హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రాత్రికి రాత్రే మీ ఆఫ్‌లైన్ దుకాణం ఆన్‌లైన్‌లోకి మారిపోవాలంటే? వెబ్‌సైట్ అభివృద్ధి, నిర్వహణ కోసం టెక్నాలజీ సంస్థలతో.. ఉత్పత్తుల సరఫరా కోసం లాజిస్టిక్స్‌తో.. నగదు లావాదేవీల కోసం పేమెంట్ గేట్‌వేలతో ఒప్పందం చేసుకోవాలి. నిజానికిది రాత్రికి రాత్రే జరిగే పనేం కాదు. కానీ షాప్‌మాటిక్‌తో ఒప్పందం చేసుకుంటే చాలు!! జస్ట్.. 15 నిమిషాల్లో మీ ఆఫ్‌లైన్ స్టోర్ కాస్త ఈ–కామర్స్ స్టోర్‌గా మారిపోతుంది. అంతే! వెబ్‌సైట్ అభివృద్ధి నుంచి మొదలుపెడితే నిర్వహణ, ప్యాకింగ్, లాజిస్టిక్, పేమెంట్ గేట్‌వే అన్ని రకాల సేవలూ ఒకే వేదికగా అందించడమే దీని ప్రత్యేకత.
దీనికయ్యే ఖర్చు 3 నెలలకు రూ.66. ఇదే షాప్‌మాటిక్ సక్సెస్ మంత్రమంటున్నారు హైదరాబాద్‌కు చెందిన అనురాగ్ ఆవుల. మరిన్ని వివరాలు ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారాయన. ‘‘మాది కూకట్‌పల్లి. నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తయ్యాక.. మణిపాల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశా. ఆ తర్వాత స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్, ఎన్‌సీఆర్ కార్పొరేషన్‌లో కొన్నాళ్లు పనిచేశా.
అక్కడి నుంచి ఫిన్‌టెక్ కంపెనీ పేపాల్‌లో సింగపూర్‌లో చేరా. వృత్తిరీత్యా ఈ–కామర్స్ కంపెనీలతో పనిచేయాల్సి ఉండటంతో మన దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలు (ఎంఎస్‌ఎంఈ), ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ–కామర్స్ వ్యాపారం ప్రారంభించేందుకు ఎంత వ్యయ ప్రయాసలు పడుతున్నారో తెలిసింది. సులువుగా, అందుబాటు ధరలో దీనికి పరిష్కారం చూపాలని నిర్ణయించుకొని పేపాల్‌లోని మరో ఇద్దరు సహోద్యోగులు క్రిస్ చెన్, యెన్‌లీతో కలిసి రూ.2 కోట్ల పెట్టుబడితో 2015 అక్టోబర్‌లో బెంగళూరు కేంద్రంగా షాప్‌మాటిక్.కామ్‌ను ప్రారంభించాం.
15 నిమిషాల్లో ఈ–కామర్స్ స్టోర్..
ప్రస్తుతం 60కి పైగా ఉచిత స్టోర్ డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. షాప్‌మాటిక్‌తో ఒప్పందమైన 15 నిమిషాల్లో ఆన్‌లైన్ వ్యాపారం ప్రారంభించవచ్చు. ఈ–కామర్స్ నిర్వహణ సేవలతో పాటూ ప్రమోషన్స్, ఆఫర్లు, డిస్కౌంట్లు, ఉత్పత్తుల రికమండేషన్స్ అన్ని ఉచితంగా పొందవచ్చు.
ప్రస్తుతం షాప్‌మాటిక్‌కు 1.5 లక్షల మంది కస్టమర్లున్నారు. వీరిలో 45 శాతం కస్టమర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల వారే. అత్యధిక కస్టమర్లు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఉన్నారు. ఏపీ, తెలంగాణ వాటా 13 శాతం వరకూ ఉంటుంది. 3, 6, 12 నెలల వారీగా సబ్‌స్క్రిప్షన్స్ ఉంటాయి. 3 నెలలకు రూ.66.
నెల రోజుల్లో యూఈఏకి విస్తరణ..
ప్రస్తుతం మన దేశంతో పాటూ సింగపూర్, తైవాన్, హాంకాంగ్ దేశాల్లో సేవలందిస్తున్నాం. నెల రోజుల్లో యూఏఈకి విస్తరించనున్నాం. ఈ ఏడాది ముగిసేలోగా ఇండోనేషియా, ఫిలిప్పిన్స్ దేశాలకు విస్తరించాలని, వచ్చే ఏడాది కాలంలో కస్టమర్ల సంఖ్యను 3 లక్షలకు చేర్చాలని లకి‡్ష్యంచాం. ఉత్పత్తుల డెలివరీ కోసం డెల్హివరీ, ఫెడెక్స్, డీహెచ్‌ఎల్ వంటి అన్ని కొరియర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం.
రూ.70 కోట్ల నిధుల సమీకరణ..
ఏటా 310 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 70 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి మరో 25 మందిని నియమించుకోనున్నాం. గతేడాది ఏసీపీ వెంచర్స్, స్ప్రింగ్స్ సీడ్ క్యాపిటల్ సంస్థలు రూ.25 కోట్ల పెట్టుబడి పెట్టాయి. మరో 2 నెలల్లో రూ.70 కోట్ల నిధులను సమీకరించనున్నాం. ఈ రౌండ్‌లో పాత ఇన్వెస్టర్లతో పాటూ కొత్తవాళ్లూ ఉంటారు’’ అని అనురాగ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment