చిలుకూరులో బతుకమ్మ సంబురాలు
సోమవారం నుంచి 20వ తేదీ వరకు..
* జిల్లాస్థాయిలో కార్యక్రమాలన్నీ ఇక్కడే
* చిలుకూరు మహిళా ప్రాంగణంలో పండుగ వాతావరణం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న బతుకమ్మ పండుగకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఉత్సవాలకు మొయినాబాద్ మండలం చిలుకూరు వేదికగా నిర్ణయించింది. సోమవారం నుంచి పది రోజులపాటు జరిగే బతుకమ్మ సంబరాల్లో రోజుకోవిధంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టనున్నారు.
14వ తేదీన జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో చిలుకూరులోని మహిళా ప్రాంగణం (టీటీడీసీ)లో 16న వికారాబాద్‌లో జాగృతి సంస్థ ఆధ్వర్యంలో, 17న కలెక్టరేట్ ఆవరణలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. మండల కేంద్రాల్లోనూ గతేడాది మాదిరిగా సంబరాలు నిర్వహించాల్సిందిగా కలెక్టర్ రఘునందన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.
సంబరాలు ఇలా..
12న స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మలు, పాఠశాల, కళాశాల విద్యార్థినులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 13న బాలికా సంరక్షణ అంశంపై విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు, 14న విద్యార్థినులకు వివిధ అంశాల్లో పోటీలు, 15న మహిళా ప్రజాప్రతినిధులతో మహిళా సాధికారత ప్రదర్శన, 16న బాలికలకు రంగోలీ పోటీలు, 17న మాతాశిశు సంరక్షణ పథకాలపై ప్రదర్శనలు, 18న మహిళల ఆర్థిక స్వాలంబనపై ప్రదర్శనలు, 19న మహిళా ఉద్యోగిణులతో ఆటాపాట, 20న సాంస్కృతిక ప్రదర్శనలు, సంబరాల ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు కూడా అందిస్తారు. అనంతరం 21న హైదరాబాద్‌లో జరిగి రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో జిల్లా తరఫున 100 మంది బృందం పాల్గొననుంది.