'ధోనీ'కి పన్ను మినహాయింపు
రాంఛీ: టీమిండియా క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన మూవీ 'ఎమ్‌ఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ'. అయితే ఈ చిత్రానికి ధోనీ సొంత రాష్ట్రం ఝార్ఖండ్ ప్రభుత్వం పన్ను మినహాయింపు అవకాశం ఇచ్చింది. ధోనీ గౌరవార్థం తమ రాష్ట్రంలో ధోనీ మూవీపై ఎలాంటి వినోద పన్ను, ఇతర పన్నులు వేయాలనుకోవడం లేదని ఓ అధికారి తెలిపారు. ధోనీ రాంఛీలోనే పుట్టారని, అక్కడి నుంచే ఆయన ప్రస్థానం మొదలైందని నిర్మాత, ఫాక్స్ స్టార్ స్టూడియో సీఈవో విజయ్ సింగ్ చెప్పారు. ధోనీ నిజ జీవితంపై వస్తున్న చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
నిరజ్‌పాండే దర్శకత్వం వహించిన ఈ మూవీలో ధోనీ పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కనిపించనున్నాడు. దిశా పటాని, అనుపమ్ ఖేర్, భూమిక చావ్లా, కియారా అద్వానీ కీలక పాత్రలలో నటించారు. ఈనెల 30న 'ఎమ్‌ఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ' విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు తెరపై దర్శకుడు తనను ఎలా ఆవిష్కరించాడో తెలుసుకోవాలని టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ధోనీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.