బార్‌కోడ్‌లో రెజ్యూమ్‌! వీడియోలో ఇంటర్వ్యూ!! | New startup 'hullo jobs' | Sakshi
Sakshi News home page

బార్‌కోడ్‌లో రెజ్యూమ్‌! వీడియోలో ఇంటర్వ్యూ!!

Published Sat, Jun 23 2018 12:11 AM | Last Updated on Sat, Jun 23 2018 12:11 AM

New startup 'hullo jobs' - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఓలా, ఉబర్‌ వంటి రెంటల్‌ కార్ల బుకింగ్‌ ఎలా చేయాలో మనకందరికీ తెలిసిందే! అచ్చం అలాగే కంపెనీల ఉద్యోగ నియామకాలూ ఉంటే! ఖాళీగా ఉన్న జాబ్స్‌ వివరాలు అభ్యర్థులకు.. అలాగే విద్యార్హతలతో కూడిన అభ్యర్థుల వివరాలు కంపెనీలకూ గూగుల్‌ మ్యాప్స్‌లో దర్శనమిస్తుంటే? ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. బెంగళూరుకు చెందిన హలోజాబ్స్‌ అనే స్టార్టప్‌ ఈ నియామక టెక్నాలజీని రూపొందించింది. ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉందని, ఏడాదిలో విపణిలోకి విడుదల చేస్తామని ధీమా వ్యక్తం చేశారు హలోజాబ్స్‌ ఫౌండర్‌ శ్రీనివాస్‌ వరాహగిరి. మరిన్ని వివరాలను ఆయన ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.  

‘‘మాది తూర్పు గోదావరి జిల్లా చింతలపల్లి గ్రామం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తయ్యాక... పలు ప్రైవేట్‌ కంపెనీల్లో హెచ్‌ఆర్, ఫైనాన్స్‌ విభాగంలో కీలక స్థాయిల్లో పనిచేశా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు బార్‌ కౌన్సిల్‌ సభ్యుడిని కూడా. హెచ్‌ఆర్‌లో పని చేయటం వల్లే కావొచ్చు... ఉద్యోగ నియామక ప్రక్రియలోని సమస్యలను క్షుణ్నంగా తెలుసుకునే వీలు కలిగింది. టెక్నాలజీతో మానవ వనరుల విభాగం అవసరాలను సులభతరం చేయాలని నిర్ణయించుకొని.. రూ.25 లక్షల పెట్టుబడితో 2016 ఆగస్టులో బెంగళూరు కేంద్రంగా హలోజాబ్స్‌ను ప్రారంభించా.

బార్‌కోడ్‌లో రెజ్యూమ్‌..
సాధారణంగా ఉద్యోగ నియామక ప్రక్రియ ఎలా ఉంటుందంటే.. పేజీలకు పేజీలు రెజ్యూమ్‌లు చేతపట్టుకొని కంపెనీల చుట్టూ తిరిగే అభ్యర్థులు ఒకవైపు. నియామకాల్లో ఎంపికైన అభ్యర్థుల వ్యక్తిగత సమాచారం, సర్టిఫికెట్స్‌ ధ్రువీకరణ కోసం కంపెనీలు మరోవైపు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా హలోజాబ్స్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఏటీఎం కార్డు తరహాలో ఉచితంగా క్యూఆర్‌ కోడ్‌తో విజువల్‌ రెజ్యూమ్‌ (వీఆర్‌) గుర్తింపు కార్డును అందిస్తాం.

