ఒకప్పుడు సైన్స్ ఇమాజినరీ నవలలు, సినిమాలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నేడు దాదాపు అందరి జీవితాల్లో అంతర్భాగమైంది. ఈ సాంకేతికత ద్వారా ఎన్నో సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ, ప్రజల వ్యక్తిగత భద్రత పరిస్థితి ఏమిటి.. ఏఐ తెలివిమీరితే మన భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అచ్చు మనిషిలాగే ఆలోచించి భేదాలు సృష్టిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచోసుకుంటాయోననే అభిప్రాయాలు వస్తున్నాయి.
తాజాగా కృత్రిమ మేధ మనుషుల మధ్య భేదాలు గుర్తిస్తూ విచిత్రంగా స్పందించినట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. లింగ వివక్ష అనేది మనుషుల్లోనే కాదు కృత్రిమ మేధ (ఏఐ)లోనూ ఉందని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అది అందించే సమాచారం, చిత్రాల్లో ఈ పోకడ కనిపిస్తోందని వారు పేర్కొన్నారు. మంచి, చెడు నాయకుడి లక్షణాలకు సంబంధించి ఏఐ అందించిన కంటెంట్‌ను విశ్లేషించినప్పుడు పురుషులను బలమైన, సమర్థ నేతలుగా అది చిత్రీకరిస్తున్నట్లు తేలింది. భావోద్వేగాలతో నిండిపోయిన, అంతగా సమర్థతలేనివారిగా మహిళలను వర్ణిస్తున్నట్లు వెల్లడైంది.
ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో మానవ యంత్రాలు..?
ఈ నేపథ్యంలో ఏఐ అందించే డేటా హానికర లింగ వివక్షను వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నాయకత్వం గురించి ముందుగా వెలువడిన డేటాలో మహిళా నేతల గురించి ప్రస్తావనే లేదని, వారిని ఉదాహరణలుగా పేర్కొనలేదని ఏఐ పరిశోధనకు నాయకత్వం వహించిన టోబీ న్యూస్టెడ్ పేర్కొన్నారు. నిర్దిష్టంగా మహిళా నాయకుల గురించి అడిగినప్పుడే దానిపై విచిత్రంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. అనేక రంగాల్లో ఏఐ విస్తృతి పెరుగుతున్నందువల్ల వాటిపై మరింత పర్యవేక్షణ ఉండాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment