
పదివేల బతుకమ్మలతో ముగింపు వేడుక
దేశంలోనే అతిపెద్ద పూల వేడుక అయిన బతుకమ్మ పండుగ ముగింపు కార్యక్రమాన్ని తెలంగాణ సాంస్కృతిక శాఖ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. పదివేల బతుకమ్మలు గురువారం ఈ ఊరేగింపులో పాల్గొననున్నాయి. లాల్‌బహదూర్ స్టేడియంలో బతుకమ్మ ముగింపు వేడుకలు జరుగనున్నాయి. స్టేడియంలో 1200 వుంది వుహిళలు పదివేల బతుకమ్మలను తీర్చిదిద్దనున్నారు. వీటిలో వంద బతుకమ్మలను ఐదడుగుల ఎత్తున నిలపనున్నారు.
ముగింపు వేడుకలు తిలకించేందుకు వీలుగా 650 బస్సులను స్టేడియం వరకు ప్రత్యేకంగా నడపనున్నారు. వీటి ద్వారా దాదాపు పాతికవేల మంది మహిళలు ఇక్కడకు చేరుకోనున్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ కవిత, తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో లాల్‌బహదూర్ స్టేడియం నుంచి బతుకమ్మల ఊరేగింపు హుస్సేన్‌సాగర్ వరకు కనుల పండువగా సాగనుంది. హుస్సేన్‌సాగర్ వద్ద జరగనున్న కార్యక్రమాన్ని తిలకించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌లతో పాటు జ్వాలా గుత్తా, పి.వి.సింధు తదితర సెలిబ్రిటీలు హాజరు కానున్నారు.