భావోద్వేగాలు మచ్చుకైనా కనిపించవు’ అనిపిస్తుంది.
అయితే అనురాగ్ తన కూతురు పెళ్లి తరువాత నాన్‌స్టాప్‌గా ఏడ్చాడు. ఒకటి కాదు రెండు కాదు నిర్విరామంగా పదిరోజులు ఏడ్చాడు.
అనురాగ్ కూతురు ఆలియా కశ్యప్ పెళ్లి జరిగింది. ఆ తరువాత అనురాగ్ ఏడుపు పర్వం మొదలైంది. పరిచయం లేని వ్యక్తుల ముందు కూడా ఏడ్చేవాడు.
‘నా కూతురు పుట్టుక, పెళ్లికి సంబంధించి ఒకేరకమైన భావోద్వేగానికి గురయ్యాను. ఎందుకు ఏడుస్తున్నానో నాకే తెలియదు. కాని ఏడ్చేవాడిని. ఒకసారి ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు మా అమ్మాయి ప్రస్తావన రాగానే ఏడ్చేశాను’ అన్నాడు అనురాగ్ కశ్యప్.
ఈ పదిరోజుల ఏడుపు ఎపిసోడ్ పుణ్యమా అని తనకు తాను ‘బిగ్గర్ క్రయర్’ అని పేరు పెట్టేసుకున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment