
బతుకమ్మ పండుగకు భారీ ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: బతుకమ్మ పండుగకు జీహెచ్‌ఎంసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈమేరకు అధికారులు సిద్ధమయ్యారు. 30వేల బతుకమ్మలతో ఎల్‌బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు ఊరేగింపుగా వెళ్లనున్నారు. దీంతో ఆ మార్గంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్యాంక్‌బండ్‌పై రోటరీ క్లబ్ వద్ద బతుకమ్మ ఘాట్ పనులకు సిద్ధమయ్యారు.
ఆ మార్గాల్లోని రహదారుల మరమ్మతులు చేయడంతో పాటు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ నిధులు మంజూరు చేశారు. వెంటనే పనులు పూర్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ట్యాంక్‌బండ్ ప్రాంతంలో పనులు పరిశీలించారు. ఆయా పనులకు కేటాయింపులిలా ఉన్నాయి....
ఎల్‌బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు ఫుట్‌పాత్ లు, టేబుల్ డ్రెయిన్ల మరమ్మతులకు రూ. 2.80 లక్షలు
ట్యాంక్‌బండ్‌పై టాయ్‌లెట్ల రిపేర్లు, రంగులు, టేబుల్ డ్రెయిన్ పనులకు రూ.4.50 లక్షలు
రోటరీ పార్కు వద్ద బతుకమ్మ ఘాట్ నిర్మాణానికి రూ.34.86 లక్షలు
రోటరీ పార్కు వద్ద ఫౌంటేన్ మరమ్మతులకు రూ.9.93 లక్షలు.
7,8,9,10 సర్కిళ్లలో విద్యుత్ దీపాలతో అలంకారానికి రూ. 11.08 లక్షలు వీటితోపాటు నగరంలోని ముఖ్య కూడళ్లలో పెద్ద సైజు బతుకమ్మలను ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పెద్ద సైజు బతుక మ్మలను ఏర్పాటు చేశారు.