Bathukamma 2022- Song: తెలంగాణలో బతుకమ్మ పండుగ సందడి మొదలైంది. ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మతో ఆడపడుచుల సంబరాల వేడుక ఆరంభమైంది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక్కచేట చేర్చి.. చుట్టూ తిరుగుతూ చప్పట్లతో తమ అనుభవాలు, ఆనందాలు, కష్టాలనే పాటలుగా మలిచి గౌరమ్మను కొలుస్తారు ఆడబిడ్డలు.
ఇక ఏ పండక్కి పుట్టింకి వెళ్లినా వెళ్లకపోయినా చాలా మంది ఆడపడుచులు ఈ పండుగకు మాత్రం అమ్మగారింటికి వెళ్తారు. మరి అలా వెళ్లాలంటే అత్తింటి వారి అనుమతి తీసుకోవాలి కదా! ఓ ఆడబిడ్డను పుట్టింటికి తీసుకువెళ్లడానికి ఆమె అన్నలు రాగా.. అత్తమామలు, బావ- యారాలు(తోడికోడలు), ఆపై భర్తను అడిగి అనుమతి పొందిన తీరును పాటగా మలిస్తే... ఇలా..
‘‘కలవారి కోడలు ఉయ్యాలో..
కనక మహాలక్ష్మి ఉయ్యాలో..
కడుగుతున్నది పప్పు ఉయ్యాలో..
కడవల్లోనబోసి ఉయ్యాలో..
అప్పుడే వచ్చెను ఉయ్యాలో..
ఆమె పెద్దన్న ఉయ్యాలో..
కాళ్లకు నీళ్లిచ్చి ఉయ్యాలో..
కన్నీళ్లు తీసింది ఉయ్యాలో..
ఎందుకు చెల్లెలా ఉయ్యాలో..
ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో..
తుడుచుకో కన్నీళ్లు ఉయ్యాలో..
ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో..
ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో..
వెళ్లి వద్దామమ్మ ఉయ్యాలో..
చేరి నీవారితో ఉయ్యాలో..
చెప్పిరాపోవమ్మ ఉయ్యాలో..
పట్టెమంచం మీద ఉయ్యాలో..
పవళించిన మామ ఉయ్యాలో..
మాయన్నలొచ్చిరి ఉయ్యాలో..
మమ్ముబంపుతార ఉయ్యాలో..
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో..
మీ అత్తనడుగు ఉయ్యాలో..
అరుగుల్ల గూసున్న ఉయ్యాలో..
ఓ అత్తగారు ఉయ్యాలో..
మా అన్నలొచ్చిరి ఉయ్యాలో..
మమ్ముబంపుతార ఉయ్యాలో..
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో..
మీ బావనడుగు ఉయ్యాలో..
భారతం సదివేటి ఉయ్యాలో..
బావ పెద్ద బావ ఉయ్యాలో..
మా అన్నలొచ్చిరి ఉయ్యాలో..
మమ్ముబంపుతార ఉయ్యాలో..
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో..
మీ అక్కనడుగు ఉయ్యాలో..
వంటశాలలో ఉన్న ఉయ్యాలో..
ఓ అక్కగారు ఉయ్యాలో..
మా అన్నలొచ్చిరి ఉయ్యాలో..
మమ్ముబంపుతార ఉయ్యాలో..
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో..
మీ భర్తనే అడుగు ఉయ్యాలో..
రచ్చలో గూర్చున్న ఉయ్యాలో..
రాజేంద్ర భోగి ఉయ్యాలో..
మా అన్నలొచ్చిరి ఉయ్యాలో..
మమ్ముబంపుతార ఉయ్యాలో..
కట్టుకో చీరలు ఉయ్యాలో..
పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో..
ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో..
వెళ్లిరా ఊరికి ఉయ్యాలో..’’
– సేకరణ: తొడుపునూరి నీరజ, కరీంనగర్ – విద్యానగర్(కరీంనగర్)
Comments
Please login to add a commentAdd a comment