‘తెలంగాణ సాంస్కృతిక సారథి’కి శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ధూంధాం వంటి కార్యక్రమాల ద్వారా కీలక భూమిక పోషించిన కళాకారుల అభ్యున్నతికి తోడ్పడే కొత్త పథకానికి సీఎం చంద్రశేఖర్‌రావు శ్రీకారం చుట్టారు. ‘తెలంగాణ సాంస్కృతిక సార థి’ పేరుతో కేసీఆర్ రూపకల్పన చేసిన ఈ పథకం.. సాంస్కృతిక, సమాచార శాఖలకు అనుబంధంగా పనిచేయనుంది. కళాకారులకు ఉపాధి కల్పించడంతో పాటు.. ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లే ప్రచార కార్యక్రమాన్ని ఇది పర్యవేక్షిస్తుంది. ఇందులో భాగంగా దాదాపు 500 మంది కళాకారులకు ఉద్యోగావకాశాలు కల్పించటంతో పాటు.. వేల మంది కళాకారులకు ఉపాధి మార్గాలను చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించే బాధ్యతను ప్రభుత్వ సలహాదారు రమణాచారికి సీఎం అప్పగించారు.
మంగళవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తన నివాసంలో రమణాచారి, ప్రముఖ కవులు సిద్ధారెడ్డి, గోరటి వెంకన్న, జయరాజ్, మిట్టపల్లి సురేందర్, యశ్పాల్, దేశపతి శ్రీనివాస్, వరంగల్ శ్రీనివాస్, మార్త రవి తదితరులతో ఈ అంశంపై చర్చించారు. ఎంతోమంది కళాకారులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారని... రాష్ట్ర అభివృద్ధిలో వారందరినీ భాగస్తులను చేయాల్సిన అవసరముందని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అలాంటి వారందరికీ సరైన పారితోషికం అందించి, ఉపాధి కల్పించటం అవసరమని పేర్కొన్నారు. తెలంగాణలోని కవులు, కళాకారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం కల్పిస్తుందని కేసీఆర్ చెప్పారు.