
సాక్షి, మహబూబ్‌నగర్: మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఆస్తుల కోసం తోడబుట్టిన వారిపైనే దాడులు చేసుకుంటూ హతమార్చుకుంటున్నారు. డబ్బు మోజులో పడి పేగు బంధాలను తెంచేసుకుంటున్నారు.
తాజాగా కాసుల కోసం కక్కుర్తిపడి కన్నబిడ్డలను కిడ్నాప్ చేసి బేరానికి పెట్టాడో తండ్రి. భార్య ఫిర్యాదు, పోలీసుల అప్రమత్తతో అడ్డంగా బుక్కయ్యాడు. ఆ అమానుష ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో వెలుగుచూసింది.
పట్టణంలోని గౌరీ శంకర్ కాలనీలో నివాసం ఉండే రఫీ తన ముగ్గురు కూతుళ్లను మాయ మాటలు చెప్పి కారులో హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి పిల్లలను కిడ్నాప్ చేశానని తనకు డబ్బు కావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆమె వెంటనే జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే స్పందించి రఫీ ఫోన్‌ను ట్రాక్ చేశారు.
హైదరాబాదులోని యాకత్‌పురాలో అతని లోకేషన్ కనిపించగా.. వెంటనే పోలీసుల బృందం అక్కడికి చేరుకుంది. ఓ కారులో నిర్బంధించి ఉన్న పిల్లలను.. పోలీసులు రక్షించారు. అయితే రూ. 9 లక్షలకు పిల్లల్ని బేరం కుదుర్చుకున్నాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా పోలీసుల అప్రమత్తతో కథ సుఖాంతం అయ్యింది. పిల్లలను విక్రయించాలనుకున్న తండ్రికి బంధువులు కాలనీవాసులు దేహ శుద్ధి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment