కలుగొట్ల వాగులో బోటు ద్వారా గాలింపు చర్యలు
సాక్షి, ఉండవెల్లి (అలంపూర్): కలుగొట్ల వాగులో శనివారం తెల్లవారుజామున గల్లంతైన గర్భిణి నాగసింధూరెడ్డి (28) ఆచూకీ దొరకలేదు. ఆదివారం ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్ అక్కడికి చేరుకొని వాగు శివారు ప్రాంతాల్లో గాలింపు చర్యలను పరిశీలించారు. వాగులో అడ్డుగా ఉన్న ముళ్లపొదలు.. కలుగొట్ల, పుల్లూరు పరిసరాల్లో వెతకసాగారు. గల్లంతైన ప్రాంతం నుంచి తుంగభద్ర నది 500మీటర్ల దూరం ఉండడంతో నది తీర ప్రాంతాలకు పోలీసులు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ వెంకట్రామయ్య తెలిపారు. యువతి కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. సాయంత్రం వరకు ఆచూకీ తెలియకపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులతోపాటు సర్పంచ్ హుర్రున్నిసా, తేజ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల ప్రజలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్పీ ఆదేశాలనుసారం సోమవారం లైఫ్ బోట్లను తీసుకొచ్చి గాలింపు చేయనున్నట్లు సీఐ పేర్కొన్నారు.
నదీ తీరంలో గాలింపు చర్యలను పరిశీలిస్తున్న ఎస్పీ రంజన్‌రతన్, అధికారులు
హైదరాబాద్ వెళ్తుండగా.. ఘటన
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన భార్యభర్తలు నాగసింధూరెడ్డి, శివశంకర్‌రెడ్డితోపాటు వారి స్నేహితుడు జిలానీబాషా కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. కలుగొట్ల వాగులో వీరు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. మిగతా ఇద్దరు బయటపడగా.. సదరు మహిళ గల్లంతైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment