రీల్స్‌ ఆన్‌ వీల్స్‌! | New startup diary picture time | Sakshi
Sakshi News home page

రీల్స్‌ ఆన్‌ వీల్స్‌!

Published Sat, Jul 21 2018 12:45 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

New startup diary picture time - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: తిండి.. బట్ట.. ఇల్లు. ఈ మూడింటి తర్వాత మనిషికి కావాల్సింది వినోదమే!!. అందులో ముందుండేది సినిమానే!. కాకపోతే ఈ రంగంలో పెద్ద కంపెనీలదే హవా. ఇక్కడ చిన్న కంపెనీలు రాణించాలంటే వినూత్న ఆలోచన కావాలి.పిక్చర్‌ టైమ్‌ చేసిందిదే!!. గ్రామీణ ప్రాంతాల వారికి మల్టీప్లెక్స్‌ సినిమా అనుభూతిని కల్పించాలనుకుంది. దీనికోసం ప్రత్యేకంగా వాహనాలకు అభివృద్ధి చేసి సినిమాలను ప్రదర్శిస్తోంది. గోవా కేంద్రంగా 2015 అక్టోబర్లో ప్రారంభమైన ‘పిక్చర్‌ టైమ్‌’ సేవల గురించి మరిన్ని వివరాలు ఫౌండర్‌ సుశీల్‌ చౌధురి ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.

నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందం..
25 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామాల్లో పిక్చర్‌ టైమ్‌ సేవలందిస్తున్నాం. కొత్త సినిమాల రిలీజ్‌ కోసం స్థానిక డిస్ట్రిబ్యూటర్లతో పాటు శోభు యార్లగడ్డ, శీతల్‌ భాటియా వంటి నిర్మాతలు, యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ (వైఆర్‌ఎఫ్‌), రెడ్‌ చిల్లీస్‌ వంటి నిర్మాణ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం.

త్వరలో ఫాక్స్‌ స్టార్, డిస్నీ, సోనీ పిక్చర్స్‌ వంటి సంస్థలతోనూ ఒప్పందం చేసుకోనున్నాం. కార్పొరేట్‌ ప్రకటనలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్‌ ప్రదర్శనలు, బ్రాండింగ్, సినిమా టికెట్ల అమ్మకం వంటి మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. గత సంవత్సరం రూ.8 లక్షల టర్నోవర్‌ను నమోదు చేశాం. ప్రకటనల ధరలు డీఏవీపీ నిర్దేశించినట్లే ఉంటాయి.

వచ్చే నెలాఖరుకు తెలుగు రాష్ట్రాల్లోకి...
ప్రస్తుతం ఒరిస్సా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో పిక్చర్‌ టైమ్‌ సేవలందిస్తోంది. ఆ రాష్ట్రాల్లో ఇప్పటివరకు 50కి పైగా సినిమాలను ప్రదర్శించాం. రేస్‌–3, సంజు, బాహుబలి–2 సినిమాలు నేరుగా పిక్చర్‌ టైమ్‌లో రిలీజయ్యాయి. వచ్చే నెలాఖరుకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎంట్రీ ఇస్తాం. స్థానికంగా ఒకరిద్దరితో జట్టుకట్టాం. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుతో పాటూ హిందీ సినిమాలనూ ప్రదర్శిస్తాం.

10 మొబైల్‌ సినిమా ట్రక్స్‌..
సినిమాలను ప్రదర్శించేందుకు, ప్రేక్షకులు కూర్చునేందుకు వీలుగా పోర్టబుల్‌ మొబైల్‌ డిజిటల్‌ మూవీ థియేటర్‌ను ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం అన్ని వాతావరణ పరిస్థితులనూ తట్టుకునేలా ట్రక్‌లను ఆధునీకరిస్తాం. ఏసీ, హెచ్‌డీ స్క్రీన్, 5.1 డోల్బీ సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తున్నాం. థియేటర్‌లో 120–150 సీట్లుంటాయి.

ప్రస్తుతం పిక్చర్‌ టైమ్‌లో 10 మొబైల్‌ సినిమా ట్రక్‌లున్నాయి. ట్రక్‌ వెలుపలి భాగంలో ఫుడ్‌ కోర్ట్, ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్‌ జోన్లు, వై–ఫై హాట్‌స్పాట్స్, మైక్రో ఏటీఎం వంటి ఏర్పాట్లుంటాయి. టికెట్‌ ధరలు రూ.30–50. ఆక్యుపెన్సీ 60% ఉంటుంది.  

6 నెలల్లో రూ.100 కోట్ల సమీకరణ..
ప్రస్తుతం 60 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది చివరికి 3 వేల పోర్టబుల్‌ మొబైల్‌ డిజిటల్‌ మూవీ థియేటర్‌లను ఏర్పాటు చేస్తాం. ఇటీవలే ప్రీ–సిరీస్‌ రౌండ్‌లో భాగంగా రూ.25 కోట్ల నిధులు సమీకరించాం. ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ సీఎక్స్‌ పార్టనర్స్‌ కో–ఫౌండర్‌ అజయ్‌ రిలాన్‌ ఈ పెట్టుబడి పెట్టారు. వచ్చే 6 నెలల్లో మరో రౌండ్‌లో రూ.100 కోట్ల పెట్టుబడులు సమీకరిస్తాం. 2021 నాటికి ఎస్‌ఎంఈ వేదికగా ఐపీవోకి వెళ్లాలని లకి‡్ష్యంచాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement