రేపటి నుంచే బతుకమ్మ
కొత్త రాష్ట్రంలో తొలి పండుగకు భారీ ఏర్పాట్లు
- జిల్లాకు రూ.10 లక్షలు విడుదల చేసిన ప్రభుత్వం
- యంత్రాంగాన్ని సన్నద్ధం చేసిన కలెక్టర్
- పంచాయతీ పరిధిలో సర్పంచ్‌లకు బాధ్యత
- మహిళా ఉద్యోగులకు మధ్యాహ్నం వరకే విధులు
హన్మకొండ అర్బన్ : ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన బతుకమ్మ వేడుకకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుగుతున్న తొలి బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 10లక్షలు విడుదల చేసింది. బతుకమ్మ ఏర్పాట్లపై ఇటీవల కలెక్టర్ జి.కిషన్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్‌లు బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అందుకోసం పంచాయతీ నిధులు వాడుకునే వెసులుబాటు కల్పించారు. గ్రామాల్లో బతుకమ్మలు ఆడే ప్రదేశాల్లో చదును చేయించడం, లైట్ల ఏర్పాటు, రోడ్ల మరమ్మతు వంటి పనులు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
నగరంలో హంగామా...
గతంలో ప్రభుత్వం నిధులు ఇవ్వని రోజుల్లో.. వరంగల్ నగరంలో ఆ పనులు నగర పాలక సంస్థ చేసేది. ప్రస్తుతం రూ.10 లక్షల వరకు నిధులు వస్తుండడంతోగతంకన్నా మెరుగైన ఏర్పాట్లు చేసేందుకు చర్యలుతీసుకుంటున్నారు. ఉర్సుగుట్ట, ఓసిటీ, రంగశాయిపేట, పద్మాక్షిగుట్ట, దేశాయిపేట, సోమిడి, వడ్డేపల్లి చెరువు, బంధం చెరువు తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో విద్యుత్ దీపాల ఏర్పాటు, రోడ్ల మరమ్మతు, చెత్త తొలగించడం వంటి పనులు ఇప్పటికేప్రారంభించారు. ఉత్సవాల సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సాంసృ్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఉద్యోగుల్లో ఉత్సాహం...
ఈసారి బతుకమ్మ ఉత్సవాల సందర్బంగా మహిళా ఉద్యోగులు మధ్యాహ్నం 2గంటల వరకు విధులు నిర్వర్తించి వెళ్లే వెసులుబాటు ప్రభుత్వం కల్పించడంతో మహిళా ఉద్యోగుల్లో పండుగ ఉత్సాహం రెట్టింపయింది. చాలా ఏళ్ల తరువాత తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడుకునే అవకాశం కలుగుతోందని వారు ఆనందం వ్యక్తం చే స్తున్నారు. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో ఈనెల 25న బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల జరిగిన టీఎన్జీవోస్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో టీఎన్జీవోస్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు రేచల్ ఈ విషయం తెలిపారు.
స్థలాలు సందర్శించిన ఆర్డీవో
నగరంలో ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా వరంగల్ ఆర్డీవో వెంకటమాధవరావు సోమవారం బంధంచెరువు, వడ్డేపల్లిచెరువు, సోమిడి, పద్మాక్షి గుట్ట తదితర ప్రాంతాలు సందర్శించారు. చేపట్టాల్సిన పనులపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. లైటింగ్ ఏర్పాట్లు, ముళ్ల కంచెలు తొలగించాలని చెప్పా. మహిళలకు ఏలాంటి ఇబ్బందులూ కలుగకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు.