దంతం.. వీరి వ్యాపార మంత్రం!! | My Dentist's Choice this is Startup Diary | Sakshi
Sakshi News home page

దంతం.. వీరి వ్యాపార మంత్రం!!

Published Sat, Sep 24 2016 6:22 AM | Last Updated on Tue, Oct 16 2018 8:03 PM

దంతం.. వీరి వ్యాపార మంత్రం!! - Sakshi

దంతం.. వీరి వ్యాపార మంత్రం!!

చేతి గ్లౌజ్ నుంచి డెంటిస్ట్ చెయిర్ వరకూ..
* దంత వైద్య పరికరాలను విక్రయిస్తున్న మై డెంటిస్ట్ చాయిస్
* 80 రకాల బ్రాండ్లు.. 6 వేలకు పైగా ఉత్పత్తుల లభ్యం
* వచ్చే ఏడాది మధ్య ప్రాచ్య, ఆఫ్రికా దేశాలకూ విస్తరణ
* రూ.20 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దంత పరిశ్రమలోని ప్రధాన సమస్య ఏంటో తెలుసా.. దంత పరికరాలు, ఉత్పత్తుల కొనుగోళ్లే! ఎందుకంటే ఆయా ఉత్పత్తుల్లో 80% విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఉన్న కొద్దిపాటి విక్రయ కేంద్రాలైనా మెట్రో నగరాలకే పరిమితం.

మరి, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని దంత వైద్యుల పరిస్థితేంటి? ..ఇదిగో సరిగ్గా ఇలాంటి అనుభవం స్థానిక దంత వైద్యుడు అల్లాడి చంద్రశేఖర్‌కూ ఎదురైంది. దాన్నే వ్యాపార అవకాశంగా భావించాడు. టెక్నాలజీ నిపుణులైన సునీల్ మేడ, శివప్రసాద్ పిన్నపురాల ఇద్దరితో కలిసి ఈ-కామర్స్ సంస్థను ఆరంభించాడు. నిజానికి సీబీఐటీలో ఇంజినీరింగ్ చేసేటప్పటి  నుంచీ శివ ప్రసాద్, సునీల్ స్నేహితులు. అమెరికాలో 15 ఏళ్ల పాటు వివిధ ఐటీ కంపెనీల్లో సహోద్యోగులగా పనిచేశారు.

ఓ రోజు డాక్టర్ చంద్రశేఖర్ అల్లాడి.. తన మిత్రుడైన శివ ప్రసాద్‌తో దంత పరిశ్రమలోని సమస్యను, వ్యాపార అవకాశాలను చర్చించాడు. అదే అవకాశంగా భావించి సునీల్‌తో కలసి వారిద్దరూ రూ.60 లక్షల పెట్టుబడితో మై డెంటిస్ట్ చాయిస్.కామ్‌ను ప్రారంభించారు. 2014 జూలైలో ఆరంభమైన ఈ సంస్థ... చేతి గ్లౌజ్‌ల నుంచి మొదలుపెడితే డెంటిస్ట్ చెయిర్ వరకూ వైద్యుడికి అవసరమైన అన్ని రకాల ఉత్పత్తుల్నీ అందిస్తుంది. దీనికి సంబంధించి సునీల్ మేడా చెప్పింది ఆయన మాటల్లోనే...
 
80 బ్రాండ్లు.. 6 వేల ఉత్పత్తులు..
‘‘ప్రస్తుతం మా వద్ద జీసీ ఇండియా, జీడీసీ, ఐవోక్లార్, డెన్స్‌ప్లే, ప్రైమ్ డెంటల్, మనీ, ఎస్‌డీఐ, పీవో వంటి 80 రకాల బ్రాండ్లు, సుమారు 6 వేలకు పైగా ఉత్పత్తులున్నాయి. అమెరికాకు చెందిన వాక్యూక్లియర్ సంస్థతో ఎక్స్‌క్లూజివ్ ఒప్పందం చేసుకున్నాం. దీంతో విదేశీ మార్కెట్లో విడుదలయ్యే ఉత్పత్తులను మన దేశీయ విపణిలోనూ విక్రయించే వీలుంటుంది. ఈ ఏడాది ముగిసేనాటికి మరో రెండు కంపెనీల తోనూ ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలు చేసుకుంటాం. నేరుగా దంత వైద్య పరికరాలు, ఉత్పత్తుల తయారీ సంస్థలతో ఒప్పందం చేసుకోవటం వల్ల ఇతరులతో పోలిస్తే 10 శాతం తక్కువ ధరకే మేం విక్రయిస్తాం. ఉత్పత్తుల డెలివరీ కోసం ఫెడెక్స్, డీటీడీసీ, డెల్హివరీ సంస్థలతో, 100 కిలోలు మించిన సరుకుల డెలివరీ కోసం ఈకార్గో, వీఆర్‌ఎల్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం.
 
రూ.20 కోట్ల నిధుల సమీకరణ...

ఈ ఏడాది మార్చిలో అమెరికాకు చెందిన ఇద్దరు ఏంజిల్ ఇన్వెస్టర్లు మా సంస్థలో కోటి రూపాయల పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది ముగిసే నాటికి సిరీస్-ఏలో భాగంగా రూ.20-30 కోట్ల నిధులు సమీకరించాలని నిర్ణయించాం. నెక్సస్ వెంచర్ వంటి ఒకటి రెండు వీసీ సంస్థలతో చర్చిస్తున్నాం. త్వరలో రోజువారీ ఆర్డర్ల విలువను లక్షకు, ఉత్పత్తుల సంఖ్యను 20 వేలకు చేర్చాలని లక్ష్యించాం. ప్రస్తుతం మా సంస్థలో 16 మంది ఉద్యోగులున్నారు. మరో వారం రోజుల్లో ఐఓఎస్ వర్షన్ యాప్‌నూ మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం. వచ్చే ఏడాది మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాలకూ విస్తరించనున్నాం. ఆ తర్వాత ఆర్థోపెడిక్, నర్సింగ్ విభాగాల్లోకి కూడా వస్తాం.’’
 
రూ.4-5 కోట్ల వ్యాపార లక్ష్యం...
ప్రస్తుతం 1,000-1,200 మంది డెంటిస్ట్‌లు కస్టమర్లుగా ఉన్నారు. ఇందులో 60 శాతం మంది రిపీటెడ్ కస్టమర్లే. రోజుకు రూ.40-50 వేల విలువైన ఆర్డర్లొస్తున్నాయి. నెలకు రూ.15-20 లక్షల వ్యాపారాన్ని చేస్తున్నాం. ఇందులో ఖర్చులన్నీ పోగా 6-7 శాతం లాభాలుంటాయి. ఈ ఏడాది ముగిసేనాటికి రూ.4-5 కోట్ల వ్యాపారాన్ని చేరుకోవాలని లక్ష్యించాం. ఎక్కువ ఆర్డర్లు ముంబై నుంచి వస్తున్నాయి. హైదరాబాద్ వాటా 10-15 శాతం ఉంటుంది. హైదరాబాద్‌లో పార్థా డెంటల్, డెంటిస్ట్, అపోలో వంటి వాటికి దంత వైద్య పరికరాలు, ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాం. మా సంస్థకు రిటర్న్‌లు 2-3% మధ్య ఉంటాయి.
 
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement