Bathukamma songs
-
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! అమెరికా బతుకమ్మ ఉయ్యాలో!!
‘‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ... ఏమేమి కాయొప్పునే గౌరమ్మ! తంగేడు పువ్వులో... తంగేడు కాయలో... ఆట చిలుకలు రెండు... పాట చిలుకలు రెండు...’’ ‘‘చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలోన...’’ ‘‘ఇలా ఒకటా... రెండా... లెక్కలేనన్ని బతుకమ్మ పాటలు మా నాలుకల మీద నాట్యమాడుతుంటాయి. గ్రామాల్లో గడిచిన బాల్యం జీవితాన్ని నేర్పుతుంది. తెలంగాణ గ్రామాల్లో బాల్యం బతుకమ్మ పాటల రూపంలో సమాజంలో జీవించడాన్ని నేర్పుతుంది. నిరక్షరాస్యులు కూడా ఈ పాటలను లయబద్ధంగా పాడతారు. బతుకమ్మ పాటల సాహిత్యం వాళ్ల నాలుకల మీద ఒదిగిపోయింది. తమకు తెలిసిన చిన్న చిన్న పదాలతో జీవితాన్ని అల్లేశారు గ్రామీణ మహిళలు. మా నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్. మా అమ్మమ్మ గారి ఊరు జగిత్యాల జిల్లా, వెలుగుమాట్ల. నా చదువు పుట్టపర్తిలో, సెలవులు అమ్మమ్మ ఊరిలో. దసరా సెలవులు వస్తున్నాయంటే సంతోషం అంతా ఇంతా కాదు. దేశమంతా దేవీ నవరాత్రులు జరుపుకుంటూ ఉంటే మేము బతుకమ్మ వేడుకలు చేసుకుంటాం. గౌరమ్మ అందరి మనసుల్లో కొలువుంటుంది, మాట, పాట, ఆట అన్నీ గౌరమ్మ కోసమే అన్నట్లు ఉంటుందీ వేడుక. ఇంత గొప్ప వేడుకకు దూరమయ్యానని అమెరికా వెళ్లిన తర్వాత కానీ తెలియలేదు. అందుకే అమెరికాలో బతుకమ్మను పేర్చాను’’ అన్నారు దీప్తి మామిడి... కాదు, కాదు, బతుకమ్మ దీప్తి. ‘‘నేను 2007లో యూఎస్‌కి వెళ్లాను. న్యూజెర్సీలో ఉండేవాళ్లం. పెళ్లయి, ఒక బిడ్డకు తల్లిని. భర్త, పాప, ప్రొఫెషన్‌తో రోజులు బిజీగా గడిచిపోయేవి. డబ్బు కూడా బాగా కనిపించేది. కొద్ది నెలల్లోనే... ఏదో మిస్సవుతున్నామనే బెంగ మొదలైంది. వ్యాక్యూమ్ ఏమిటనేది స్పష్టంగా తెలియలేదు, కానీ బాల్యం, సెలవుల్లో బతుకమ్మ వేడుక మరీ మరీ గుర్తుకు వస్తుండేది. బతుకమ్మ కోసం ఇండియాకి రావడం కుదరకపోతే నేనున్న చోటే బతుకమ్మ వేడుక చేసుకోవచ్చు కదా! అనిపించింది. అలా అక్కడున్న తెలుగువాళ్లను ఆహ్వానించి బతుకమ్మ వేడుక చేశాను. మొదటి ఏడాది పదిహేను మందికి లోపే... పదేళ్లు దాటేసరికి ఆ నంబరు ఐదారు వందలకు చేరింది. అందరికీ భోజనాలు మా ఇంట్లోనే. ఏటా ఒక పెళ్లి చేసినట్లు ఉండేది. ఇండియా నుంచి తెలంగాణ పిండివంటలను తెప్పించుకోవడం, ఆ రోజు వండుకోవాల్సినవన్నీ మా ఇంట్లోనే వండడం, ఆ వంటల కోసం దినుసులను సేకరించడం, స్నేహితులందరినీ ఆహ్వానించడం, పూలు తెచ్చుకుని ఒక్కొక్కటీ పేర్చడం... ఇలా ప్రతి ఘట్టాన్నీ ఎంజాయ్ చేసేదాన్ని. ‘ఏటా అంతంత ఖర్చు ఎందుకు’ అని స్నేహితులు అనేవాళ్లే కానీ మా వారు ఒక్కసారి కూడా అడగలేదు. నా సంతోషం కోసం చేసుకుంటున్న ఖర్చు అని అర్థం చేసుకునేవారు. ఎప్పుడూ అన్నం ఉంటుంది! యూఎస్‌లో మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడూ అన్నం, కూరలుండేవి. మా కన్సల్టెన్సీకి వచ్చిన వాళ్లు, ముఖ్యంగా బ్యాచిలర్స్ కోసం ఈ ఏర్పాటు. మేము యూఎస్‌లో అడుగుపెట్టిన కొన్నాళ్లకే రెసిషన్ వచ్చింది. అప్పుడు పడిన ఇబ్బందులు నాకిప్పటికీ గుర్తే. అందుకే యూఎస్‌కి వచ్చిన కుర్రాళ్లు మన తెలుగింటి రుచులతో భోజనం చేస్తారు కదా! అనుకునేదాన్ని. షడ్రసోపేతమైన భోజనం అని కాదు కానీ కనీసం పప్పుచారయినా ఉండేది. ఈ అలవాటుకు బీజం పడింది కూడా అమ్మమ్మ దగ్గరే. అమ్మమ్మ పెద్ద పాత్రలో అంబలి చేయించి ఇంటి ముందు పెట్టేది. చాలామంది పొలం పనులకు వెళ్తూ దారిలో మా ఇంటి ముందాగి అంబలి తాగి, ఆవకాయ ముక్క చప్పరించుకుంటూ వెళ్లేవాళ్లు. ఆకలి తీర్చడంలో, అవసరమైన వాళ్లకు సహాయం చేయడంలో ఉండే సంతృప్తి మరి దేనిలోనూ ఉండదు. మా డ్రైవర్ ఇతర పనివాళ్ల పిల్లల చదువు కోసం ఫీజులు కట్టినప్పుడు మరొకరి జీవితానికి మనవంతు సహాయం చేస్తున్నామనే భావన సంతృప్తినిస్తుంది. అవకాశం లేనప్పుడు ఎలాగూ చేయలేం, వెసులుబాటు ఉన్నప్పుడయినా చేసి తీరాలి. మన ఎదుగుదల కోసం సమాజం నుంచి మనం తీసుకుంటాం, మనం ఎదిగిన తరవాత మరొకరి ఎదుగుదల కోసం ఆపన్న హస్తాన్ని అందించి తీరాలనేది పుట్టపర్తి స్కూల్ నేర్పించిన వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. మా అమ్మ ఫ్రెండ్ లీలా ఆంటీ కూడా బతుకమ్మ పండుగను బాగా చేసేవారు. ఆమె ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్. గునుగుపూలు వాటర్బాడీస్ని శుద్ధి చేస్తాయని చెప్తూ ఈ పండుగ వెనుక ఉన్న పర్యావరణ పరిరక్షణను వివరించేవారు. ఇవన్నీ మైండ్‌లో ఒక్కటొక్కటిగా అల్లుకుంటూ ఇలా దండ కూర్చుకున్నాయి. బతుకమ్మ దీప్తినయ్యాను! యూఎస్ జీవితం నాకు చాలా నేర్పించిందనే చెప్పాలి. అక్కడ అన్నీ ఉంటాయి కానీ ఏదో లేదనే వెలితి. రొటీన్ లైఫ్‌ని జాయ్‌ఫుల్‌గా మలుచుకోవడానికి నాకు బతుకమ్మ ఒక దారి చూపించింది. అప్పట్లో యూఎస్ ఇంతగా ఇండియనైజ్ కాలేదు. ఇప్పుడైతే న్యూజెర్సీ, డాలస్తోపాటు కొన్ని నగరాలు పూర్తిగా భారతీయలవే అన్నట్లు, తెలుగువాళ్ల ఊళ్లే అన్నట్లయిపోయాయి. మన పండుగలు ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. నేను మొదలుపెట్టడంతో నేను బతుకమ్మ దీప్తినయ్యాను. ‘దీప్తి మామిడి’గా అమెరికాలో అడుగుపెట్టాను. మూడేళ్ల కిందట తిరిగి వచ్చేటప్పటికి నా పేరు ‘బతుకమ్మ దీప్తి’గా మారింది. బతుకమ్మ పాటకు మ్యూజిక్ మొదలైతే చాలు... ఒళ్లు పులకించిపోతుంది. పూనకం వచ్చినట్లే ఉంటుంది. మీతో మాట్లాడుతున్నా సరే... బతుకమ్మ ఫీల్ వచ్చేస్తుంది. చూడండి గూజ్బంప్స్ వచ్చేశాయి’’ అని చేతులను చూపించారు బతుకమ్మ దీప్తి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Bathukamma Song: ఒక్కేసి పువ్వేసి చందమామా.. ఒక్క జాము ఆయె చందమామా
తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బతుకమ్మ. ఆదివారం ఎంగిపూలతో ఆరంభమైన ఈ పండుగ సందడి కొనసాగుతోంది. తొమ్మిదిరోజుల పాటు కోలాహలంగా సాగే ఈ వేడుకలో పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. పల్లె, పట్నం అంతటా ప్రాచుర్యం పొందిన బతుకమ్మ పాట ఒక్కేసి పువ్వేసి చందమామా.. లిరిక్స్ ఈ పండుగ సందర్భంగా మీకోసం.. ‘‘ఒక్కేసి పువ్వేసి చందమామా.. ఒక్క జాము ఆయె చందమామా పైన మఠం కట్టి చందమామా.. కింద ఇల్లు కట్టి చందమామా మఠంలో ఉన్న చందమామా.. మాయదారి శివుడు చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా గౌరి గద్దెల మీద చందమామా.. జంగమయ్య ఉన్నాడె చందమామా రెండేసి పూలేసి చందమామా.. రెండు జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా మూడేసి పూలేసి చందమామా.. మూడు జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా నాలుగేసి పూలేసి చందమామా.. నాలుగు జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా ఐదేసి పూలేసి చందమామా.. ఐదు జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా ఆరేసి పూలేసి చందమామా.. ఆరు జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా ఏడేసి పూలేసి చందమామా.. ఏడు జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా ఎనిమిదేసి పూలేసి చందమామా.. ఎనిమిది జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా తొమ్మిదేసి పూలేసి చందమామా.. తొమ్మిది జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా తంగేడు వనములకు చందమామా.. తాళ్లు కట్టబోయె చందమామా గుమ్మాడి వనమునకు చందమామా.. గుళ్లు కట్టబోయె చందమామా రుద్రాక్ష వనములకు చందమామా.. నిద్ర చేయబాయె చందమామా’’ సేకరణ : రాచర్ల శ్రీదేవి, భారత్ టాకీస్ రోడ్, కరీంనగర్ చదవండి: Bathukamma Songs: బతుకమ్మ: పుట్టిన రీతి జెప్పె చందమామ! పూర్వకాలం నాటి పాట! Bathukamma Songs: పుట్టింటికి వెళ్లేందుకు అనుమతి! కలవారి కోడలు ఉయ్యాలో..! -
Batukamma: అలాంటి పిచ్చి డ్యాన్స్‌లు వద్దు.. గౌరమ్మ తల్లి గౌరవం కాపాడుదాం!
ఎక్కడా లేనట్లుగా పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకొంటున్నాం. ఎంతో విశిష్టత ఉన్న ఈ వేడుకల్లో తొమ్మిదిరోజులపాటు ఆడబిడ్డలంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పొద్దున్నే లేచి తీరొక్క పూలను సేకరిస్తున్నారు. అందంగా బతుకమ్మలను పేర్చి సాయంత్రం అంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతున్నారు. ఎంగిలిపూలతో మొదలైన వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఇదంతా బాగానే ఉన్నా.. ఇప్పటి బతుకమ్మ ఆటాపాట తీరుపై పలువురు మహిళలు అసంతృప్తి వ్యక్తంజేస్తున్నారు. నాటి సంస్కృతి, సంప్రదాయాలు క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. అప్పటి, ఇప్పటి బతుకమ్మ వేడుకల నిర్వహణపై పలువురు మహిళలు వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే.. చదవండి: బతుకమ్మ, జానపద సాంగ్స్‌తో ఉర్రూతలూగిస్తున్న సింగర్స్ అప్పట్లోనే బాగా ఆడేవాళ్లం కోటపల్లి: బతుకమ్మ పండుగత్తే మా చిన్నతనంలో ఎంతో సంబురపడేటోళ్లం. మాకన్న పెద్దోళ్లు ఆడుతుంటే వాళ్ల అడుగులో అడుగేసి వారి లెక్కే ఆడెటోళ్లం. నడుము వంచి చేతులతో చప్పట్లు కొడుతూ పాటలు పాడేవాళ్లం. ఇప్పటోళ్లకు డీజే పాటల మీద డ్యాన్సుల చేసుడు తప్ప చప్పట్లు కొడుతూ ఆడుడు తెల్వది. పాటలు పాడుతలేరు. చప్పట్లు కొడుతూ స్వయంగా పాడుతూ సంస్కృతిని కాపాడుకోవాలె. – కావిరి సుగుణ, రొయ్యలపల్లి, కోటపల్లి మండలం పెద్దవాళ్ల నుంచి నేర్చుకున్న.. చెన్నూర్: చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, అమ్మ బతుకమ్మ పాటలు పాడడం గమనించిన. నాకూ పాటలు అంటే ఇష్టం. ప్రతీ బతుకమ్మ పండుగకు పాటలు పాడడం చెప్పలేనంత సంతోషాన్నిస్తోంది. పండుగ వచ్చిందంటే కొత్తకొత్త పాటలు నేర్చుకొని తొమ్మిది రోజులు పాడేదాన్ని. బతుకమ్మ అంటేనే చప్పట్లు కొడుతూ పాడుతూ ఆడేది. బతుకమ్మ ఆటను అప్పట్లాగే ఆడితేనే బాగుంటది. – మదాసు శృతి, చెన్నూర్ పిచ్చి పాటలు.. పిచ్చి డ్యాన్స్‌లు.. కాసిపేట: ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ దాకా అప్పట్లో ఎంతో సంబురంగా చప్పట్లు కొడుతూ స్వయంగా పాటలు పాడెటోళ్లం. 40 ఏళ్లుగా మా ఊళ్లో నేను పాటలు పాడుతుంటే మిగతావాళ్లు పాడేది. ప్రస్తుతం ఏడ జూసినా సౌండ్ బాక్స్‌లు, డీజేలల్ల పిచ్చి పాటలు పెట్టి పిచ్చి డ్యాన్స్‌లు చేస్తున్నరు. ఇది మన సంస్కృతి కాదని అందరూ తెలుసుకుంటే మంచిది. – సాయిని మల్లక్క, కోమటిచేను, కాసిపేట మండలం పాటలు పాడుతూ ఆడుతాం చెన్నూర్‌రూరల్: నేను బతుకమ్మ పాటలు పుస్తకంలో చూసి నేర్చుకొన్న. నా చిన్నతనం నుంచి బతుకమ్మ వద్ద పాటలు పాడుతున్న. మా వాడకు బతుకమ్మ ఆడేటప్పుడు చప్పట్లు కొడుతూ స్వయంగా పాడుతున్నం. ఊళ్లో చాలాచోట గిట్లనే ఆడుతున్నరు. నాకు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడడం అంటే చాలా ఇష్టం. చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడి మన సంస్కృతిని కాపాడుకోవాలె. – గద్దె శ్రీలత, పొక్కూరు, చెన్నూర్ డీజే సౌండ్లు తప్ప చప్పట్లు లేవు కాసిపేట: బతుకమ్మ వేడుకలు మొదలైనయంటే తొమ్మిది రోజులు ఊళ్లో పండుగ వాతావరణం కనిపించేది. ఒకరు పాటందుకుంటే మిగతా వాళ్లు అనుకరించెటోళ్లు. సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఆనందంగా ఆడుకునెటోళ్లం. ఇప్పుడు డీజే సౌండ్లు, డ్యాన్స్‌లు తప్పా చప్పట్లు వినిపించడంలేదు. యువత పూర్వం నుంచి వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యమివ్వాలె. – బూసి రాజేశ్వరి, సోమగూడం, కాసిపేట మండలం ఇప్పుడు పాడెటోళ్లే లేరు లక్సెట్టిపేట: చిన్నప్పుడు బతుకమ్మ పాటలు పాడుతూ సంబురంగా బతుకమ్మ పండుగను జరుపుకొనేటోళ్లం. బతుకమ్మ వచ్చిందంటే చాలు సంబురంగా పాటలు పాడేదాన్ని. ఇప్పుడు పాటలు పాడేవాళ్లే లేరు. డీజే పాటలు పెట్టుకుని ఆడుతున్నరు. రోజురోజుకూ ఆట తీరే మారుతున్నది. బాధనిపిస్తుంది. సంప్రాదాయాన్ని కాపాడుకోవాలె. పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుకోవాలె. – లింగాల దేవక్క, గంపలపల్లి, లక్సెట్టిపేట మండలం ఎంతో ఇష్టపడి పాటలు పాడుతా భీమారం: బతుకమ్మ పండుగ అంటే నాకు ఎంతో ఇష్టం. ప్రతీ సంవత్సరం పండుగ వచ్చిందంటే చాలు ఉదయాన్నే మాఇంట్లో లేని పూలను ఇంటింటికీ వెళ్లి సేకరించి బతుకమ్మను పేరుస్తా. డీజే పాటలు పెట్టినా నన్నే పాడుమంటరు. నేను పాడితే మిగతావాళ్లు సంబురంగా పాడుతున్నరు. మా ఊళ్లో ఎంతో ఇష్టంగా తొమ్మిదిరోజుల పాటు సంబురాలు జరుపుకొంటున్నం. – ఎల్కటూరి శంకరమ్మ, భీమారం మండలం ఇప్పటోళ్లకు ఆడుడే రాదు జన్నారం: నాడు సాయంత్రం బతుకమ్మ ఆట మొదలువెట్టి గంటలతరబడి ఆడుకునేది. వాడోళ్లందరం చప్పట్లు కొడుతూ పాటలు పాడెటోళ్లం. ఎంతో భక్తిశ్రద్ధలతో తొమ్మిదిరోజులు పండుగ జరుపుకొనేది. ఇప్పుడు ఎక్కడ చూసినా డీజే పాటలు పెట్టుకుని ఎగురుతున్నరు. బతుకమ్మల చుట్టూ కోలలాడుతున్నరు. బతుకమ్మ ఆటనే మార్చిండ్రు. ఇప్పటోళ్లకు ఎగురుడు తప్ప ఆడుడు రాదు. – అమరగొండ లక్ష్మి, జన్నారం మండలం మా అప్పుడు డీజేల లొల్లి లేదు లక్ష్మణచాంద: అప్పట్లో మేం బతుకమ్మ ఆడేటప్పుడు గీ డీజేల లొల్లి లేదు. అచ్చమైన బతుకమ్మ పాటలు పాడెటోళ్లం. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చప్పుట్లు కొడుతూ ఒకరు ముందు పాడితే వెనుక అందరం పాడేది. ‘రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో..’ అంటూ రాగమెత్తితే ఆ జోష్ వేరేలా ఉండేది. ఇప్పటోళ్లకు అప్పటిలెక్క ఆడుడే రాదు. తెల్వనోళ్లు నేర్చుకుని ఆడాలె. – ఎంకవ్వ, లక్ష్మణచాంద సంప్రదాయాలను కాపాడుకోవాలె భీమిని: పూర్వపు సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి. వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరంపైన ఉంది. పూలను దేవతగా పూజించే పండుగ మరెక్కడా లేదు. సంప్రదాయం ప్రకారం బతుకమ్మ ఆడాలి. నాడు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఆడుకునేవాళ్లం. నేడు డీజే సౌండ్ల మధ్య జరుపుతున్నారు. ఆనాటి సంప్రదాయాలను కాపాడుకోవాలె. – పుల్లూరి సురేఖ, కన్నెపల్లి, భీమిని మండలం అప్పటి ఆట పిల్లలకు నేర్పిస్తున్న భైంసాటౌన్: నేటి తరం పిల్లల కు మన అప్పటి బతుకమ్మ ఆట గురించి తెలియదు. పిల్లలకు వివరించేందుకు తల్లిదండ్రులకూ సమయం ఉండడం లేదు. నేను భరత నాట్యం నేర్చుకుని ఇప్పటి పిల్లలకు నేర్పుతున్న. బతుకమ్మ పండుగ అంటే డీజే పెట్టుకుని డ్యాన్సులు చేయడం కాదని వారికి వివరిస్తున్న. దీంతో వారిలో మార్పు వస్తోంది. కొందరైనా నన్ను అనుసరించడం సంతోషంగా ఉంది. – రంగు సౌమ్య, నృత్య శిక్షకురాలు, భైంసా -
బతుకమ్మ, జానపద సాంగ్స్‌తో ఉర్రూతలూగిస్తున్న సింగర్స్
సాక్షి, కరీంనగర్: బతుకమ్మ తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే పండుగ. ఇందులో ప్రధానంగా పువ్వులను పూజిస్తారు. ఆడబిడ్డలు అందంగా బతుకమ్మలు పేర్చి, ఒక్కచోట ఆడిపాడతారు. బతుకమ్మ అంటే అందరికీ గుర్తొచ్చేవి బతుకులోంచి పుట్టిన బతుకమ్మ పాటలు. పండుగ సమయంలో 9 రోజులు ఈ పాటలతో వీధులన్నీ మార్మోగుతుంటాయి. కాలానికనుగుణంగా తెలంగాణలో సంప్రదాయ బతుకమ్మ పాటలు సరికొత్త సొబగులు అద్దుకొని, సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. వీటికి ఎంతోమంది గాయనీగాయకులు కొత్త రెక్కలు తొడిగారు. తమ ప్రతిభతో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నారు. కరీంనగర్లో బతుకమ్మ మ్యూజిక్ చానల్ ద్వారా గేయ రచయిత పొద్దుపొడుపు శంకర్ ‘పూతాపూలన్ని పూచే లేత కొమ్మలు అక్కాసెల్లేలు తల్లిగారిల్లు’ అంటూ కొత్త పాటను విడుదల చేశారు. ఉయ్యాలో రామ ఉయ్యాలో అంటూ కరీంనగర్‌కు చెందిన అమూల్య కోటి కొత్త పాటను యూట్యూబ్‌లో సోమవారం విడుదల చేయగా ఇప్పటివరకు వేలాది మంది వీక్షించారు. తమ పాటలతో ప్రజాదరణ పొందుతున్న ఇలాంటి పలువురు గాయకులపై ప్రత్యేక కథనం. చిన్నీ మా బతుకమ్మ : తేలు విజయ కరీంనగర్‌కు చెందిన దంపతులు తేలు వెంకటరాజం–నర్సమ్మ దంపతులకు 1980లో జూన్ 21న తేలు విజయ జన్మించింది. చిన్ననాటి నుంచే తన కుటుంబసభ్యులు పాడే జానపదాలు వింటూ పెరిగింది. 1998లో ‘తండాకు వోతాండు గుడుంబా తాగుతాండు..’ అంటూ పాడి, తొలి పాటతోనే గుర్తింపు తెచ్చుకుంది. 2007లో ‘బతుకమ్మ’ సినిమాలో ‘ఊరికి ఉత్తరానా వలలో..’ అనే పాట పాడింది. 2015లో ‘చిన్నీ మా బతుకమ్మ’ పాటకు 8 లక్షల వ్యూస్ వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ ఉద్యమ గాయనిగా’ అవార్డు అందుకుంది. ఈ ఏడాది పువ్వుల బతుకమ్మతోపాటు మరో 6 బతుకమ్మ పాటలు పాడింది. బతుకమ్మా.. బతుకమ్మా : చిలివేరు శ్రీకాంత్ కరీంనగర్‌లోని సాయినగర్ చెందిన చిలివేరు పోచమ్మ–విజయ్ దంపతులకు శ్రీకాంత్ 1985 నవంబర్ 24న జన్మించారు. నాన్న స్వయంగా భజనలు, కీర్తనలు, అక్క భక్తి పాటలు పాటడంతో వాటిపై ఇతనికి మక్కువ ఏర్పడింది. ఇంటర్మీడియట్ నుంచే ప్రముఖ టెలివిజన్ షోలో గాయకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు. పాడుతా తీయగా, వన్స్‌మోర్ ప్లీజ్, స్టార్ అంత్యాక్షరీ షోలో పాల్గొని, పేరు తెచ్చుకున్నాడు. గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యంపై పాటలు రాసి, పాడాడు. బతుకమ్మా.. బతుకమ్మా.. మా తల్లీ బతుకమ్మ పాటను శ్రీకాంత్ స్టూడియో యూట్యూబ్ చానల్ ద్వారా గత సోమవారం సాయంత్రం విడుదల చేయగా 19 గంటల్లో 4,500 వ్యూస్ వచ్చాయి. ఓ నిర్మలా.. : వొల్లాల వాణి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన వొల్లాల వాణి 2016లో పాడిన ఘల్లు ఘల్లునా.. ఓ నిర్మలా అనే బతుకమ్మ పాటతో గుర్తింపు పొందింది. దీనికి ఇప్పటివరకు 72 లక్షల వ్యూస్ వచ్చాయి. ఏటా బతుకమ్మ పండుగకు ఏ గ్రామంలో చూసినా ఇదే పాట మారుమోగుతోంది. ఆస్ట్రేలియా, దుబాయ్, ఖతర్ దేశాల్లో జరిగిన వేడుకల్లో తన పాటలతో హోరెత్తించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జిల్లా ఉత్తమ గాయనిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకుంది. ఈ నెల 24న విడుదలైన కోడి కూత వెట్టగానే రాంభజన అనే పాటకు 2 లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. నల్లమద్ది చెట్టు కింద.. : సుంకోజు నాగలక్ష్మి సుంకోజు నాగలక్ష్మిది రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని బందనకల్. బతుకుదెరువు కోసం సిరిసిల్లకు వచ్చిన ఈమె కుటుంబం తంగళ్లపల్లి మండల కేంద్రంలో స్థిరపడింది. చిన్నతనం నుంచే నాగలక్ష్మికి పాటలన్నా, పాడటం అన్నా ఇష్టం. అర్కమిత్ర ఫౌండేషన్ నిర్వహించిన పోటీల్లో గెల్చుకున్న బహుమతి ఆమెకు స్ఫూర్తినిచ్చింది. బొజ్జ రేవతి దగ్గర కర్నాటక సంగీతాన్ని సాధన చేసి, తన పాటకు శాస్త్రీయతను జోడించింది. మొదటి రెండేళ్లలోనే సుమారు 80 జానపద గీతాలను ఆలపించింది. నల్లమద్ది చెట్టు కింద అనే పాటతో పేరు తెచ్చుకుంది. యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ 30 మిలియన్లకు పైగా వ్యూయర్షిప్ సంపాదించింది. ఇటీవల బతుకమ్మ కోసం ఆలపించిన పాటలూ జనాదరణ పొందాయి. ఏమే పిల్లా అన్నప్పుడల్లా.. : శిరీష రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డినగర్‌కు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు అశోక్ కూతురు శిరీష. పాటల ప్రయాణంలో దూసుకుపోతోంది. చిన్ననాడు దసరా ఉత్సవాల్లో పాడాలని ప్రోత్సహించిన నాన్న మాటలే ఆ తర్వాత కాలంలో తనకో కెరీర్‌ను సృష్టించాయి. పసితనంలో అక్కడే ఆర్కెస్ట్రా నిర్వహిస్తున్న ప్రదీప్ శిరీష స్వర మాధుర్యం, లయ జ్ఞానాన్ని గుర్తించాడు. శిక్షణ ఇస్తే మంచి గాయని అవుతుందని ఆమె తండ్రిని ఒప్పించాడు. ఫలితంగా ఆర్కెస్ట్రా సింగర్‌గా చాలాచోట్ల కచేరీలు చేసింది. తర్వాత యూట్యూబ్ స్టార్ అయ్యింది.నాలుగేళ్లలోనే వెయ్యి పాటలు ఆలపించిన శిరీష, పాటలు, వాటి షూటింగ్‌లతో బిజీ అయిపోయింది. ఏమే పిల్లా అన్నప్పుడల్లా.. అనే జానపద పాటతో ప్రజల గుండెల్లో చోటు దక్కించుకుంది. సినీ తారలు సైతం ఈ పాటకు స్టెప్పులేశారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో శిరీష పాటలకు లక్షల సంఖ్యలో వ్యూయర్స్ ఉన్నారు. ఇటీవల రూపొందించిన బతుకమ్మ పాటలు కూడా మంచి గుర్తింపు పొందాయి. -
బతుకమ్మ.. పుట్టిన రీతి జెప్పె చందమామ! పూర్వకాలం నాటి పాట!
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఆరంభమైంది. తొమ్మిది రోజులు వేడుకగా సాగే ఈ సంబురంలో పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. బతుకమ్మా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ.. కోలాటాలతో ఆడబిడ్డలంతా కథాగానం చేస్తూ గౌరమ్మను పూజిస్తారు. ఈ పండుగ వేళ బతుకమ్మ జననం గురించి చెప్పే 200 ఏళ్ల నాటి పాట మీకోసం.. ‘‘శ్రీలక్ష్మీ దేవియు చందమామ- సృష్టి బతుకమ్మాయె చందమామ పుట్టిన రీతి జెప్పె చందమామ- భట్టు నరసింహకవి చందమామ ధర చోళదేశమున చందమామ- ధర్మాంగుడను రాజు చందమామ ఆరాజు భార్యయు చందమామ- అతి సత్యవతి యంద్రు చందమామ నూరునోములు నోచి చందమామ- నూరు మందిని గాంచె చందమామ వారు శూరులయ్యె చందమామ- వైరులచే హతమైరి చందమామ తల్లిదండ్రులపుడు చందమామ- తరగనీ శోకమున చందమామ ధనరాజ్యమునుబాసి చందమామ- దాయాదులను బాసి చందమామ వనితతో ఆ రాజు చందమామ- వనమందు నివసించె చందమామ కలికి లక్ష్మిని గూర్చి చందమామ- పలికె వరమడుగుమని చందమామ వినుతించి వేడుచు చందమామ- వెలది తన గర్భమున చందమామ పుట్టుమని వేడగా చందమామ- పూబోణి మది మెచ్చి చందమామ సత్యవతి గర్భమున చందమామ- జన్మించె శ్రీలక్ష్మి చందమామ అంతలో మునులునూ చందమామ- అక్కడికి వచ్చిరి చందమామ కపిలగాలవులునూ చందమామ- కశ్యపాంగీరసులు చందమామ అత్రి వశిష్టులూ చందమామ- ఆ కన్నియను జూచి చందమామ బతుకు గనె ఈ తల్లి చందమామ- బతుకమ్మ యనిరంత చందమామ’’ చదవండి: Bathukamma Songs: పుట్టింటికి వెళ్లేందుకు అనుమతి! కలవారి కోడలు ఉయ్యాలో..! -
Bathukamma: పుట్టింటికి వెళ్లేందుకు అనుమతి! కలవారి కోడలు ఉయ్యాలో..!
Bathukamma 2022- Song: తెలంగాణలో బతుకమ్మ పండుగ సందడి మొదలైంది. ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మతో ఆడపడుచుల సంబరాల వేడుక ఆరంభమైంది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక్కచేట చేర్చి.. చుట్టూ తిరుగుతూ చప్పట్లతో తమ అనుభవాలు, ఆనందాలు, కష్టాలనే పాటలుగా మలిచి గౌరమ్మను కొలుస్తారు ఆడబిడ్డలు. ఇక ఏ పండక్కి పుట్టింకి వెళ్లినా వెళ్లకపోయినా చాలా మంది ఆడపడుచులు ఈ పండుగకు మాత్రం అమ్మగారింటికి వెళ్తారు. మరి అలా వెళ్లాలంటే అత్తింటి వారి అనుమతి తీసుకోవాలి కదా! ఓ ఆడబిడ్డను పుట్టింటికి తీసుకువెళ్లడానికి ఆమె అన్నలు రాగా.. అత్తమామలు, బావ- యారాలు(తోడికోడలు), ఆపై భర్తను అడిగి అనుమతి పొందిన తీరును పాటగా మలిస్తే... ఇలా.. ‘‘కలవారి కోడలు ఉయ్యాలో.. కనక మహాలక్ష్మి ఉయ్యాలో.. కడుగుతున్నది పప్పు ఉయ్యాలో.. కడవల్లోనబోసి ఉయ్యాలో.. అప్పుడే వచ్చెను ఉయ్యాలో.. ఆమె పెద్దన్న ఉయ్యాలో.. కాళ్లకు నీళ్లిచ్చి ఉయ్యాలో.. కన్నీళ్లు తీసింది ఉయ్యాలో.. ఎందుకు చెల్లెలా ఉయ్యాలో.. ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో.. తుడుచుకో కన్నీళ్లు ఉయ్యాలో.. ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో.. ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో.. వెళ్లి వద్దామమ్మ ఉయ్యాలో.. చేరి నీవారితో ఉయ్యాలో.. చెప్పిరాపోవమ్మ ఉయ్యాలో.. పట్టెమంచం మీద ఉయ్యాలో.. పవళించిన మామ ఉయ్యాలో.. మాయన్నలొచ్చిరి ఉయ్యాలో.. మమ్ముబంపుతార ఉయ్యాలో.. నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో.. మీ అత్తనడుగు ఉయ్యాలో.. అరుగుల్ల గూసున్న ఉయ్యాలో.. ఓ అత్తగారు ఉయ్యాలో.. మా అన్నలొచ్చిరి ఉయ్యాలో.. మమ్ముబంపుతార ఉయ్యాలో.. నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో.. మీ బావనడుగు ఉయ్యాలో.. భారతం సదివేటి ఉయ్యాలో.. బావ పెద్ద బావ ఉయ్యాలో.. మా అన్నలొచ్చిరి ఉయ్యాలో.. మమ్ముబంపుతార ఉయ్యాలో.. నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో.. మీ అక్కనడుగు ఉయ్యాలో.. వంటశాలలో ఉన్న ఉయ్యాలో.. ఓ అక్కగారు ఉయ్యాలో.. మా అన్నలొచ్చిరి ఉయ్యాలో.. మమ్ముబంపుతార ఉయ్యాలో.. నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో.. మీ భర్తనే అడుగు ఉయ్యాలో.. రచ్చలో గూర్చున్న ఉయ్యాలో.. రాజేంద్ర భోగి ఉయ్యాలో.. మా అన్నలొచ్చిరి ఉయ్యాలో.. మమ్ముబంపుతార ఉయ్యాలో.. కట్టుకో చీరలు ఉయ్యాలో.. పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో.. ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో.. వెళ్లిరా ఊరికి ఉయ్యాలో..’’ – సేకరణ: తొడుపునూరి నీరజ, కరీంనగర్ – విద్యానగర్(కరీంనగర్) -
బతుకమ్మ పాటను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ సంబురాల సందర్భంగా బతుకమ్మ ఆడియో, వీడియో పాటను రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి, కథ రచయిత విజయ భాస్కర్, రేఖ బోయపల్లి తదితరులు పాల్గొన్నారు. -
బొమ్మల బతుకమ్మ
విషయం.. విమెన్ ఆర్టిస్ట్‌ల గురించి సందర్భం.. ఆర్ట్ ఎట్ తెలంగాణ నిర్వహిస్తున్న ఆర్ట్ క్యాంప్ స్థలం.. తారామతి బారాదరి ప్రత్యేకత... వందేళ్ల తెలంగాణ ఆర్ట్, ఆర్టిస్టులతో కాఫీటేబుల్ పుస్తకం రాబోతోంది. ప్రస్తుతం ఈ క్యాంప్‌లో పాల్గొంటున్న కళాకారులందరి చిత్రాలు అందులో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్యాంప్ రెండు సెషన్స్‌గా జరుగుతోంది. బుధవారం రెండో సెషన్ ప్రారంభమైంది. ఈ రెండు సెషన్లలో దాదాపు పది మంది మహిళా చిత్రకారులు తమ కుంచెలకు రంగులద్దారు. ఈ క్యాంప్ కేవలం రంగు బొమ్మలకే కాదు పువ్వుల చిత్రానికీ.. బతుకమ్మ గీతాలకూ వేదికైంది. ఆర్ట్ ఎట్ తెలంగాణ ఆధ్వర్యంలో ఆగస్ట్ 27న ప్రారంభమైన ఆర్ట్ క్యాంప్ తెలంగాణ సృజనకు మెరుగులద్దే ప్రయత్నమే కాదు ఓ కొత్త సాంప్రదాయానికీ క్యాన్వాస్ పరిచింది. వయసులో చిన్న, పెద్ద, కళలో సీనియర్ జూనియర్ అనే వ్యత్యాసాలకు స్థానం ఇవ్వకుండా తెలంగాణలోని ఆర్టిస్టులందరినీ ఒక్క చోటికి చేర్చింది. గురువులు.. ఆ గురువుల గురువులు, శిష్యులు వారి జూనియర్లు.. ఇలా నాలుగు తరాల చిత్రకారులను ఈ క్యాంప్ ఒక్కటి చేసింది. కవితా దివోస్కర్, అంజనీ రెడ్డి వంటి పెద్ద తరం చిత్రకారిణులు .. వాళ్ల దగ్గర బ్రష్ పట్టడం నేర్చుకున్న అర్చన సొంటి, వేముల గౌరి, కరుణ సుక్క లాంటి శిష్యమణులు.. వాళ్ల జూనియర్లు నిర్మలా బిలుక, ఉదయలక్ష్మి, రోహిణీ రెడ్డి.. యంగెస్ట్ ఆర్టిస్ట్ ప్రియాంక ఏలే వరకు అందరికీ ఈ క్యాంప్ అద్భుత జ్ఞాపకం. బతుకమ్మ ఆట... ‘ఈ క్యాంప్ మాకిచ్చిన వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటంటే.. పండుగలకు ఎప్పుడూ కలసుకోని మేమంతా ఇలా ఒక్కచోట కలుసుకొని ఈ తారామతి బారాదరిలో బతుకమ్మ ఆడుకోవడం. జీవితంలో మరచిపోలేని జ్ఞాపకం ఇది. ఉదయం బొమ్మలు వేస్తున్నాం. సాయంత్రం అందరం కలసి బతుకమ్మ ఆడుతున్నాం. క్యాంప్‌లో ఏ థీమ్ లేకపోవడం వల్ల అందరూ స్వేచ్ఛగా ఫీలవుతున్నారు. వాళ్లకు తట్టిన ఆలోచనను క్యాన్వాస్పై చిత్రీకరిస్తున్నారు. నేచురల్‌గా రంగులద్దుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత మా గురువులను కలుసుకోవడం.. వాళ్లువర్క్ చేస్తుంటే చూసే అవకాశం కలగటం ఆనందాన్నిచ్చింది’ అని తెలిపింది వేముల గౌరి. గ్రేట్ హానర్.. ‘ఎక్సెలెంట్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్ క్యాంప్ ఇది. క్వాలిఫైడ్ ఆర్టిస్ట్‌లకే కాదు సెల్ఫ్ మేడ్ ఆర్టిస్ట్‌లకూ ఇందులో ప్లేస్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకుంటున్నాం.. ఇంతమందిని ఒకేసారి కలుసుకోగలిగాం. అందరితో కలసి పనిచేయడం.. మాకూ రెడ్ కార్పెట్ హానర్ దొరకడం గ్రేట్ థింగ్స్’ అని చెప్పింది కరుణ సుక్క. తొంభైమంది ఆర్టిస్టులు.. ‘చాలా ఏళ్ల తర్వాత ఇంత పెద్ద క్యాంప్ పెట్టడం. ఇందులో పార్టిసిపేట్ చేయడం గర్వంగా ఫీలవుతున్న. ఈ క్యాంప్‌లో.. రెండు సెషన్స్‌కి కలిపి మొత్తం తొంభై మంది ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. అందరూ తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బొమ్మలేయడం... చాలా బాగుంది. కవితా దివోస్కర్, అంజనీ రెడ్డిలాంటి గురువులను కలసుకునే అవకాశం దొరికింది. ఈ ఇద్దరి తర్వాత ఇక్కడున్న వాళ్లలో నేనే సీనియర్ని. అంటే వాళ్ల తర్వాత చాలా ఏళ్ల వరకు ఆర్ట్‌లోకి అమ్మాయిలు రాలేదు’ అని తన అభిప్రాయాన్ని పంచుకుంది సీనియర్ ఆర్టిస్ట్ అర్చన సొంటి. బిగ్ ఈవెంట్ ‘ఇంత బిగ్ ఈవెంట్లో నేనెప్పుడూ పార్టిసిపేట్ చేయలేదు. మాలాంటి యంగర్ జనరేషన్‌కి ఇందులో చోటు దొరకడం నిజంగా గ్రేట్ హానర్. పెద్దవాళ్ల ఎక్స్పీరియన్స్ మాకు లెసన్స్గా ఉపయోగపడుతున్నాయి. అసలు వాళ్లతో మాట్లాడటమే మాకు గొప్ప అవకాశం. ఈ క్యాంప్‌లో నేనూ వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్‌గా ఉండడం.. నా వరకు నేనైతే మోర్ ప్రివిలెజ్డ్గా భావిస్తున్నాను’ అని చెప్పింది ప్రియాంక ఏలే! - సరస్వతి రమ