బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డునంబర్–12లోని ఎన్‌బీటీనగర్ ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో నిబంధనలకు విరుద్ధంగా డీజే ఏర్పాటు చేయడంతో పాటు గడువు ముగిసిన తర్వాత కూడా సౌండ్ పొల్యుషన్‌కు పాల్పడిన ఘటనలో నగర మేయర్‌తో పాటు మరో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ నెల 10వ తేదీ రాత్రి 10 గంటల çసమయంలో బంజారాహిల్స్ రోడ్డునంబర్–12లోని ఎన్‌బీటీనగర్‌లో అమ్మవారి విగ్రహాల నిమజ్జన ఊరేగింపుతో పాటు మండపాలను కానిస్టేబుళ్లు ఎస్‌కే నజీర్ అహ్మద్, హోంగార్డు సాయి ప్రసాద్‌లు పర్యవేక్షిస్తున్నారు.
రాత్రి 11.40 గంటల ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల ముందు జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో భారీ సౌండ్‌తో డీజే ఏర్పాటు చేశారని, శబ్ద కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో నజీర్ అహ్మద్, సాయిప్రసాద్‌లు అక్కడికి చేరుకుని డీజేను ఆపాల్సిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అక్కడికి చేరుకుని పోలీసులు ఇందులో జోక్యం చేసుకోవద్దని, మ్యూజిక్‌ను కొనసాగించాలని వారికి సూచించారు.
భారీ శబ్ద కాలుష్యంతో ఈవెంట్‌ను అలాగే కొనసాగించారని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కానిస్టేబుల్ నజీర్ అహ్మద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బతుకమ్మ వేడుకల నిర్వాహకులు కందాడి విజయ్‌కుమార్, మ్యూజిక్ ప్లే చేస్తున్న మహ్మద్ గౌస్, జోక్యం చేసుకోవద్దంటూ చెప్పిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై బంజారాహిల్స్ పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 223, 280, 292, 49 రెడ్‌విత్ 3 (5), సెక్షన్ 21/76 సీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment