బతుకమ్మ సంబరాలు షురూ.. నేడే ఎంగిలిపూల బతుకమ్మ | Bathukamma 2023: Festival Start On Saturday With Engili Pula Bathukamma | Sakshi
Sakshi News home page

బతుకమ్మ సంబరాలు షురూ.. నేడే ఎంగిలిపూల బతుకమ్మ

Published Sat, Oct 14 2023 11:28 AM | Last Updated on Sat, Oct 14 2023 12:06 PM

Bathukamma 2023: Festival Start On Saturday With Engili Pula Bathukamma - Sakshi

తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని బతుకమ్మ చాటిచెబుతుంది. బతుకమ్మ అంటేనే ఆడబిడ్డలా పండుగ.. దసరా ఉత్సవాలతో సమానంగా మహిళలు వైభవంగా నిర్వహించే వేడుక. దేశంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే పండుగకు సమయం ఆసన్నమైంది. భాద్రపద అమావాస్య రోజు నుంచి తొమ్మిది రోజులపాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తారు.

బతుకమ్మ పండగకు తెలంగాణ ముస్తాబైంది. ఏర్పాట్లకు సర్వం సిద్ధమయ్యాయి. నేటి(శనివారం) నుంచే రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి.  ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై.. చివరిరోజైన దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో ముగియనుంది. ఈ తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకోనున్నారు.

తీరొక్క పూలతో..
ప్రకృతిలో సూర్యచంద్రులను కొలిచిన విధంగానే వివిధ రకాల పూలను కొలిచే పండుగ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. తీరొక్క రంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను చేసి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను పాట రూపంలో పాడుతూ మహిళలు బతుకమ్మ ఆడుతారు. ఆడబిడ్డలను ఇళ్లకు ఆహ్వానించి కుటుంబమంతా సంబరాలు చేసుకుంటారు.

బతుకమ్మ ఒక సామాజిక ఉత్సవం. కుల, మత, వర్గ, వృత్తి, ప్రాంత సంప్రదాయాలకు అతీతంగా బతుకమ్మ వేడుక నిర్వహిస్తారు. బతుకమ్మ పండుగ వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. ప్రకృతిలో లభించే అన్ని రకాల పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడుతారు.గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి ఇలా రకరకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు

ఒక్కో రోజు.. ఒక్కోలా..
మొదటి రోజు:  బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. అమ్మకు తులసి ఆకులు, వక్కలు నైవేద్యంగా సమర్పిస్తారు.

రెండో రోజు: బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. ఇది ఆశ్వీయుజ మాసం మొదటి రోజైనపౌడ్యమి రోజున నిర్వహిస్తారు. చప్పిడిపప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు.

మూడో రోజు: బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈ రోజున ముద్దపప్పు, బెల్లం, పాలు, ఇతర పాల పదార్థాలతో అమ్మకు నైవేద్యం సమర్పిస్తారు.

నాలుగో రోజు: నానబియ్యం బతుకమ్మను చేస్తారు. అంటే నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం వంటివి అమ్మవారికి సమర్పిస్తారు.

ఐదో రోజు: అట్ల బతుకమ్మ అంటారు. ఈరోజు అట్లు(దోసలు) తయారు చేస్తారు. అమ్మకు నైవేద్యంగా పెడతారు.

ఆరో రోజు: అలిగిన బతుకమ్మ అంటారు. ఈ రోజు బతుకమ్మ పేర్చరు. ఎలాంటి నైవేద్యం కూడా పెట్టరు.

ఏడో రోజు: వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు. సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి, నూనెలో వేయిస్తారు. వాటిని అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.

ఎనిమిదో రోజు: వెన్నముద్దల బతుకమ్మ అని పిలుస్తారు. నువ్వులు, వెన్నముద్ద, బెల్లం వంటి పదార్థాలు అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.

తొమ్మిదో రోజు: సద్దుల బతుకమ్మ. చాలా ముఖ్యమైన రోజు. ఇదే రోజు అశ్వయుజ అష్టమి.. దుర్గాష్టమి. సద్దుల బతుకమ్మను పెద్ద బతుకమ్మ అని కూడా పిలుస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరి అన్నం నువ్వుల అన్నం అమ్మవారికి సమర్పిస్తారు. దీంతో బతుకమ్మ ఉత్సవాలను ముగిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement