హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పుట్టిన రోజు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక సందర్భాలు కావచ్చు... హాలిడే ట్రిప్స్, బ్యాచ్‌లర్, వీకెండ్ పార్టీలు కావచ్చు.. ఈవెంట్ ఏదైనా సరే అరేంజ్‌మెంట్స్ చేయడం పెద్ద పని. పోనీ, ఏ హోటల్‌లోనో కానిచ్చేద్దామంటే బడ్జెట్ భారమవుతుంది. పార్టీకయ్యే ఖర్చుకంటే ఏర్పాట్ల ఖర్చే తడిసిమోపెడవుతుంది.
అలాకాకుండా కారు అద్దెకు తీసుకున్నట్టు పార్టీకి అవసరమైన ఉత్పత్తులనూ అద్దెకు తీసుకుంటే? ఇదే వ్యాపార సూత్రంగా మలచుకుంది బెంగళూరుకు చెందిన రెంట్‌షేర్. మన దేశంతో పాటూ దుబాయ్, షార్జా, అబుదాబిల్లోనూ తక్కువ ఖర్చుతో పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మరిన్ని వివరాలు రెంట్‌షేర్ ఫౌండర్ అండ్ సీఈఓ హార్ష్ దండ్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు.
‘‘ఐఐటీ ఢిల్లీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేశాక.. ఐబీఎం రీసెర్చ్‌లో ఉద్యోగంలో చేరా. కొత్త కంపెనీ ప్రారంభించాలనే ఆలోచనతో 2008లో ఆక్స్‌వర్డ్ వర్సిటీ నుంచి ఎంబీఏ చేశా. అక్కడ చూసిన రెంటింగ్ ట్రెండ్ మన దేశంలోనూ ప్రారంభించాలని నిర్ణయించుకొని 2015 అక్టోబర్లో బెంగళూరు కేంద్రంగా రెంట్‌షేర్ స్టార్టప్‌ను ప్రారంభించా. ఆఫ్‌లైన్‌లో దొరికే ప్రతి వస్తువూ ఆన్‌లైన్‌లో అద్దెకివ్వాలన్నదే రెంట్‌షేర్ లక్ష్యం.
40 కేటగిరీలు.. 12 వేల ఉత్పత్తులు..
ప్రొజెక్టర్స్, ఎల్‌ఈడీ స్క్రీన్స్, స్పీకర్స్, బార్బిక్యూ గ్రిల్స్, హుక్కా సెట్స్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మెడికల్ ఉత్పత్తులు ఇలా 40 కేటగిరీల్లో సుమారు 12 వేల ఉత్పత్తులున్నాయి. వీటిని గంటలు, రోజులు, వారం లెక్కన అద్దెకు తీసుకోవచ్చు. కనీస ఆర్డర్ విలువ రూ.వెయ్యి. ఉత్పత్తుల డెలివరీ, పికప్ బాధ్యత వెండర్‌దే.
ఉత్పత్తుల అద్దె కోసం స్థానికంగా ఉండే వెండర్లతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం 600 మంది వెండర్లున్నారు. హైదరాబాద్ నుంచి 55 మంది ఉన్నారు. ఐపీఎల్, ఫీఫా వరల్డ్ కప్ సమయంలో ఎల్‌ఈడీ వాల్స్‌కు, స్పీకర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కర్ణాటక ఎలక్షన్ సమయంలో ఎల్‌ఈడీ వాల్స్ అద్దెకు తీసుకున్నారు. దీని ధర రోజుకు రూ.11 వేలు.
హాబీస్, ట్రావెల్స్‌లోకి విస్తరణ..
ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాలతో పాటూ దుబాయ్, అబుదాబి, షార్జాలల్లో సేవలందిస్తున్నాం. వీకెండ్స్, సమ్మర్ పార్టీలు, పెళ్లి, బర్త్‌డే పార్టీలు దుబాయ్‌లో ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే విదేశాల్లో మొదటగా దుబాయ్‌లో ప్రారంభించాం. వచ్చే నెలాఖరు నాటికి పుణే, కోచి, చండీగఢ్ నగరాలకు విస్తరించనున్నాం.
ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో వంద మంది వెండర్లతో ఒప్పందం చేసుకున్నాం. రెండు వారాల్లో హాబీస్, ట్రావెల్ విభాగంలోకి విస్తరించనున్నాం. అంటే డ్రోన్ కెమెరాలు, ఐస్ బాక్స్‌లు, డిస్కో లైట్లు, స్నో మిషన్స్, బీన్ బ్యాగ్స్ వంటి ఉత్పత్తులను అద్దెకిస్తాం.
హైదరాబాద్ వాటా 20 శాతం...
ప్రస్తుతం నెలకు 10 వేల ఉత్పత్తుల అద్దె ఆర్డర్లు వస్తున్నాయి. ఇందులో ఈవెంట్స్, పార్టీ ఉత్పత్తుల అద్దెలే 40% వరకుంటాయి. హైదరాబాద్ నుంచి నెలకు 1,200 ఉత్పత్తులు అద్దెకు తీసుకుంటున్నారు. గత రెండేళ్లలో 60 వేల మంది కస్టమర్లు మా సేవలను వినియోగించుకున్నారు.
సుమారు 10 లక్షల ఉత్పత్తులను అద్దెకు అందించాం. మెడికల్ కేటగిరీలో వీల్ చెయిర్స్, ఆక్సిజన్ కిట్స్ వంటి వాటికి గిరాకీ పెరుగుతోంది. ప్రస్తుతం ఏటా రూ. 20 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. మా మొత్తం వ్యాపారంలో హైదరాబాద్ వాటా 20% వరకూ ఉంది.
రూ.30 కోట్ల సమీకరణ..
ప్రస్తుతం కంపెనీలో 20 మంది ఉద్యోగులున్నారు. నెలాఖరు నాటికి టెక్నికల్ టీమ్‌లో మరో ఐదుగురిని తీసుకోనున్నాం. వచ్చే ఏడాది ముగింపు నాటికి 2 వేల మంది వెండర్లకు, రూ.60 కోట్ల ఆదాయానికి చేరుకోవాలని లకి‡్ష్యంచాం. ఇప్పటివరకు రూ.10 కోట్లు సమీకరించాం. ఐఐటీ–ఢిల్లీ, ఆక్స్‌వర్డ్ స్నేహితులతో పాటు దుబాయ్‌కు చెందిన ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది ముగింపులోగా మరో రూ.30 కోట్ల నిధులను సమీకరించనున్నాం. సౌదీకి చెందిన పలువురు ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment