ఇన్‌స్టాగ్రామ్‌తో సోషల్‌మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్యకు పాల్పడటం ఆమె ఫాలోవర్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె ఎక్కువగా జానపదాలు పాడుతూ ఎందరినో అభిమానులను సంపాదించుకుంది. జీవితంలో పెద్ద సింగర్ కావాలని ఎన్నో కలలు కన్నది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ సంగీత కార్యక్రమాలు జరిగినా సింగర్ శృతి తప్పకుండా కనిపిస్తుంది. అయితే, ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో అభిమానులు కూడా షాక్ అయ్యారు.
ఇన్‌స్టాగ్రామ్‌తో పరిచయమై.. మూడు ముళ్లతో ఒకటై.. పట్టుమని నెల గడవకముందే నవ వధువు సింగర్ శృతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి ఎర్ర భిక్షపతి, సత్యమ్మ దంపతుల కుమారుడు ఎర్ర దయాకర్ హైదరాబాద్‌లో క్యాబ్ నడపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తిమ్మాపూర్ గ్రామానికి శ్యామల, రమేశ్ కుతూరు, ఫోక్ సింగర్(యూట్యూబ్) శృతి (26) ఇన్‌స్టాగ్రామ్‌లో పేరడి పాటలతో ఫేమస్ అయ్యింది.
ఇన్‌స్టాగ్రామ్ వల్ల ఇద్దరి మధ్య కొన్ని నెలల కిందట పరిచయం ఏర్పడి ప్రేమపెళ్లి వరకు వచ్చింది. ఇద్దరి ప్రేమ విషయం ఇరువురి తల్లిదండ్రులకు తెలిసింది. యువతి తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితుల కారణంగా పెళ్లికి కొద్ది రోజులు ఆగాలని చెప్పడంతో వేచి చూశారు. కానీ అనివార్య కారణాల వల్ల నవంబర్ 27న పీర్లపల్లి గ్రామంలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే, వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు, బంధువులు హాజరు కాలేదు. నవ దంపతులు పీర్లపల్లిలోనే ఉంటున్నారు. బుధవారం గ్రామంలోనే దయాకర్ వాళ్ల కులానికి చెందిన వారి దశదినకర్మకి తల్లిదండ్రులతో కలిసి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో శృతిని కూడా తీసుకెళ్లడానికి దయాకర్ ఇంటికి రాగా ఉరేసుకొని కనిపించింది. వెంటనే స్థానికులకు, శృతి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నాలుగు నెలల గర్భిణి
ప్రస్తుతం శృతి నాలుగు నెలల గర్భిణి కాగా ఇంటి వద్దనే ఉంటుంది. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య చేసుకొని ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. వరకట్నం కోసమే శృతిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి వద్ద ఇరువురి కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు సముదాయించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రమోహన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment