బతుకమ్మ, జానపద సాంగ్స్‌తో ఉర్రూతలూగిస్తున్న సింగర్స్‌ | Bathukamma Festival: Karimnagar Folk Song Singers, Famous Songs | Sakshi
Sakshi News home page

బతుకమ్మ, జానపద సాంగ్స్‌తో ఉర్రూతలూగిస్తున్న సింగర్స్‌

Published Wed, Sep 28 2022 12:46 PM | Last Updated on Wed, Sep 28 2022 2:31 PM

Bathukamma Festival: Karimnagar Folk Song Singers, Famous Songs - Sakshi

సాక్షి, కరీంనగర్‌: బతుకమ్మ తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే పండుగ. ఇందులో ప్రధానంగా పువ్వులను పూజిస్తారు. ఆడబిడ్డలు అందంగా బతుకమ్మలు పేర్చి, ఒక్కచోట ఆడిపాడతారు. బతుకమ్మ అంటే అందరికీ గుర్తొచ్చేవి బతుకులోంచి పుట్టిన బతుకమ్మ పాటలు. పండుగ సమయంలో 9 రోజులు ఈ పాటలతో వీధులన్నీ మార్మోగుతుంటాయి. కాలానికనుగుణంగా తెలంగాణలో సంప్రదాయ బతుకమ్మ పాటలు సరికొత్త సొబగులు అద్దుకొని, సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. వీటికి ఎంతోమంది గాయనీగాయకులు కొత్త రెక్కలు తొడిగారు. తమ ప్రతిభతో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నారు.

కరీంనగర్‌లో బతుకమ్మ మ్యూజిక్‌ చానల్‌ ద్వారా గేయ రచయిత పొద్దుపొడుపు శంకర్‌ ‘పూతాపూలన్ని పూచే లేత కొమ్మలు అక్కాసెల్లేలు తల్లిగారిల్లు’ అంటూ కొత్త పాటను విడుదల చేశారు. ఉయ్యాలో రామ ఉయ్యాలో అంటూ కరీంనగర్‌కు చెందిన అమూల్య కోటి కొత్త పాటను యూట్యూబ్‌లో సోమవారం విడుదల చేయగా ఇప్పటివరకు వేలాది మంది వీక్షించారు. తమ పాటలతో ప్రజాదరణ పొందుతున్న ఇలాంటి పలువురు గాయకులపై ప్రత్యేక కథనం.

చిన్నీ మా బతుకమ్మ : తేలు విజయ
కరీంనగర్‌కు చెందిన దంపతులు తేలు వెంకటరాజం–నర్సమ్మ దంపతులకు 1980లో జూన్‌ 21న తేలు విజయ జన్మించింది. చిన్ననాటి నుంచే తన కుటుంబసభ్యులు పాడే జానపదాలు వింటూ పెరిగింది. 1998లో ‘తండాకు వోతాండు గుడుంబా తాగుతాండు..’ అంటూ పాడి, తొలి పాటతోనే గుర్తింపు తెచ్చుకుంది. 2007లో ‘బతుకమ్మ’ సినిమాలో ‘ఊరికి ఉత్తరానా వలలో..’ అనే పాట పాడింది. 2015లో ‘చిన్నీ మా బతుకమ్మ’ పాటకు 8 లక్షల వ్యూస్‌ వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ ఉద్యమ గాయనిగా’ అవార్డు అందుకుంది. ఈ ఏడాది పువ్వుల బతుకమ్మతోపాటు మరో 6 బతుకమ్మ పాటలు పాడింది.

బతుకమ్మా.. బతుకమ్మా : చిలివేరు శ్రీకాంత్‌ 
కరీంనగర్‌లోని సాయినగర్‌ చెందిన చిలివేరు పోచమ్మ–విజయ్‌ దంపతులకు శ్రీకాంత్‌ 1985 నవంబర్‌ 24న జన్మించారు. నాన్న స్వయంగా భజనలు, కీర్తనలు,  అక్క భక్తి పాటలు పాటడంతో వాటిపై ఇతనికి మక్కువ ఏర్పడింది. ఇంటర్మీడియట్‌ నుంచే ప్రముఖ టెలివిజన్‌ షోలో గాయకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు. పాడుతా తీయగా, వన్స్‌మోర్‌ ప్లీజ్, స్టార్‌ అంత్యాక్షరీ షోలో పాల్గొని, పేరు తెచ్చుకున్నాడు. గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యంపై పాటలు రాసి, పాడాడు. బతుకమ్మా.. బతుకమ్మా.. మా తల్లీ బతుకమ్మ పాటను శ్రీకాంత్‌ స్టూడియో యూట్యూబ్‌ చానల్‌ ద్వారా గత సోమవారం సాయంత్రం విడుదల చేయగా 19 గంటల్లో 4,500 వ్యూస్‌ వచ్చాయి.

ఓ నిర్మలా.. : వొల్లాల వాణి
కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన వొల్లాల వాణి 2016లో పాడిన ఘల్లు ఘల్లునా.. ఓ నిర్మలా అనే బతుకమ్మ పాటతో గుర్తింపు పొందింది. దీనికి ఇప్పటివరకు 72 లక్షల వ్యూస్‌ వచ్చాయి. ఏటా బతుకమ్మ పండుగకు ఏ గ్రామంలో చూసినా ఇదే పాట మారుమోగుతోంది. ఆస్ట్రేలియా, దుబాయ్, ఖతర్‌ దేశాల్లో జరిగిన వేడుకల్లో తన పాటలతో హోరెత్తించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జిల్లా ఉత్తమ గాయనిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకుంది. ఈ నెల 24న విడుదలైన కోడి కూత వెట్టగానే రాంభజన అనే పాటకు 2 లక్షలకు పైగా వ్యూస్‌ రావడం గమనార్హం.

నల్లమద్ది చెట్టు కింద.. : సుంకోజు నాగలక్ష్మి
సుంకోజు నాగలక్ష్మిది రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలోని బందనకల్‌. బతుకుదెరువు కోసం సిరిసిల్లకు వచ్చిన ఈమె కుటుంబం తంగళ్లపల్లి మండల కేంద్రంలో స్థిరపడింది. చిన్నతనం నుంచే నాగలక్ష్మికి పాటలన్నా, పాడటం అన్నా ఇష్టం. అర్కమిత్ర ఫౌండేషన్‌ నిర్వహించిన పోటీల్లో గెల్చుకున్న బహుమతి ఆమెకు స్ఫూర్తినిచ్చింది. బొజ్జ రేవతి దగ్గర కర్నాటక సంగీతాన్ని సాధన చేసి, తన పాటకు శాస్త్రీయతను జోడించింది. మొదటి రెండేళ్లలోనే సుమారు 80 జానపద గీతాలను ఆలపించింది. నల్లమద్ది చెట్టు కింద అనే పాటతో పేరు తెచ్చుకుంది. యూట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తూ 30 మిలియన్లకు పైగా వ్యూయర్‌షిప్‌ సంపాదించింది. ఇటీవల బతుకమ్మ కోసం ఆలపించిన పాటలూ జనాదరణ పొందాయి.

ఏమే పిల్లా అన్నప్పుడల్లా.. : శిరీష 
రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డినగర్‌కు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు అశోక్‌ కూతురు శిరీష. పాటల ప్రయాణంలో దూసుకుపోతోంది. చిన్ననాడు దసరా ఉత్సవాల్లో పాడాలని ప్రోత్సహించిన నాన్న మాటలే ఆ తర్వాత కాలంలో తనకో కెరీర్‌ను  సృష్టించాయి. పసితనంలో అక్కడే ఆర్కెస్ట్రా నిర్వహిస్తున్న ప్రదీప్‌ శిరీష స్వర మాధుర్యం, లయ జ్ఞానాన్ని గుర్తించాడు. శిక్షణ ఇస్తే మంచి గాయని అవుతుందని ఆమె తండ్రిని ఒప్పించాడు.

ఫలితంగా ఆర్కెస్ట్రా సింగర్‌గా చాలాచోట్ల కచేరీలు చేసింది. తర్వాత యూట్యూబ్‌ స్టార్‌ అయ్యింది.నాలుగేళ్లలోనే వెయ్యి పాటలు ఆలపించిన శిరీష, పాటలు, వాటి షూటింగ్‌లతో బిజీ అయిపోయింది. ఏమే పిల్లా అన్నప్పుడల్లా.. అనే జానపద పాటతో ప్రజల గుండెల్లో చోటు దక్కించుకుంది. సినీ తారలు సైతం ఈ పాటకు స్టెప్పులేశారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో శిరీష పాటలకు లక్షల సంఖ్యలో వ్యూయర్స్‌ ఉన్నారు. ఇటీవల రూపొందించిన బతుకమ్మ పాటలు కూడా మంచి గుర్తింపు పొందాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement