న్యూస్ రీడర్‌గా, కంపెనీ సీఈఓగా సంచలనం సృష్టించిన 'ఏఐ' (AI) టెక్నాలజీ, ఇప్పుడు ఓ కొత్త అవతారంలో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. సెలబ్రిటీలను సైతం ఫిదా చేస్తూ.. ఆన్‌లైన్ యాడ్స్ చేస్తూ లక్షల డబ్బు సంపాదిస్తున్న దీని గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
25 ఏళ్ల యువతిలా..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్రపంచంలో ఎన్నెన్నో అద్భుతాలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే స్పానిష్ డిజైనర్ 'రూబెన్ క్రూజ్'( Ruben Cruz ), అతని కంపెనీ 'ది క్లూలెస్' కలిసి ఏఐ 'ఐటానా' (Aitana)ను రూపొందించారు. ఇది 25 ఏళ్ల యువతి ఎలా ఉంటుందో.. అలాంటి రూపంతో, ఫిట్ బాడీ కలిగి.. పింక్ స్ట్రెయిట్ హెయిర్‌తో చూడగానే అట్రాక్ట్ చేసే విధంగా ఉంది.
రుబెన్ క్రూజ్ యూరోన్యూస్ ఇంటర్వ్యూలో ఐటానా గురించి మాట్లాడుతూ.. బిజినెస్‌లో వచ్చే అనేక సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ ప్రత్యేకమైన ఏఐ మోడల్‌ను సృష్టించామని, ఇది ప్రస్తుతం మాకు లాభాలను తీసుకురావడంలో చాలా ఉపయోఅగపడుతున్నట్లు వెల్లడించాడు.
మోడల్స్, ఇన్ఫ్లుయెంజర్స్ ఖర్చులు భారీగా పెరిగిపోతున్న సమయంలో ఐటానాను రూపొందించామని, ప్రయోగాలకు, వివిధ లుక్స్‌ని ట్రై చేసేందుకు కాస్త సమయం పట్టింది, కానీ ప్రస్తుతం ఆదాయం లక్షల్లో ఉన్నట్లు ది క్లూలెస్ సంస్థ కో ఫౌండర్ 'డయానా న్యూనెజ్' వెల్లడించింది.
నెలకు రూ.9 లక్షలు
ఐటానాకు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 1,24,000 కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నట్లు సమాచారం. ఈ ఏఐ మోడల్ అనేక కంపెనీలకు మోడల్‌గా వ్యవహరిస్తూ నెలకు సుమారు 3000 యూరోలు (ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 3 లక్షలు) సంపాదిస్తున్నట్లు, కొన్ని సార్లు ప్రకటనలు ఎక్కువ సంఖ్యలో వస్తే.. 10000 యూరోలు (సుమారు రూ. 9 లక్షలు) సంపాదిస్తోందని చెబుతున్నారు.
డేట్‌కు పిలిచిన నటుడు
నిజానికి ఐటానా మనిషి కాదని తెలియని చాలా మంది ఆమెకు మెసేజులు చేస్తూ ఉంటారు. దాదాపు 5 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్న ఒక ప్రముఖ లాటిన్ అమెరికా నటుడు ఏఐ మోడల్ అని తెలియక ఏకంగా డేట్‌కు పిలిచినట్లు సమాచారం. చివరికి అది మనిషి కాదని తెలుసుకుని ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఆదాయమే కాదు అప్పు కూడా లక్షల కోట్లు.. అగ్రగామిగా అంబానీ కంపెనీ!
సెలబ్రిటీలలో మొదలైన భయం
ఏఐ ఐటానా రాక సెలబ్రిటీలలో ఒకింత భయాన్ని రేపింది. ఇప్పటి వరకు ఉద్యోగులను మాత్రమే భయపెడుతున్న ఏఐ.. ప్రస్తుతం సెలబ్రిటీలను కూడా వదిలిపెట్టడం లేదు. ఇలాంటి మోడల్స్ రానున్న రోజుల్లో ఎక్కువైతే.. ఈ రంగంలోని సెలబ్రిటీలకు గండమే అని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment