
ఎఫ్‌ఐబీ నూతన డైరెక్టర్ కాశ్ పటేల్ హెచ్చరిక
పటేల్ నామినేషన్‌కు 51–49 ఓట్ల తేడాతో సెనేట్ ఆమోదం
బాలీవుడ్ స్టైల్లో స్వాగతం పలికిన వైట్‌హౌస్
వాషింగ్టన్: అమెరికన్లకు హాని చేయాలనుకునేవారి అంతు చూస్తామని, వారు భూమ్మీద ఏ మూల దాక్కున్నా వదలబోమని ఎఫ్‌బీఐ నూతన డైరెక్టర్ కశ్యప్ పటేల్ (కాశ్ పటేల్) హెచ్చరించారు. అమెరికా ప్రజలు గర్వించదగ్గ సంస్థగా ఎఫ్‌బీఐని పునర్నిర్మిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిరకాల మిత్రుడైన కాశ్ పటేల్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా సెనేట్ గురువారం ధ్రువీకరించింది. అనంతరం పటేల్... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అటార్నీ జనరల్ పామ్ బోండీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీని పారదర్శకంగా, జవాబుదారీగా, న్యాయానికి కట్టుబడినదిగా పునర్నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
‘‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తొమ్మిదో డైరెక్టర్‌గా నన్ను ధ్రువీకరించడం గౌరవంగా భావిస్తున్నా. అచంచల విశ్వాసం, మద్దతు ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్, అటార్నీ జనరల్ బోండీకి ధన్యవాదాలు. ‘జీ–మెన్’ నుంచి 9/11 దాడుల నేపథ్యంలో దేశాన్ని కాపాడటం వరకు ఎఫ్‌బీఐకి ఘనమైన వారసత్వం ఉంది. పారదర్శకంగా, జవాబుదారీతనంతో, న్యా యానికి కట్టుబడి ఉండే ఎఫ్‌బీఐకి అమెరికా ప్రజలు అర్హులు. రాజకీయ జోక్యంతో న్యాయ వ్యవస్థ ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. ఈ రోజుతో అది ముగుస్తుంది’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
బాలీవుడ్ స్టైల్లో స్వాగతం..
ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్‌ను శ్వేతసౌధం స్వాగతించింది. వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో కాశ్‌కు బాలీవుడ్‌స్టైల్‌లో స్వాగతం పలికారు. నటుడు రణ్‌వీర్ సింగ్ నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రంలోని ‘మల్హరి’ పాటను ఎడిట్ చేసి.. రణవీర్ స్థానంలో పటేల్ ముఖాన్ని ఉంచిన వీడియోను షేర్ చేశారు. ‘‘ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్ కాశ్ పటేల్‌కు అభినందనలు’’ అని స్కావినో ట్వీట్ చేశారు. 47 సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్‌ను వెంటనే 30 లక్షల మందికి పైగా చూశారు.
డెమొక్రాట్ల నుంచి వ్యతిరేకత..
పటేల్ నామినేషన్ రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో ఆమోదానికి వారం రోజులు ఆలస్యమైంది. ఈ పదవికి ఆయన అనర్హుడంటూ డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేశారు. కుట్ర సిద్ధాంతాలతో ఆయన అనుబంధం, రాజకీయ శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ గతంలో ఆయన ప్రకటనలు చేశారని, ట్రంప్ ఎఫ్‌బీఐ ప్రతీకార ప్రణాళికల సమాచారాన్ని దాచిపెట్టారని, పటేల్‌ను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని డెమొక్రాట్ సెనేటర్లు ఆరోపించారు.
పటేల్ అమెరికన్ల ప్రయోజనాల పరిరక్షణకు కాకుండా.. ట్రంప్ ప్రయోజనాల కోసం పని చేస్తా రని మండిపడ్డారు. అయితే సెనేట్‌లో రిప బ్లికన్లకు మెజారిటీ ఉండటం తెలిసిందే. అలాస్కాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్లు లీసా ముర్కోవ్‌స్కీ, మైనేకు చెందిన సుసాన్ కొలిన్స్ నుంచి వ్యతిరేకత ఎదురైంది. అయితే.. గతంలో ఇతర ట్రంప్ నామినీలను వ్యతి రేకించిన సెనేట్ మైనారిటీ నాయకుడు మిచ్ మెక్కా నెల్‌తో సహా మిగిలిన రిపబ్లికన్ పార్టీ మొత్తం పటేల్‌కు మద్దతు లభించింది. దీంతో.. సెనేట్ డెమొ క్రాట్లందరూ కాశ్‌కు వ్యతిరేకంగా ఓటు వేసి నా.. 51–49 ఓట్ల స్వల్ప తేడాతో ఆయన నామినేషన్ ఆమోదం పొందింది.
భారతీయ నేపథ్యం..
కాశ్ పటేల్ తల్లిదండ్రులు గుజరాతీలు. యూఎస్‌లో స్థిరపడ్డారు. 1980లో న్యూయార్క్‌లో జన్మించిన పటేల్.. తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. లాంగ్ ఐలాండ్‌లోని గార్డెన్ సిటీ హైస్కూల్ నుంచి పట్టభద్రుడయ్యారు. రిచ్మండ్ విశ్వ విద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేశారు. యూకేలోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఫ్యాకల్టీ ఆఫ్ లాస్ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ అందుకున్నారు. అంతర్జాతీయ చట్టంలో సర్టిఫికెట్ కోసం న్యూ యార్క్‌కు తిరిగి వచ్చారు. ఆ తరువాత జాతీయ భద్రతా సలహాదారుగా, హౌస్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్ (హెచ్‌పీఎస్సీఐ)కి సీనియర్ కౌన్సెల్‌గా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment