USA:ట్రక్కు దాడి.. ఎఫ్బీఐ కీలక ప్రకటన
వాషింగ్టన్:న్యూ ఓర్లీన్స్ ట్రక్కు దాడిలో విదేశీ శక్తుల కుట్ర లేదని అమెరికా అత్యున్నత దర్యాప్తు ఏజెన్సీ ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) తేల్చింది. దాడికి పాల్పడ్డ జబ్బార్ ఒంటరిగానే ఈ దుశ్చర్యకు ఒడిగట్టాడని తెలిపింది. దాడికి ముందు జబ్బార్ ఫేస్బుక్లో ఐదు వీడియోలు పోస్ట్ చేసినట్లు పేర్కొంది.దాడి దర్యాప్తు పురోగతిని అధ్యక్షుడు బైడెన్కు ఎఫ్బీఐ వివరించింది. సుమారు గంట సేపు అధికారులతో చర్చించి దర్యాప్తు వివరాలను బైడెన్ తెలుసుకున్నారు. దాడిపై స్వదేశీ,విదేశీ కుట్ర కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని వైట్హౌజ్ వర్గాలు తెలిపాయి. ఈ దాడి కోసం జబ్బార్ విదేశీ సంస్థలతో కలిసి పనిచేయలేదు. అయితే అతను ఐసిస్ నుంచి స్ఫూర్తి పొందాడు. ఇది వంద శాతం ఉగ్రవాద చర్యనే’అని ఎఫ్బీఐ కౌంటర్ టెర్రరిజం విభాగానికి చెందిన అధికారి క్రిస్టఫర్ తెలిపారు. ఐసిస్ మళ్లీ పుంజుకోకుండా సిరియాలోని అమెరికా బలగాలు ఉగ్రవాద సంస్థ నేతలపై వైమానిక దాడులు నిర్వహిస్తున్నాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. నూతన ఏడాది వేడుకల వేళ న్యూఓర్లీన్స్లో అమెరికా ఆర్మీ మాజీ ఉద్యోగి జబ్బార్ పికప్ ట్రక్కుతో జనంపైకి దూసుకొచ్చిన ఘటనలో 15 మంది మరణించిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసుల కాల్పుల్లో జబ్బర్ మృతి చెందాడు.