సాక్షి, హైదరాబాద్: ఉద్యమ పాట ఊపిరి వదిలింది. తెలంగాణ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్(39) హఠాన్మరణం చెందారు. గత అర్ధరాత్రి గుండెపోటుకి గురైన ఆయన్ని ఆస్పత్రులకు తరలించగా.. చివరకు ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది.
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని కారుకొండ ఫామ్‌హౌజ్‌కు నిన్న ఆయన తన కుటుంబ సభ్యులతో వెళ్లారు. అయితే.. అర్ధరాత్రి ఆయన అస్వస్థతకు గురికాగా.. స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ పరిస్థితి విషమించడంతో.. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే.. అప్పటికే ఆలస్యం అయ్యిందని.. సాయిచంద్ మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు.
వనపర్తి జిల్లా అమరచింత సాయిచంద్ స్వస్థలం. విద్యార్థి దశ నుంచే గాయకుడిగా మంచి పేరుంది ఆయనకు. ఉద్యమ సమయంలో తన పాటలతో స్ఫూర్తిని రగిల్చారు ఆయన. జానపద పాటలతో సాగే పలు టీవీషోలలోనూ ఆయన సందడి చేశారు. ఉద్యమ కళాకారుడి గుర్తింపు పొందిన సాయిచంద్‌ను రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ పదవితో గౌరవించింది తెలంగాణ సర్కార్. తాజాగా అమరవీరుల జ్యోతి ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఆయన కనిపించారు.
చిన్నవయసులోనే సాయిచంద్ హఠాన్మరణం చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ పలువురు కళాకారులు, ఉద్యమకారులు, నేతలు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. గతంలో ఆయనకు గుండెపోటు ఏమీ రాలేదని.. అనారోగ్య సమస్యలేవీ లేదని.. అర్ధరాత్రి భోజనం దాకా కూడా బాగానే ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: కేసీఆర్‌కు రాజకీయ గురువు ఈయనే!
Comments
Please login to add a commentAdd a comment