బొమ్మల బతుకమ్మ
విషయం.. విమెన్ ఆర్టిస్ట్‌ల గురించి
సందర్భం.. ఆర్ట్ ఎట్ తెలంగాణ నిర్వహిస్తున్న ఆర్ట్ క్యాంప్
స్థలం.. తారామతి బారాదరి
ప్రత్యేకత... వందేళ్ల తెలంగాణ ఆర్ట్, ఆర్టిస్టులతో కాఫీటేబుల్ పుస్తకం రాబోతోంది. ప్రస్తుతం ఈ క్యాంప్‌లో పాల్గొంటున్న కళాకారులందరి చిత్రాలు అందులో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్యాంప్ రెండు సెషన్స్‌గా జరుగుతోంది. బుధవారం రెండో సెషన్ ప్రారంభమైంది. ఈ రెండు సెషన్లలో దాదాపు పది మంది మహిళా చిత్రకారులు తమ కుంచెలకు రంగులద్దారు. ఈ క్యాంప్ కేవలం రంగు బొమ్మలకే కాదు పువ్వుల చిత్రానికీ.. బతుకమ్మ గీతాలకూ వేదికైంది.
ఆర్ట్ ఎట్ తెలంగాణ ఆధ్వర్యంలో ఆగస్ట్ 27న ప్రారంభమైన ఆర్ట్ క్యాంప్ తెలంగాణ సృజనకు మెరుగులద్దే ప్రయత్నమే కాదు ఓ కొత్త సాంప్రదాయానికీ క్యాన్వాస్ పరిచింది. వయసులో చిన్న, పెద్ద, కళలో సీనియర్ జూనియర్ అనే వ్యత్యాసాలకు స్థానం ఇవ్వకుండా తెలంగాణలోని ఆర్టిస్టులందరినీ ఒక్క చోటికి చేర్చింది. గురువులు.. ఆ గురువుల గురువులు, శిష్యులు వారి జూనియర్లు.. ఇలా నాలుగు తరాల చిత్రకారులను ఈ క్యాంప్ ఒక్కటి చేసింది. కవితా దివోస్కర్, అంజనీ రెడ్డి వంటి పెద్ద తరం చిత్రకారిణులు .. వాళ్ల దగ్గర బ్రష్ పట్టడం నేర్చుకున్న అర్చన సొంటి, వేముల గౌరి, కరుణ సుక్క లాంటి శిష్యమణులు.. వాళ్ల జూనియర్లు నిర్మలా బిలుక, ఉదయలక్ష్మి, రోహిణీ రెడ్డి.. యంగెస్ట్ ఆర్టిస్ట్ ప్రియాంక ఏలే వరకు అందరికీ ఈ క్యాంప్ అద్భుత జ్ఞాపకం.
బతుకమ్మ ఆట...
‘ఈ క్యాంప్ మాకిచ్చిన వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ఏంటంటే.. పండుగలకు ఎప్పుడూ కలసుకోని మేమంతా ఇలా ఒక్కచోట కలుసుకొని ఈ తారామతి బారాదరిలో బతుకమ్మ ఆడుకోవడం. జీవితంలో మరచిపోలేని జ్ఞాపకం ఇది. ఉదయం బొమ్మలు వేస్తున్నాం. సాయంత్రం అందరం కలసి బతుకమ్మ ఆడుతున్నాం. క్యాంప్‌లో ఏ థీమ్ లేకపోవడం వల్ల అందరూ స్వేచ్ఛగా ఫీలవుతున్నారు. వాళ్లకు తట్టిన ఆలోచనను క్యాన్వాస్‌పై చిత్రీకరిస్తున్నారు. నేచురల్‌గా రంగులద్దుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత మా గురువులను కలుసుకోవడం.. వాళ్లువర్క్ చేస్తుంటే చూసే అవకాశం కలగటం ఆనందాన్నిచ్చింది’ అని తెలిపింది వేముల గౌరి.
గ్రేట్ హానర్..
‘ఎక్సెలెంట్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్ క్యాంప్ ఇది. క్వాలిఫైడ్ ఆర్టిస్ట్‌లకే కాదు సెల్ఫ్ మేడ్ ఆర్టిస్ట్‌లకూ ఇందులో ప్లేస్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకుంటున్నాం.. ఇంతమందిని ఒకేసారి కలుసుకోగలిగాం. అందరితో కలసి పనిచేయడం.. మాకూ రెడ్ కార్పెట్ హానర్ దొరకడం గ్రేట్ థింగ్స్’ అని చెప్పింది కరుణ సుక్క.
తొంభైమంది ఆర్టిస్టులు..
‘చాలా ఏళ్ల తర్వాత ఇంత పెద్ద క్యాంప్ పెట్టడం. ఇందులో పార్టిసిపేట్ చేయడం గర్వంగా ఫీలవుతున్న. ఈ క్యాంప్‌లో.. రెండు సెషన్స్‌కి కలిపి మొత్తం తొంభై మంది ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. అందరూ తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బొమ్మలేయడం... చాలా బాగుంది. కవితా దివోస్కర్, అంజనీ రెడ్డిలాంటి గురువులను కలసుకునే అవకాశం దొరికింది. ఈ ఇద్దరి తర్వాత ఇక్కడున్న వాళ్లలో నేనే సీనియర్‌ని. అంటే వాళ్ల తర్వాత చాలా ఏళ్ల వరకు ఆర్ట్‌లోకి అమ్మాయిలు రాలేదు’ అని తన అభిప్రాయాన్ని పంచుకుంది సీనియర్ ఆర్టిస్ట్ అర్చన సొంటి.
బిగ్ ఈవెంట్
‘ఇంత బిగ్ ఈవెంట్‌లో నేనెప్పుడూ పార్టిసిపేట్ చేయలేదు. మాలాంటి యంగర్ జనరేషన్‌కి ఇందులో చోటు దొరకడం నిజంగా గ్రేట్ హానర్. పెద్దవాళ్ల ఎక్స్‌పీరియన్స్ మాకు లెసన్స్‌గా ఉపయోగపడుతున్నాయి. అసలు వాళ్లతో మాట్లాడటమే మాకు గొప్ప అవకాశం. ఈ క్యాంప్‌లో నేనూ వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్‌గా ఉండడం.. నా వరకు నేనైతే మోర్ ప్రివిలెజ్డ్‌గా భావిస్తున్నాను’ అని చెప్పింది ప్రియాంక ఏలే!
- సరస్వతి రమ