ఇందులో అభ్యర్థి విద్యా సంబంధమైన వివరాలతో పాటు, నైపుణ్యం, అనుభవం వంటి కీలక సమాచారాన్ని సులువుగా గుర్తించేలా ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. పైగా అభ్యర్థుల సర్టిఫికెట్స్, వ్యక్తిగత వివరాలు ధ్రువీకరణ ప్రక్రియ అంతా హలోజాబ్స్‌ చేసి బార్‌కోడ్‌లో నిక్షిప్తం చేస్తాం. కంపెనీలు తమ మొబైల్‌ ఫోన్‌తో ఈ బార్‌కోడ్‌ను స్కాన్‌ చేసినా లేదా ఫొటో తీసినా సరే వెంటనే అభ్యర్థి రెజ్యూమ్‌ ఫోన్‌ లేదా డెస్క్‌టాప్‌లోకి వచ్చేస్తుంది. అంతేకాకుండా ఎంపికైన అభ్యర్థి గురించి మళ్లీ కంపెనీ వెరిఫికేషన్‌ చేయాల్సిన అవసరముండదు.  

వీడియోలోనే ఇంటర్వ్యూలు..
విజువల్‌ రెజ్యూమ్‌తో పాటూ వీడియో ఇంటర్వ్యూ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేశాం. త్వరలోనే విపణిలోకి విడుదల చేయనున్నాం. ఇదేంటంటే... అభ్యర్థులు ఎక్కడున్నా ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా ఇంటర్వ్యూ కు హాజరయ్యే అవకాశముంటుంది. ప్రస్తుతం బెంగళూరు, చెన్నైల్లో సేవలందిస్తున్నాం.

ఈ ఏడాది ముగింపు నాటికి హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై, పుణె, అహ్మదాబాద్‌ నగరాలకు విస్తరించనున్నాం. ప్రస్తుతం హలోజాబ్స్‌లో 3 లక్షల మంది అభ్యర్థులు, 140 కంపెనీలు నమోదయ్యాయి. వీటిలో ప్రణవ హెల్త్‌కేర్, కాన్‌కార్డ్‌ ఆటోమేషన్, డిజిటల్‌ అకాడమీ వంటివి కొన్ని. ఏపీ, తెలంగాణ నుంచి 40 వేల అభ్యర్థులుంటారు. ఇప్పటివరకు హలోజాబ్స్‌ వేదికగా 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలొచ్చాయి.

రూ.5 కోట్ల ఆదాయం లక్ష్యం..
మా ఆదాయ మార్గం రెండు విధాలుగా ఉంటుంది.  ఒక ఉద్యోగ నియామక ప్రకటనకు రూ.250 ఉంటుంది. అలా కాకుండా నమోదైన అభ్యర్థుల డేటాబేస్‌ పొందాలంటే లక్ష రూపాయల వరకు ఉంటుంది. డేటాబేస్‌తో కంపెనీలు వాళ్లకు కావాల్సిన అభ్యర్థిని ఎంచుకునే వీలుంటుంది.

కంపెనీల తరఫున ఇంటర్వ్యూ హలోజాబ్స్‌ చేసి పెడుతుంది. ఎంపికైన అభ్యర్థికిచ్చే ప్యాకేజ్‌లో 5–8.3 శాతం కంపెనీ నుంచి కమీషన్‌ రూపంలో తీసుకుంటాం. ప్రస్తుతం నెలకు 5 వేల మంది అభ్యర్థులు నమోదవుతున్నారు. 2,500 జాబ్‌ పోస్టింగ్స్‌ అవుతున్నాయి. సుమారు 100 ఇంటర్వ్యూలు చేస్తున్నాం.  

రూ.25 కోట్ల నిధుల సమీకరణ..
ప్రస్తుతం నెలకు రూ.15 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. 15% వృద్ధిని నమోదు చేస్తున్నాం. ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి రూ.5 కోట్ల టర్నోవర్, 2020 నాటికి రూ.20 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలన్నది మా లక్ష్యం. వచ్చే ఏడాది కాలంలో 25 లక్షల మంది అభ్యర్థులకు, సింగపూర్, మలేషియా దేశాలకు విస్తరించాలన్నది లక్ష్యం. ప్రస్తుతం మా కంపెనీలో 36 మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.25 కోట్ల నిధులను సమీకరిస్తామని’’ శ్రీనివాస్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement