ఇంటి రిపేర్లకూ ఆన్లైనే!
• ప్లంబింగ్ నుంచి ఇంటీరియర్ డిజైనర్ వరకూ..
• 2 నెలల్లో బెంగళూరు, చెన్నైలకు విస్తరణ
• ఈ ఏడాది ముగింపులోగా రూ.5 కోట్ల నిధుల సమీకరణ
• ‘స్టార్టప్ డైరీ’తో వే2 నిర్మాణ్ ఫౌండర్ సీతారామరాజు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇంట్లోని నల్లా రిపేరుకొస్తుంది.. ప్లంబర్ ఎక్కడుంటాడో తెలియదు! పండగొస్తుంది.. ఇంటికి పెయింటింగ్ వేయించాలి.. కానీ, పెయింటర్‌ను ఎలా సంప్రతించాలో అర్థం కాదు!!
⇒ ఇవే కాదు కార్పెంటర్, ఎలక్ట్రీషియన్.. ఇలా ఇంటికి సంబంధించిన ప్రతి పనికీ ఎక్కడికెళ్లాలో అర్థం కాదు. మార్కెట్లోకెళితే.. మనకవసరమైన పనులు కాబట్టి.. వారు ఎంత చెబితే అంతే ఇవ్వాలి. లేకపోతే రారు.. చేయరు!!
⇒ ఇదిగో సరిగ్గా ఇలాంటి అనుభవమే సివిల్ ఇంజనీరు సీతారామరాజుకూ ఎదురైంది. చిన్న పనికి జేబులోని రూ.500 వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడే అనిపించింది. ఇలాంటి చిన్న చిన్న రిపేర్లకూ జేబుగుల్ల చేసుకునే బదులు ఈ రంగానికి టెక్నాలజీని జోడించి.. వ్యవస్థీకృతం చేస్తే ఎలా ఉంటుందని!! ఇంకేముంది గతేడాది మేలో హైదరాబాద్ కేంద్రంగా వే2నిర్మాణ్.కామ్ ప్రారంభమైంది.
⇒ ఎలక్ట్రికల్, ప్లంబింగ్, కార్పెంటర్, మేస్త్రీ, పెయింటర్, ఇంటీరియర్ డిజైన్, ఎలివేషన్స్, ప్లాన్స్ వంటి ఇంటికి సంబంధించిన 10 రకాల సేవలందిస్తున్నాం. ఇందులో ఇంటీరియర్, ప్లాన్స్ సేవలు దేశవ్యాప్తంగా అందిస్తుంటే.. మిగతావి హైదరాబాద్‌కే పరిమితమయ్యాం. 2 నెలల్లో బెంగళూరు, చెన్నై నగరాల్లో సేవలు ఆరంభమవుతున్నాయి.
⇒ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, మార్కెటింగ్, ఉద్యోగుల నియామకం కోసం రూ.40 లక్షల వరకు ఖర్చయింది. ప్రస్తుతం మా సంస్థలో 20 మంది ఉద్యోగులు, ఐదుగురు ఐటీ నిపుణులున్నారు. వృత్తి నిపుణుల వివరాలను పూర్తిగా వెరిఫై చేశాకే నియమించుకుంటాం. వారితో అగ్రిమెంటు చేసుకుంటాం కాబట్టి సెక్యూరిటీ, నమ్మకమైన సర్వీసు పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
⇒ సర్వీసు విషయంలో సామాన్య, ఎగువ తరగతులనే తేడా లేదు. ఎవరికైనా ఒకటే ధర. చేసిన పనికి మాత్రమే చార్జీ. కనిష్ట ధర రూ.100. ప్రస్తుతం రోజుకు 60-80 కాల్స్ వస్తున్నాయి. వీటిలో ఎక్కువగా మేస్త్రీ, ప్లంబింగ్, పెయింటింగ్ ఆర్డర్స్ ఉంటున్నాయి.
⇒ నెలకు రూ.10 లక్షల వ్యాపారం జరుగుతోంది. ఇందులో ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ ఖర్చులు పోగా.. రూ.2 లక్షల వరకు ఆదాయంగా మిగులుతోంది. తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టిపెట్టాం. ఈ ఏడాది రూ.5 కోట్ల నిధుల సమీకరిస్తాం. వారంరోజుల్లో ఆండ్రాయిడ్ యాప్‌ను తెస్తున్నాం.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...