పట్టుదల, ఏకాగ్రత విజయానికి మూలసూత్రాలని చెబుతారు. వీటిని ఆశ్రయించినవారు ఏ రంగంలోనైనా రాణిస్తారని అంటారు. పట్టుదలతో చదివి విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారిని మనం చూసేవుంటాం. అలాంటి వారిలో ఒకరే అనురాగ్ గౌతమ్.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) తాజాగా ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్) పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన అనురాగ్ గౌతమ్ ఐఈఎస్ ఫలితాల్లో దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించాడు. ఆల్ ఇండియా ర్యాంక్ వన్ (ఏఐఆర్ 1) సాధించి, అనురాగ్ అందరి అభినందనలు అందుకుంటున్నాడు.
అనురాగ్ గౌతమ్ బొకారో డీపీఎస్ స్కూలులో చదువుకున్నాడు. అతని తండ్రి అనుపమ్ కుమార్ బొకారో స్టీల్ ప్లాంట్‌లో అధికారి. అతని తల్లి కుమారి సంగీత గృహిణి. చిన్నతనం నుంచే అనురాగ్‌కు చదువుపై అమితమైన ఆసక్తి ఉంది. పాఠశాల విద్య పూర్తిచేసిన అనురాగ్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.
తన కుమారుడు ఎన్‌టీఎస్‌ఈ, కేవీపీవై తదితర పరీక్షలలో విజయం సాధించాడని అనురాగ్ తండ్రి అనుపమ్ కుమార్ తెలిపారు. అయితే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్) అధికారి కావడం అనురాగ్ కల అని, తొలి ప్రయత్నంలో విఫలమైనా ధైర్యం కోల్పోకుండా, రాత్రి పగలు కష్టపడి ఎట్టకేలకు ఈ పరీక్షలో విజయం సాధించాడన్నారు. రెండవ ప్రయత్నంలో దేశం మొత్తం మీద అగ్రస్థానంలో నిలిచి అనురాగ్ తన కలను నెరవేర్చుకున్నాడన్నారు.
అనురాగ్ సాధించిన విజయం గురించి తెలుసుకున్న డీపీఎస్ బొకారో ప్రిన్సిపాల్ డాక్టర్ గంగ్వార్ కూడా అనురాగ్‌ను అభినందించారు. ఈ విజయం అతని కుటుంబానికే కాకుండా, రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఎవరైనా అంకితభావంతో పనిచేస్తూ, లక్ష్యం దిశగా పయనించినప్పుడు ఏ సవాలూ పెద్దది కాదనేందుకు ఈ విజయం ఉదాహరణగా నిలుస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: అతనిది హర్యానా.. ఆమెది ఫ్రాన్స్.. ప్రేమ కలిపిందిలా..
Comments
Please login to add a commentAdd a comment