ఇసుకపై ఇంకో అబద్ధం | Andhra Pradesh cabinet scraps GST on sand | Sakshi
Sakshi News home page

ఇసుకపై ఇంకో అబద్ధం

Oct 25 2024 4:01 AM | Updated on Oct 25 2024 4:01 AM

Andhra Pradesh cabinet scraps GST on sand

లేని అధికారంతో జీఎస్‌టీ రద్దు అంటూ కేబినెట్‌ భేటీ తరువాత మంత్రి ప్రకటన

సాక్షి, అమరావతి: ఇసుకపై కేబినెట్‌ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలను వల్లె వేసింది. ఇసుకపై జీఎస్‌టీని రద్దు చేస్తూ బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు గనుల, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. నిజానికి జీఎస్‌టీని రద్దు చేసే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వా­నికీ లేదు. అయినా సరే ఇసుకపై జీఎస్‌టీని రద్దు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, ఇక నుంచి పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటుందని మంత్రి రవీంద్ర ప్రకటించడంపై అధికార యంత్రాంగం సైతం  విస్తుపోతోంది.

ఇసుక తవ్వకం, లోడింగ్‌ వ్యయంపై 18 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం వినియోగ­దారులపైనే పడుతుంది. ప్రైవేట్‌ ఏజెన్సీలు ఇసుక సేల్‌ పాయింట్ల దగ్గర విక్రయిస్తే ఐదు శాతం జీఎస్‌టీ చెల్లించాలి. ఇది కూడా వినియోగదారుల­పైనే పడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తనకు లేని అధికారంతో జీఎస్‌టీని రద్దు చేస్తూ ఎలా నిర్ణయం తీసుకుంటుందని ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

జీఎస్‌టీ కౌన్సిల్‌దే నిర్ణయం
ఇసుక సహా ఏదైనా సరే జీఎస్‌టీ నుంచి మినహా­యింపు పొందాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర జీఎస్‌టీ కౌన్సిల్‌కు ప్రతిపాదించాల్సి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశమై జీఎస్‌టీ నుంచి మినహాయింపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంటే నోటిఫికేషన్‌ జారీ చేస్తారని, అది దేశమంతా వర్తిస్తుందని చెప్పారు. రాష్ట్రానికో మాదిరిగా జీఎస్‌టీ ఉండదని, మీడియా సమావేశంలో మంత్రి చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించారు. ఇసుకపై సీనరేజ్‌ రద్దు చేసే అధికారం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అయితే జీఎస్‌టీ కూడా రద్దు చేశామని ప్రకటించడమంటే ప్రజల కళ్లకు గంతలు కట్టడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 

చట్టం గురించి తెలియదా?
ఇసుక కార్యకలాపాలపై ఎస్‌జీఎస్‌టీని మాత్రమే రీ­యి­ంబర్స్‌ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని, అంతకు మించి జీఎస్‌టీని రద్దు చేసే అధి­కారం లేదని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు వెల్ల­డించారు. అందరి కన్నా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేశానని, తనకు ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు జీఎస్‌టీని రద్దు చేసే అధికారం రాష్ట్రాలకు లేదని తెలియదా? అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిర్మాణ రంగానికి ప్రైవేట్‌ ఏజెన్సీల నుంచి కొనుగోలు చేసే ఇసుకపై 2017 సీజీఎస్‌టీ చట్టం సెక్షన్‌ 9 ప్రకారం ఐదు శాతం జీఎస్‌టీ చెల్లించాలి. ఇసుక తవ్వకం, లోడింగ్‌ వ్యయంలో సీజీఎస్‌టీ చట్టం సెక్షన్‌ 7 (1) ప్రకారం 18 శాతం జీఎస్‌టీ చెల్లించాలి. ఈ చట్టం జమ్మూ–కశ్మీర్‌ మినహా దేశమంతా వర్తిస్తుంది.

మాఫియాను అరికట్టలేక చేతులెత్తేశారు..!
తనకు ఏమాత్రం అధికారం లేని జీఎస్‌టీని రద్దు చేసినట్లు అబద్ధాలు చెబుతూ సీఎం చంద్రబాబు ఇసుక వినియోగదారులతో చెలగాటం ఆడుతు­న్నా­రని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్రంలో ఇసుక దొరకపోవడానికి, అత్యధిక ధరలకు విక్రయించడానికి మూల కారణం పచ్చ ముఠాలేనని తెలిసినా వారిని నిరోధించకుండా గత ప్రభుత్వంపై నిందలు మోపటాన్ని బట్టి ఇసుక మాఫియాను అరికట్టలేక చంద్రబాబు చేతులెత్తేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొ­న్నారు. ఇసుక బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతోందని, అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ అధికారులు ఇచ్చిన నివేదికలను పట్టించుకోకుండా గత ప్రభుత్వంపై బురద చల్లితే ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రిగా తానే ఉన్నాననే విషయాన్ని విస్మరిస్తున్న చంద్రబాబు టీడీపీ నేతల ఇసుక దోపిడీని అరికట్టకుండా ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా ప్రజలు విశ్వసించరని చెప్పారు. ఇసుక విధానంలో ఇప్పటి వరకు నాలుగు సార్లు మార్పులు చేసినా ప్రయోజనం శూన్యమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సరఫరా కేంద్రాల వద్ద గంటల తరబడి వాహనాలు నిరీక్షించాల్సి రావడం వల్ల ఎక్కువ రవాణా చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. బ్లాక్‌ మార్కెటింగ్, అస్తవ్యస్థంగా రీచ్‌ల నిర్వహణ గురించి తెలిసినా పట్టించుకోకపోవటాన్ని బట్టి ప్రభుత్వం ఈ దోపిడీని ప్రోత్సహిస్తున్నట్లు భావించాల్సి వస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement