
అట్టపెట్టెలో ప్రీ స్కూల్ చదువు
♦ ఫ్లింటూ బాక్స్‌లో 2–12 ఏళ్ల పిల్లల విద్యా కార్యకలాపాలు
♦ నెలకు 30 వేల బాక్స్‌ల డెలివరీ; రూ.13 కోట్ల ఆదాయం
♦ ఈ ఏడాదిలో రూ.30 కోట్ల నిధుల సమీకరణ పూర్తి
♦ ‘స్టార్టప్ డైరీ’తో ఫ్లింటూ బాక్స్ ఫౌండర్ అరుణ్‌ప్రసాద్ దురైరాజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్కూళ్లు మొదలయ్యాయి. పిల్లలు, తల్లిదండ్రులూ ఎవరికి వారు బిజీ. బుడిబుడి అడుగులతో తొలిసారిగా ప్లే స్కూల్‌లోకి అడుగుపెట్టే చిన్నారులతో సందడే సందడి. మరి, ఆ చదువులు, ఆటలూ అట్టపెట్టెలో లభ్యమైపోతే? స్కూల్‌లోనే కాదు కావాలంటే ఇంటి దగ్గరే నేర్చేసుకునే వీలుంటే? అర్థం కాలేదు కదూ!! ఏం లేదండీ.. ఫ్లింటూ బాక్స్ స్టార్టప్ చెన్నై కేంద్రంగా ఫ్లింటూ బాక్స్, ఫ్లింటూ స్కూల్ పేరిట ప్లే స్కూల్ సేవలందిస్తోంది. 2–12 ఏళ్ల వయసు పిల్లల మానసిక, మేధో అభివృద్ధి విద్యా కార్యకలాపాలను అట్టపెట్టెల్లో అందించడం దీని ప్రత్యేకత. దీనికి సంబంధించిన వివరాల్ని సంస్థ ఫౌండర్ అరుణ్‌ప్రసాద్ దురైరాజ్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు.
అవి...
పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన ప్లే స్కూల్స్ కాసింత వెనకబడే ఉంటాయి. కారణం సరైన విద్యా ప్రణాళికలు లేకపోవటం. ప్లే స్కూల్ అనగానే 4–5 గంటల తతంగం అని తేలిగ్గా తీసుకుంటారు. కానీ, నిజానికి 6–7 ఏళ్లలోపు పిల్లల్లో మానసిక అభివృద్ధి వేగంగా ఉంటుంది. ఈ వయసు పిల్లల్లో విషయ సంగ్రహణ కాసింత ఎక్కువే. కానీ ప్లే స్కూల్ విద్య అందుకు తగ్గట్టుగా ఉండటంలేదు. దీనికి పరిష్కారమే మా ఫ్లింటూ బాక్స్. నేను, విజయ్‌బాబు గాంధీ, శ్రీనిధి సింగారం ముగ్గురు కలిసి రూ.10 లక్షల పెట్టుబడితో 2013 సెప్టెంబర్‌లో చెన్నై కేంద్రంగా దీన్ని ప్రారంభించాం.
ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌తో ఒప్పందం..
ఫ్లింటూ బాక్స్‌లో పిల్లల్లో మానసిక అభివృద్ధిని పెంపొందించేలా బొమ్మల రూపంలో విద్యా కార్యకలాపాలుంటాయి. వీటిని పిల్లలు గుర్తిస్తూ చదవటం, రాయటం, అన్వేషించడం చేస్తారు. దీనివల్ల మానసిక వృద్ధితో పాటు నైపుణ్యాలు, సృజనాత్మకత బయటపడతాయి. ఫ్లింటూ విద్యా కార్యకలాపాల డిజైన్, పరిశోధన మరియు అభివృద్ధి కోసం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌తో ఒప్పందం చేసుకున్నాం. నమూనాల రూపకల్పన, తయారీ, ప్యాకింగ్, డెలివరీ కోసం చెన్నైలో సొంత అసెంబ్లింగ్ ప్లాంట్ పెట్టాం. 300 మంది విక్రయదారులతోనూ ఒప్పందాలు చేసుకున్నాం.
2 రకాల వ్యాపార విభాగాలు..
ప్రస్తుతం ఫ్లింటూ బాక్స్, ఫ్లింటూ క్లాస్ రెండు రకాల వ్యాపార విభాగాలున్నాయి. ఫ్లింటూ బాక్స్ హోమ్ టీచింగ్, ఫ్లింటూ క్లాస్ ప్రీ స్కూల్స్ కోసం.
ఫ్లింటూ క్లాస్ సేవలు: ఫ్లింటూ క్లాస్ 2 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకు సంబంధించిన సమగ్ర విద్యా కార్యకలాపాల వేదిక. ఫ్లింటూ క్లాస్ బాక్స్‌లో పరిశోధన ఆధారిత పూర్వ అభ్యాస పాఠ్య ప్రణాళికలు, రోజు వారీ పాఠ్య ప్రణాళికలు, ఆన్‌లైన్ ఉపాధ్యాయ శిక్షణ, తల్లిదండ్రుల కమ్యూనికేషన్ వంటివి ఉంటాయి. ఒక్కో బాక్స్‌లో 20 రోజుల విద్యా కార్యకలాపాలుంటాయి. నెలకు ఒక్కో విద్యార్థికి రూ.500 చార్జీ. ప్రస్తుతం 150 ప్రీ స్కూల్స్ మా ఉత్పత్తులను వినియోగిస్తున్నాయి. ఇందులో 60 శాతం ప్రీ స్కూల్స్ ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభమైనవే. తమిళనాడు, బెంగళూరు, ఢిల్లీ నుంచి ఎక్కువ ప్రీ స్కూల్స్ ఉన్నాయిందులో.
ఫ్లింటూ బాక్స్ సేవలు: ఇందులో 12 ఏళ్ల లోపు వయసు వాళ్లు ఇంటి దగ్గరే నేర్చుకునేలా వ్యక్తిగత శిక్షణ ఉత్పత్తులుంటాయి. ప్రతి బాక్స్‌లో 4–5 ప్లే ఆధారిత కార్యకలాపాలు. అవి కూడా పిల్లల సృజనాత్మకతను వెలికితీసేలా ఉంటాయి. ఒక్కో నెలా ఒక్కో థీమ్‌తో రూపొందిస్తాం. ప్రతి బాక్స్‌లో 15 రోజుల కార్యకలాపాలుంటాయి. నెలకు ఒక్కో విద్యార్థికి రూ.650 చార్జీ. ప్రస్తుతం ఫ్లింటూ బాక్స్‌కు 500 నగరాల్లో 3 లక్షల మంది విద్యార్థులు కస్టమర్లుగా ఉన్నారు. ప్రస్తుతం నెలకు 30 వేల బాక్స్‌ల ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాం.
సింగపూర్, దుబాయ్‌లకు విస్తరణ..
ఇప్పటివరకు ఫ్లింటూ సేవలన్నీ కూడా వెబ్‌సైట్, యాప్ ద్వారానే అందుతున్నాయి. త్వరలోనే ఆఫ్‌లైన్‌లో ఓ స్టోర్‌ను తెరవనున్నాం. మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో రూ.13 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. 2017–18లో రూ.40 కోట్ల ఆదాయం లకి‡్ష్యంచాం. మా ఆదాయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటా 10 శాతం. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో దుబాయ్, సింగపూర్ దేశాలకు విస్తరించనున్నాం. ప్రస్తుతం ఆయా దేశాల్లో డిస్ట్రిబ్యూటర్‌తో ఒప్పందం చేసుకొని వ్యాపారం నిర్వహిస్తున్నాం.
ప్రస్తుతం 150 మంది ఉద్యోగులున్నారు. త్వరలో బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో కార్యాలయాలు ప్రారంభిస్తాం. మరికొంత మంది ఉద్యోగులను తీసుకుంటాం. ఇప్పటివరకు రూ.10 కోట్ల నిధులను సమీకరించాం. ఈ ఏడాది చివరిలోగా మరో రూ.30 కోట్ల నిధులను సమీకరిస్తాం.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్ చేయండి...