‘బతుకమ్మ’తో బతుకుదెరువు | Welfare schemes on Bathukamma festival | Sakshi
Sakshi News home page

‘బతుకమ్మ’తో బతుకుదెరువు

Published Wed, Jun 21 2017 2:09 AM | Last Updated on Wed, Aug 15 2018 8:57 PM

అంగన్‌వాడీలకు ప్రభుత్వం ఇవ్వనున్న చీర ఇదే.. - Sakshi

అంగన్‌వాడీలకు ప్రభుత్వం ఇవ్వనున్న చీర ఇదే..

- కేటీఆర్‌ చొరవతో.. నేతన్నకు చేతినిండా పని..
- సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మొత్తం రూ.151.76 కోట్ల ఆర్డర్లు
- ఆర్వీఎం, కేసీఆర్‌ కిట్లు, బతుకమ్మ చీరలు, కేజీబీవీ వస్త్రాలు
- 15 వేల మంది నేత కార్మికులకు పవర్‌లూమ్స్‌ ద్వారా పని


సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వస్త్రపరిశ్రమలో పనిచేసే చేనేత కార్మికులకు ముందుగానే బతుకమ్మ పండుగ వచ్చింది. కార్మికుల ఆత్మహత్యలు.. ఆకలిచావులతో నిత్యం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వస్త్ర పరిశ్రమను గాడిలో పెట్టేందుకు, కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం సంకల్పించింది. ఈక్రమంలోనే వచ్చే బతుకమ్మ పండుగ సందర్భంగా తెల్లరేషన్‌ కార్డుదారులకు ఉచితంగా చీరలు అందించేందుకు నిర్ణయిం చింది. ఇందుకు 86 లక్షల చీరలు అవసరమని గుర్తించింది. వీటి తయారీ ఆర్డర్లను సిరిసిల్ల నేత కార్మికులకు ఇచ్చింది. ప్రస్తుతం పవర్‌లూమ్స్‌(మరమగ్గాల)పై చీరల ఉత్పత్తి శరవేగంగా సాగుతోంది.

రూ.151.76 కోట్ల ఆర్డర్లు..: రాజీవ్‌ విద్యా మిషన్‌(ఆర్వీఎం) ద్వారా స్కూల్‌ విద్యార్థుల యూనిఫామ్స్‌ కోసం కోటి మూడు లక్షల మీటర్ల వస్త్రాన్ని రూ.40.76 కోట్లు వెచ్చించి ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు చేసింది. ఈ వస్త్రాన్ని సిరిసిల్ల నేతకార్మికులు తయారు చేసి అందించారు. ఆ వెంటనే కేసీఆర్‌ కి ట్ల కోసం 1.18 లక్షల చీరలకు ఆర్డ ర్లు వచ్చాయి. ఒక్కో చీర, జాకెట్‌ ఉత్పత్తికి 6.30 మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేశారు. కేసీఆర్‌ కిట్ల కోసం మొత్తంగా 7.43 లక్షల మీటర్ల వస్త్రాన్ని తయారు చేసి అందించారు. దీని ద్వా రా నేతన్నలకు రూ.1.32 కోట్ల ఆదాయం సమకూరింది. కేసీఆర్‌ కిట్ల కోసం నెలకు 50 వేల చీరలకు 3.15 లక్షల మీటర్ల వస్త్రాన్ని అందించాల్సి ఉంది.

దీని ద్వారా ప్రతినెలా రూ.56 లక్షల ఉపాధి వస్త్ర పరిశ్రమకు లభిస్తుంది. బతుకమ్మ పండగకు 86 లక్షల మంది మహిళలకు చీరలు అందించేందుకు ప్రభుత్వం ఆర్డర్లు ఇ చ్చింది. ఇందుకోసం 5.41 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేయాల్సి ఉంది. దీంతో సిరిసిల్లలోని మరమగ్గాలపై బతుకమ్మ చీరల ఉత్పత్తి జోరుగా సాగుతోంది. వీటి ఆర్డరు విలువ రూ. 113 కోట్ల మేరకు ఉంటుంది. చేనేత, జౌళిశాఖ ద్వారా నేతన్నలకు ఈ ఏడాది రూ.151.76 కోట్ల విలువైన ప్రభుత్వ ఆర్డర్లు వచ్చాయి.

నేత కార్మికులకు మెరుగైన ఉపాధి..
సిరిసిల్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా 34 వేల మరమగ్గాలు ఉండగా.. ఇందులో 7 వేల మగ్గాలపై కాటన్‌ వస్త్రం ఉత్పత్తి అవుతోంది. మరో 27 వేల మగ్గాలపై పాలిస్టర్‌ వస్త్రోత్పత్తి చేస్తున్నారు. పాలిస్టర్‌ గుడ్డ మీటరుకు రూ.5 నుంచి రూ.6కు అమ్ముడుపోయేది. కానీ, ప్రభుత్వ ఆర్డర్లతో మెరుగైన కూలిని నిర్ణయించారు. బతుకమ్మ చీర ధర రూ.230 ఉండగా.. వస్త్రం ఖరీదు తెల్లదానికి రూ.112, కలర్‌ బట్టకు రూ.148గా నిర్ణయించారు. ఇందులో ఒక్కమీటరుకు ప్లెయి న్‌ బట్టకు కూలిగా రూ.5 గా నిర్ణయించారు. ఇందులో పనిచేసిన కార్మికుడికి రూ.2.25, సాంచాల యజమాని(ఆసామికి) మీటరుకు రూ.2.75 నిర్ణయించారు.

కలర్‌బట్ట మీటరు ధర రూ.6గా నిర్ణయించగా ఇందులో కార్మికుడికి మీటరుకు రూ.3, ఆసాములకు రూ.3 కూలి చెల్లిస్తారు. ఎనిమిది రంగులతో చీరలు ఉత్పత్తి అవుతున్నాయి. తద్వారా శ్రమించే కార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తోంది. ఒక్కోకార్మికుడికి నెలకు రూ.12 వేల వరకు ఆదాయం గిట్టుబాటవుతోంది. మరోవైపు.. ఆసాములకు మంచి బతుకుదెరువు సమకూరుతోంది. సిరిసిల్లలో ఐదువేల మగ్గాలపై బతుకమ్మ చీరల ఉత్పత్తి మొదలైంది.10 వేల మంది కార్మికులు, మరో 3,500 మంది అనుబంధ రంగాల కార్మికులు, 1,500 ఆసాములు బతుకమ్మ చీరలతో ఉపాధి పొందుతున్నారు.

మళ్లీ క్రిస్మస్‌ ఆర్డర్లు..
బతుకమ్మ వస్త్రోత్పత్తి ఆర్డర్లు పూర్తికాగానే క్రిస్మస్‌ ఆర్డర్లు సిరిసిల్లకు రానున్నాయి. ఇప్పటికే కేజీబీవీ స్కూల్స్‌ విద్యార్థులకు చెక్స్‌ డిజైన్‌ సూటింగ్, షర్టింగ్‌ వస్త్రోత్పత్తి ఆర్డర్లు సిరిసిల్ల శివారులోని టెక్స్‌టైల్‌ పార్క్‌ వస్త్రోత్పత్తిదారులకు ఇచ్చారు. బతుకమ్మ చీరలకు 40 రకాల రంగులను ప్రింట్‌ చేయనున్నాయి. ఓపెన్‌ టెండర్‌ ద్వారా ప్రింటింగ్‌ ఆర్డర్లను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబరు 1 నాటికి ఆర్డర్లు పూర్తిస్థాయిలో అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్, ఆర్వీఎం, కేజీబీవీ, అంగన్‌వాడీ, వైద్య, ఆరోగ్యశాఖ ఆర్డర్లతో సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని లభిస్తోంది. ఇదే ఒరవడి కొనసాగితే సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు శాశ్వత ఉపాధి లభించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement